Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 22nd కరెంట్ అఫైర్స్
SpaceX: యూరప్ అంతరిక్ష ప్రయోగాలకు స్పేస్ ఎక్స్ దన్ను
లండన్: రష్యాతో బంధాలు తెంచుకున్న నేపథ్యంలో యూరప్ దేశాలు అంతరిక్ష ప్రయోగాల కోసం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌పై ఆధారపడుతున్నాయి. ఇందుకోసం స్పేస్ ఎక్స్‌తో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇప్పటికే పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. రష్యా నుంచి చేపట్టాల్సిన పలు ప్రయోగాలకు స్పేస్ ఎక్స్‌ను వేదికగా మార్చుకుంటూ వస్తోంది. అవసరమైతే అంతరిక్ష సేవల కోసం భారత్‌పై కూడా ఆధారపడతామని సంకేతాలిచ్చింది. నాసా ప్రతిష్టాత్మక డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్‌కు కొనసాగింపుగా ప్రయోగిస్తున్న హేరా ప్రోబ్‌తో పాటు యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్‌లను స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసిన ఫాల్కన్–9ల ద్వారా ప్రయోగించనున్నారు.
హిమాలయాల్లోని ఆలయాల అభివృద్ధి పనులు.. ఉపాధికీ మార్గాలు.. పలు ప్రాజెక్టులకు పునాదిరాయి
డెహ్రాడూన్: రెండు రోజుల పర్యటన నిమిత్తం అక్టోబర్ 21న ఉత్తరాఖండ్ చేరుకున్న ఆయన ప్రఖ్యాత యాత్రా స్థలాలైన కేదార్‌నాథ్, హేమ్‌కుండ్ సాహిబ్‌కు రోప్‌వే ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. అనంతరం చైనా సరిహద్దుల సమీపంలో మనా గ్రామంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘మన ఆలయాలు కేవలం భౌతిక నిర్మాణాలు మాత్రమే కాదు. వేలాది ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న ఘనమైన మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు. అవి మన జీవనాడులు’’ అని అభిప్రాయపడ్డారు.
Also read: ISRO: జూన్‌లో చంద్రయాన్ 3: ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్
ఉపాధికీ మార్గాలు
హిమాలయాల్లోని ఆలయాల అభివృద్ధి పనులు అక్కడికి యాత్రను సరళతరం చేయడమే గాక స్థానికులకు విరివిగా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాయని మోదీ చెప్పారు. స్థానికంగా వర్తక, వాణిజ్యాలకు కూడా ఎంతగానో ఊతమిస్తున్నాయన్నారు. ఈ సరిహద్దు ప్రాంతాల ఆలయాల సందర్శనకు వచ్చే పౌరులంతా తమ బడ్జెట్లో కనీసం 5 శాతం స్థానిక ఉత్పత్తులు కొనేందుకు వెచ్చించాలని కోరారు. ఈ చిన్న చర్య ఎంతోమంది స్థానికుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘దట్టమైన మంచులో నెలకొన్న ప్రఖ్యాత హేమ్‌కుండ్ సాహిబ్‌కు రోప్‌వే నిర్మాణం దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సిక్కు సోదరుల వరప్రసాదం కానుంది. ఉత్తరాన మన దేశంలో చిట్టచివరి గ్రామం ‘మన’. కానీ నా వరకూ దేశంలో ప్రతి గ్రామమూ ప్రగతికి బాటలు పరిచే తొట్టతొలి గ్రామమే.
Also read: Chandrayaan 2: చంద్రుడిపై పుష్కలంగా సోడియం
రోప్‌వే ప్రాజెక్టుల విశేషాలు...
కేదార్‌నాథ్ రోప్‌వే: రుద్రప్రయాగ్ జిల్లాలో గౌరీకుండ్ నుంచి కేదార్‌నాథ్ ఆలయం దాకా 9.7 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ప్రాజెక్టు పూర్తయ్యాక గౌరీకుండ్ నుంచి ఆలయానికి కేవలం అరగంటలో చేరుకోవచ్చు. ఎత్తైన హిమ సానువుల్లో అత్యంత కష్టతరంగా భావించే ఈ ప్రయాణానికి కనీసం 6 నుంచి 7 గంటలు పడుతోంది.
Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 20th కరెంట్ అఫైర్స్
హేమ్‌కుండ్ సాహిబ్ రోప్‌వే: గోవింద్ ఘాట్ నుంచి ఏడాది పొడవునా మంచుతో కూరుకుపోయి ఉండే హేమ్‌కుండ్ సాహిబ్ వెళ్లే దారి అత్యంత క్లిష్టమైనది. అందుకు కనీసం ఒక రోజుకు పైగా పడుతుంది. ఇప్పుడు వాటి మధ్య 12.4 కిలోమీటర్ల పొడవైన రోప్‌వే నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణం కేవలం 45 నిమిషాల్లో ముగుస్తుంది. అంతేగాక ప్రపంచ ప్రఖ్యాత వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు ముఖద్వారంగా చెప్పే ఘంగారియాను కూడా రోప్‌వే అనుసంధానించనుంది.
Liz Truss: ట్రస్‌కు ఏటా రూ.కోటి!
లండన్: బ్రిటన్ ప్రధానిగా పని చేసింది కేవలం 45 రోజులే. అయితేనేం... మాజీ ప్రధాని హోదాలో లిజ్ ట్రస్ జీవితాంతం ఏటా ఏకంగా 1.15 లక్షల పౌండ్లు రూ.1,06,36,463) పెన్షన్‌గా అందుకోనున్నారు. ప్రజా జీవితంలో చురుగ్గా ఉండే మాజీ ప్రధానులకు ఆర్థిక సాయం నిమిత్తం ఏర్పాటు చేసిన పబ్లిక్ డ్యూటీ కాస్ట్స్ అలవెన్సుల నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. 1990లో బ్రిటన్ తొలి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ రాజీనామా అనంతరం ఈ అలవెన్సును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏకంగా ఆరుగురు బ్రిటన్ మాజీ ప్రధానులు ఈ అలవెన్సు పొందుతున్నారు! ట్రస్‌తో కలిపి ఏడుగురు మాజీ పీఎంల అలవెన్సుల రూపంలో ఏటా ఖజానాపై పడే భారం 8 లక్షల పౌండ్లు.
UK Elections: ‘బ్రిటన్ ప్రధాని’ బరిలో ముగ్గురు నేతలు! రేసులో రిషి సునాక్, బోరిస్, మోర్డంట్
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాతో ఆమె వారసుడెవరన్న దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సహా పలువురు రేసులో ఉన్నారు. ఈసారి ఎన్నికల ప్రక్రియలో కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల కంటే ఎంపీల మద్దతే కీలకంగా మారింది. అభ్యర్థిగా బరిలో దిగాలంటే కనీసం 100 మంది ఎంపీల మద్దతు అవసరం. గతంలో 20గా ఉండేది.
Also read: Quiz of The Day (October 20, 2022): ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న రాజధాని నగరం ఏది?
ఎన్నిక ప్రక్రియ ఇలా...
- ఈసారి ఎన్నిక ప్రక్రియ కూడా గతంలో కంటే భిన్నంగా ఉంటుంది. 1922 కమిటీ నిబంధనల మేరకు 100 మంది ఎంపీల మద్దతున్నవారికే పోటీకి చాన్సుంటుంది. పార్లమెంటులో 357 మంది ఎంపీలున్నందున అత్యధికంగా ముగ్గురు బరిలో దిగొచ్చు.
- నామినేషన్‌కు అక్టోబర్ 24తో గడువు ముగుస్తుంది. అప్పటికల్లా ఇద్దరి కంటే ఎక్కువ మంది 100 ఎంపీల మద్దతు సాధిస్తే వారి నుంచి ఇద్దరిని ఎంపీలే అప్పటికప్పుడు ఎన్నుకుంటారు. అంటే అత్యధిక ఓట్లు పొందిన ఇద్దరు బరిలో మిగులుతారు.
- ఆ ఇద్దరిలో ఒకరిని టోరీ సభ్యులు ఆన్‌లైన్‌లో తమ నాయకుడిగా ఎన్నుకుంటారు. అక్టోబర్ 28న ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత కింగ్ చార్లెస్ –3 లాంఛనంగా కొత్త ప్రధానిని నియమిస్తారు.
- ఒకవేళ గడువులోగా 100 మంది ఎంపీల మద్దతు ఒక్కరికే లభిస్తే తదుపరి ప్రక్రియతో పని లేకుండా వారే నేరుగా ప్రధాని అవుతారు.
