Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 10th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu September 10th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu September 10th 2022
Current Affairs in Telugu September 10th 2022

Loan apps: అక్రమ రుణ యాప్‌లకు చెక్‌!.. ఆర్థిక మంత్రి సీతారామన్‌ నిర్ణయం 

డిజిటల్‌ మోసాల ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో అక్రమ రుణాల యాప్‌లను కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా చట్టబద్ధంగా అనుమతులు పొందిన యాప్‌ల లిస్టును రిజర్వ్‌ బ్యాంక్‌ తయారు చేయనుండగా, అవి మాత్రమే యాప్‌ స్టోర్స్‌లో అందుబాటులో ఉండేలా ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ  (మెయిటీ) జాగ్రత్తలు తీసుకోనుంది. వివిధ శాఖలు, ఆర్‌బీఐ అధికారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.

Also read:  RBI: నవంబర్‌ 30 నుంచి డిజిటల్‌ రుణాలకూ కొత్త నిబంధనలు
 
వీటి ప్రకారం మనీ లాండరింగ్‌ కోసం ఉపయోగించేందుకు అద్దెపై తీసుకుని ఉండొచ్చని భావిస్తున్న ఖాతాలను ఆర్‌బీఐ పర్యవేక్షించనుంది. అలాగే నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) దుర్వినియోగం కాకుండా నిద్రాణంగా ఉంటున్న సంస్థల లైసెన్సులను సమీక్షించడం లేదా రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటుంది. అలాగే నిర్దిష్ట కాలవ్యవధిలో పేమెంట్‌ అగ్రిగేటర్ల రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యేలా చూడటం, నమోదు చేసుకోని అగ్రిగేటర్లను కార్యకలాపాలు నిర్వహించనివ్వకపోవడం వంటి అంశాలపై దృష్టి పెడుతుంది.  

Also read: 5 రాష్ట్రాలకు Grant in aid రూ. రూ.4,189.58 కోట్లు విడుదల

ఇక ఇలాంటి యాప్‌లు విస్తరించకుండా డొల్ల కంపెనీలను గుర్తించి, వాటిని డీ–రిజిస్టర్‌ చేసే బాధ్యత కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ తీసుకుంటుంది. అలాగే కస్టమర్లు, బ్యాంకు ఉద్యోగులు, చట్టాలు అమలు చేసే ఏజెన్సీలు, ఇతర వర్గాల్లోనూ సైబర్‌ భద్రతపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. 

King Charles III: ‘ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌’గా కేట్‌ మిడిల్టన్‌ 

 

 బ్రిటన్‌ నూతన రాజు చార్లెస్‌–3 తన పెద్ద కుమారుడు ప్రిన్స్‌ విలియమ్స్‌ను ‘ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌’గా, ఆయన భార్య కేట్‌ మిడిల్టన్‌ను ‘ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌’గా ప్రకటించారు. అంతేకాకుండా డ్యూక్‌ ఆఫ్‌ కార్న్‌వాల్‌గానూ విలియమ్స్‌ కొనసాగుతారు. ప్రిన్సెస్‌ డయానా తర్వాత ‘ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌’ హోదా పొందిన తొలివ్యక్తి కేట్‌ మిడిల్టన్‌ కావడం గమనార్హం.

Also read: Queen Elizabeth II: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ ఇకలేరు... కొన్ని ముఖ్య విషయాలు!

డయానా మరణం తర్వాత ఈ హోదా ఇన్నాళ్లూ ఖాళీగానే ఉంది. 

Fraudulent Loan Apps: మోసకారి లోన్‌ యాప్‌లపై ఫిర్యాదులకు ప్రత్యేక కాల్‌ సెంటర్‌: సీఏం జగన్‌ 

సామాన్యులను లక్ష్యంగా చేసుకొని మోసాలు, వేధింపులకు పాల్పడుతున్న లోన్‌యాప్‌లపై కఠిన చర్యలకు పోలీసు శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. లోన్‌యాప్‌ల ఆగడాలపై ఉక్కుపాదం మోపాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజా ఆదేశాలతో బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తోంది.  జాతీయ నోడల్‌ ఏజెన్సీ ‘ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమెర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్టీ)తో కలసి ఇటువంటి యాప్‌లపై నిషేధం విధించేందుకు సిద్ధమవుతోంది.

Also read: On online safety: 2 వేల లోన్‌ యాప్స్‌ తొలగింపు

ప్రత్యేక కాల్‌ సెంటర్‌.. 
జిల్లాలవారీగా ప్రత్యేక బృందాలు

లోన్‌యాప్‌ల మోసాలపై తక్షణం కేసులు నమోదు చేసి నేరాన్ని నిరూపించి న్యాయస్థానాల ద్వారా శిక్షలు విధించేందుకు పోలీసు శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్రస్థాయిలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న డయల్‌ 1930, సైబర్‌ మిత్ర (వాట్సాప్‌ నంబర్‌ 9121211100), సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లను అనుసంధానిస్తూ ఈ కాల్‌ సెంటర్‌ సేవలు అందిస్తుంది. దీనికి వచ్చే ఫిర్యాదులను తక్షణమే సంబంధిత పోలీసు స్టేషన్లకు నివేదించి కేసుల దర్యాప్తును పర్యవేక్షిస్తుంది. దాంతోపాటు లోన్‌ యాప్‌ వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లాలవారీగా ప్రత్యేక బృందాలను నియమించనున్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పనిచేసే ఈ బృందాలు వేధింపులకు పాల్పడే యాప్‌ కంపెనీలపై కేసుల నమోదు, బాధ్యుల అరెస్టు, విచారణ ప్రక్రియను పర్యవేక్షిస్తాయి.

Also read: Andhra Pradesh: వృద్ధి రేటులో అగ్రస్థానంలో ఏపీ

సీఈఆర్టీతో కలసి కార్యాచరణ
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గుర్తింపు ఉన్న నాన్‌ బ్యాంకింగ్‌ కంపెనీలే లోన్‌యాప్‌ ద్వారా వ్యవహారాలను నిర్వహించాలి. కానీ దేశంలో 75 శాతం లోన్‌ యాప్‌ కంపెనీలు ఆర్‌బీఐ గుర్తింపు లేనివే. ప్రధానంగా చైనా కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీలు మన దేశంలో కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్నాయి. వీటిపై ఫిర్యాదు చేస్తే ఆర్‌బీఐ నిషేధం విధిస్తుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులు నమోదు చేస్తుంది. అందుకోసం పోలీసు శాఖ కేంద్ర ఐటీ శాఖకు చెందిన సీఈఆర్టీ తో కలసి పనిచేయనుంది. ఈ కంపెనీలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకట్ట వేస్తారు. వాటికి సహకరిస్తున్న సంస్థలు, వ్యక్తులను గుర్తించి ఈడీకి నివేదిస్తారు. వీటిని నిషేధించడంతోపాటు ఐటీ, ఆర్థిక నేరాల నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేస్తారు.

Also read: Loans Writeoff : 5 ఏళ్లలో రూ. 10 లక్షల కోట్లు రద్దు

HSL: హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ కొత్త ఆవిష్కరణ

నౌకల తయారీలో రికార్డులు సృష్టిస్తున్న హిందూస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) కొత్త పరికరాన్ని ఆవిష్కరించింది. నౌకల నిర్మాణం, మరమ్మతుల సమయంలో టిగ్‌ల వెల్డింగ్‌ చేసేందుకు కాపర్‌ నికెల్‌ గన్‌ మెటల్‌ను తయారు చేసినట్లు షిప్‌యార్డ్‌ సీఎండీ హేమంత్‌ ఖత్రి తెలిపారు. ఈ పరికరం వల్ల టిగ్‌లని వెల్డింగ్‌ చేసే సమయం, ఖర్చు, శ్రమ ఆదా అవుతాయని చెప్పారు. దీని పేటెంట్‌కు కూడా దరఖాస్తు చేశామన్నారు. ఈ తరహా నూతన ఆవిష్కరణల్ని ప్రోత్సహించేందుకు ఎంఎస్‌ఎంఈలని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

Also read: Special Algorithm: హ్యాకర్ల కంట పడకుండా సమాచార ప్రసారం!

World Suicide Prevention Day: దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యలు.. మరణమే శరణ్యమా..? కానే కాదు..

సమస్య ఏదైనా ఆత్మహత్యే శరణ్యమనుకొనే వారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతోంది. జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం 2021 సంవత్సరంలో భారతదేశంలో 1,64,033 మంది కేవలం ఆత్మహత్యల ద్వారానే మృతిచెందారు. చాలా మంది చిన్న చిన్న కారణాలతోనే మానసికంగా కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నట్టు తేలింది. చిన్న వయసులోనే మానసిక రుగ్మతలు, కుటుంబ కలహాలతో కలత చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటి మృతులను కౌన్సెలింగ్‌ ద్వారా నియంత్రించే అవకాశమున్నా.. అవి కార్యరూపం దాల్చకపోవడం బాధాకరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also read: సెప్టెంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

ఏపీలో తక్కువగా..
రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో బలవన్మరణాలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో 7,043 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎక్కువ ఆత్మహత్యలు మహారాష్ట్రలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో 19,909 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తమిళనాడులో 16,883 మంది, మధ్యప్రదేశ్‌లో 14,578 మంది, పశ్చిమ బెంగాల్‌లో 13,103 మంది, కర్ణాటకలో 12,259 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. కేవలం ఈ ఐదు రాష్ట్రాల్లోనే 50.8 శాతం ఆత్మహత్యలు నమోదయ్యాయి.

Also read: World Maritime Day: అంతర్జాతీయ సముద్ర దినోత్సవం

కుటుంబ కలహాలతోనే ఎక్కువగా..
కుటుంబాల్లో చిన్న చిన్న కలహాలే అధిక శాతం ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. ఈ కలహాలతోనే 33.6 శాతం మంతి ఆత్మహత్యకు పాల్పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. చాలామంది యువతీ యువకులు కుటుంబంలో గొడవలకు మనస్తాపం చెంది క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడుతున్నారు.  ప్రేమలో విఫలమవడం వంటివీ ఎక్కువయ్యాయి. ఒంటరితనం, సామాజిక, లైంగిక వేధింపులు, హింసకు గురవడం, ఆర్థిక సమస్యలు, దీర్ఘకాలిక శారీరక సమస్యలు వంటివి కూడా ఆత్మహత్య వైపు పురిగొల్పుతున్నాయి. చెడువ్యవసనాలతో మానసిక కుంగుబాటుకు గురై మరికొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఉరేసుకోవడం, పురుగుల మందు తాగడం, నీటిలో దూకడం, ఒంటికి నిప్పు పెట్టుకోవడం వంటి మార్గాల ద్వారా ఎక్కువమంది ప్రాణాలు తీసుకుంటున్నారు.

Also read: Anti Terrorism Day: జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం ఏప్పుడు జ‌రుపుకుంటారు?

కౌన్సెలింగ్‌ మేలు
సమస్యల్లో ఉన్న వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మానసిక వేదనతో బాధ పడుతున్న వారిని సన్నిహితులు, స్నేహితులు గుర్తించాలి. వారిని వేధిస్తున్న సమస్య నుంచి బయటపడేసే మార్గాలు చూడాలి. వారిలో మనోధైర్యం కల్పించాలి. ఇంకా అవసరమైతే సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులతో కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. వారి సమస్యకు పరిష్కారాలున్నాయని, మరణమే శరణ్యం కాదని విశదీకరించి చెప్పాలి. అప్పుడే వారు ఆత్మహత్య చేసుకోవాలన్న భావన నుంచి బయటకొచ్చి మామూలు మనుషులుగా మారతారని నిపుణులు చెబుతున్నారు.

Also read: International Day of Families: అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఏప్పుడు జ‌రుపుకుంటారు?

ఆత్మహత్యలు ఇలా..
కారణం    శాతం
కుటుంబ సమస్యలు    33.6
మానసిక, శారీరక సమస్యలు    18
చెడు వ్యసనాలు    6
వైవాహిక సమస్యలు    5
ప్రేమలో వైఫల్యం    4.4
ఆర్థిక సమస్యలు    3.4
నిరుద్యోగం    2.3
పరీక్షలు తప్పడం    1.4
పేదరికం    1.2

Also read: International Museum Day: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఏప్పుడు జ‌రుపుకుంటారు?

ప్రధాన రాష్ట్రాల్లో ఆత్మహత్యల శాతం
మహారాష్ట్ర    13
తమిళనాడు    11
మధ్యప్రదేశ్‌    9.5
పశ్చిమబెంగాల్‌    8.6
కర్ణాటక    8.0
కేరళ    5.6
గుజరాత్‌    5.3
తెలంగాణ    5.3
ఛత్తీస్‌గఢ్‌‡    5.0
ఆంధ్రప్రదేశ్‌    4.6
ఒడిశా    3.6
ఉత్తరప్రదేశ్‌    3.1

Also read: International Literacy Day: అందరికీ విద్య అందేదెన్నడు?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 10 Sep 2022 05:54PM

Photo Stories