- ఒక ప్రధాని రాజీనామా చేసి మరొకరు పదవి చేపట్టే సమయంలో ఎన్నిక ప్రక్రియ సర్వసాధారణంగా టోరీ సభ్యుల వరకు వెళ్లదు. ఇద్దరు సభ్యులు చివర్లో మిగిలితే తక్కువ మంది ఎంపీల మద్దతున్న వారు తప్పుకుంటారు. 2016లో థెరిసా మే ప్రధాని అయినప్పుడు ప్రత్యర్థి అండ్రూ లీడ్సమ్ ఇలాగే బరి నుంచి తప్పుకున్నారు.
- అందుకే ఈ సారి ఎన్నికలో టోరీ సభ్యులు కంటే ఎంపీలే కీలకంగా ఉన్నారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 21st కరెంట్ అఫైర్స్
రేసులో వీరే...
రిషి సునాక్: భారత సంతతికి చెందిన రిషి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు. గత ఎన్నికలో ట్రస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. అత్యధిక ఎంపీల మద్దతు ఆయనకే ఉన్నా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలనని సభ్యుల్లో విశ్వాసం కలిగించలేక 21 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. ట్రస్ పన్ను రాయితీలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని మొదట్నుంచి హెచ్చరిస్తూ వచ్చిన సునాక్‌కు ఈసారి ఎంపీల మద్దతు లభించే అవకాశముంది.
Also read: Liz truss : బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా.. కారణం ఇదే? పదవి చేపట్టిన 45 రోజుల్లోనే..
బోరిస్ జాన్సన్: తాను ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి రావడానికి రిషియే కారణమన్న ఆగ్రహంతో ఉన్న జాన్సన్ మరోసారి పీఠమెక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. సొంత పార్టీ ఎంపీలు, మంత్రుల తిరుగుబాటు కారణంగా మరో దారి లేక ప్రధానిగా రాజీనామా చేసినా, జాన్సన్‌కు ఇప్పటికీ పార్టీపై పట్టుంది. ట్రస్ చేతిలో రిషి ఓటమికి జాన్సన్ తెర వెనుక మంత్రాంగమే ప్రధాన కారణమన్న ఆరోపణలున్నాయి. కరోనా సమయంలో పార్టీలు చేసుకున్న వ్యక్తిగా అప్రతిష్ట మూటగట్టుకున్న ఆయనకు ఈసారి కూడా ఎంపీలు మద్దతుగా నిలవకపోయినా సునాక్‌ని ఓడించడానికైతే ప్రయత్నిస్తారన్న వార్తలు విన్పిస్తున్నాయి.
పెన్నీ మోర్డంట్
బ్రిటన్ తొలి మహిళా రక్షణ మంత్రి. గత ఎన్నికల్లో ఎంపీల మద్దతు బాగా సంపాదించినా తుది ఇద్దరు అభ్యర్థుల్లో స్థానం దక్కించుకోలేకపోయారు. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ట్రస్‌కు మద్దతుగా నిలిచి ఆమె ప్రధాని అయ్యాక హౌస్ ఆఫ్ కామన్స్ అండ్ లార్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ప్రైవీ కౌన్సిల్‌కి నాయకురాలయ్యారు. ట్రస్‌పై ఎంపీల్లో వ్యతిరేకత ఉండడంతో ఆమె సన్నిహితురాలైన పెన్నీకి ఎంతవరకు మద్దతునిస్తారన్న అనుమానాలున్నాయి. వీరే కాకుండా మంత్రులుగా అనుభవమున్న కెమీ బాదెనోచ్, సుయెల్లా బ్రేవర్మన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆర్థిక మంత్రిగా గొప్ప పనితీరుతో ఆకట్టుకున్న రిషి, బోరిస్ మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also read: UK PM resigns: యూకే ప్రధాని ట్రస్ రాజీనామా
ISRO: నేడు జీఎస్‌ఎల్‌వీ మార్క్3 ఎం–2 రాకెట్‌కు కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అక్టోబర్ 23న అర్ధరాత్రి 00.07 సెకండ్లకు జీఎస్‌ఎల్‌వీ మార్క్3 ఎం–2 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 22న అర్ధరాత్రి 00.07 సెకండ్లకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి అక్టోబర్ 21న షార్‌లో ఎంఆర్‌ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మూడు దశల రాకెట్‌ను అనుసంధానం చేసి.. ప్రయోగవేదిక అమర్చాక.. అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. తర్వాత ప్రయోగ పనులను ల్యాబ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. బోర్డు చైర్మన్ రాజరాజన్ ఆధ్వర్యంలో ల్యాబ్ మీటింగ్ నిర్వహించారు. రాకెట్‌కు మరోమారు తుది విడత తనిఖీలు నిర్వహించి లాంచ్ రిహార్సల్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా ఈ ప్రయోగం ద్వారా యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన 5,200 కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. ఇప్పటిదాకా పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లను మాత్రమే వాణిజ్యపరమైన ప్రయోగాలకు ఉపయోగించేవారు. ఈసారి తొలిసారిగా జీఎస్‌ఎల్‌వీ మార్క్3 రాకెట్‌ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వినియోగిస్తుండటం గమనార్హం. కాగా జీఎస్‌ఎల్‌వీ మార్క్3 రాకెట్ సిరీస్‌లో ఇది ఐదో ప్రయోగం. జీఎస్‌ఎల్‌వీ మార్క్3 ఎం–2 ప్రయోగాన్ని 19 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు.
Also read: Quiz of The Day (October 21, 2022): దేశంలో అతి పొడవైన జాతీయ రహదారి?
DRDO: ‘అగ్ని ప్రైమ్’ క్షిపణి పరీక్ష విజయవంతం
బాలాసోర్: దేశీయంగా అభివృద్ధి చేసిన కొత్త తరం మధ్య శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్ ‘అగ్ని ప్రైమ్’ ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరం అబ్దుల్ కలాం దీవిలోని మొబైల్ లాంచర్ నుంచి అక్టోబర్ 21న ఉదయం 9.45 గంటలకు ఈ పరీక్ష చేపట్టినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) వెల్లడించింది. 1,000 కిలోమీటర్ల నుంచి 2,000 కిలోమీటర్ల దూరం వెళ్లగలిగే ఘన ఇంధనం కలిగిన ఈ మిస్సైల్ తాజా ప్రయోగంలో అన్ని రకాల పరామితులను చేరుకున్నట్లు ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో అమర్చిన రాడార్లు, టెలిమెట్రీ వ్యవస్థలు మిస్సైల్ నావిగేషన్‌ను ట్రాక్ చేసి, పర్యవేక్షించాయని వివరించింది. గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన ఇక్కడే చేపట్టిన ‘అగ్ని ప్రైమ్’ ప్రయోగ పరీక్ష కూడా విజయవంతమైనట్లు డీఆర్‌డీవో పేర్కొంది.
AP హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా వై.లక్ష్మణరావు
సాక్షి, అమరావతి : రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్‌జీ)గా వై.లక్ష్మణరావు నియమితులయ్యారు. ఆయన ఇప్పటివరకు ఇన్‌చార్జి రిజిస్ట్రార్ జనరల్‌తో పాటు రిజిస్ట్రార్ జ్యుడిషియల్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయనను పూర్తిస్థాయి రిజిస్ట్రార్ జనరల్‌గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నియమించారు. జ్యుడిషియల్ రిజిస్ట్రార్‌గా తిరుపతి 10వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వై. శ్రీనివాస శివరాం నియమితులయ్యారు. పరిపాలన రిజిస్ట్రార్‌గా ఆలపాటి గిరిధర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆయన రిక్రూట్‌మెంట్ (నియామకాలు) రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. దానితో పాటు పరిపాలన రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని అదనపు బాధ్యతల నుంచి తప్పించి పూర్తిస్థాయి పరిపాలన రిజిస్ట్రార్‌గా నియమించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు 8వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎస్.కమలాకర్‌రెడ్డి రిక్రూట్‌మెంట్ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. ఈ నెలాఖరులోపు ఆయన గిరిధర్ నుంచి బాధ్యతలు స్వీకరించాలి. గుంటూరు రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వై.ఏడుకొండలు ఐటీ–సీపీసీ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఐటీ – సీపీసీ రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న గంధం సునీత నుంచి ఈ నెలాఖరు లోపు ఏడుకొండలు బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు లక్ష్మణరావు ఉత్తర్వులు జారీ చేశారు.
Also read: World Health Organization: డబ్ల్యూహెచ్‌వోలో అమెరికా ప్రతినిధిగా డా.వివేక్ మూర్తి
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP