Skip to main content

Happiest Country: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఏదో తెలుసా?

Happiest Country In The World Happiest Country

పుట్టిన ప్రతి మనిషి,జీవి ఎల్లవేళలా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. ఆనందం పొందడం కోసం అనేక మార్గాలు వెతుకుతూ వుంటారు. ఇందులో ఎక్కువమంది సంపూర్ణమైన ఆనందాన్ని పొందలేరు. నిజం చెప్పాలంటే చాలామందికి ఆనందాన్ని ఎలా పొందాలి? ఎలా అనుభవించాలో సరిగ్గా తెలియదని మానసికశాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తుంటారు.

" అందమె ఆనందం -ఆనందమే జీవితమకరందం" అనే పాట కూడా పుట్టింది. ఆనందమే జీవిత సారాంశం.అది భౌతికం,మానసికం,సామాజికం.ఈ ప్రపంచంలో అనేక దేశాలు వున్నాయి. ఏ ఏ దేశాల ప్రజలు ఎక్కువ అనందంగా ఉన్నారనే అధ్యయనం కూడా జరుగుతోంది.ఐక్య రాజ్యసమితి కి చెందిన ఒక సంస్థ ప్రతి ఏడూ ఆనందంగా ఉండే దేశాలకు ర్యాంకులు కూడా ఇస్తూ ఉంటుంది.గత ఏడేళ్లుగా ఒక దేశం అగ్రస్థానంలో నిలుస్తోంది.దాని పేరు ఫిన్ ల్యాండ్.

ఏప్రిల్‌ 20వ తేదీన 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం'జరుపుకున్నాం. ఈ సందర్భంగా మొదటి ర్యాంకు దక్కించుకున్న ఫిన్ ల్యాండ్ వార్తల్లో చక్కర్లు కొడుతోంది. ఇన్ని డబ్బున్న దేశాలు,వనరులు, వసతులు ఉన్న దేశాలు ఉండగా,కేవలం ఈ దేశమే ఇంతటి అద్భుతమైన విజయాన్ని ఎందుకు నమోదు చేసుకుంటోందని సామాజిక శాస్త్రవేత్తలు అధ్యయనం ప్రారంభించారు. ఈ అధ్యయనాలలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూస్తున్నాయి.

సంతోషకరమైన జీవితాన్ని సాగించడంలో ప్రజలు, ప్రభుత్వాలు కలిసి నడుస్తున్నాయి.ఈ సందర్భంలో, ఫిన్ ల్యాండ్ ప్రభుత్వాన్ని బహుశా అభినందించి తీరాలి. అక్కడ పనిచేసే ఉద్యోగులకు పని గంటలు తక్కువగా ఉంటాయి. కుటుంబంతో ఎక్కువ సేపు గడిపే విధంగా ఉద్యోగులను ప్రోత్సహించడం,ఉదారంగా సెలవులు ఇవ్వడం,
పనులు - జీవితం మధ్య సమతుల్యతను సాధించేలా విధానాలను రూపకల్పన చేసుకున్నారు. బాధ్యతలకు ప్రాధాన్యతను ఇస్తూనే కుటుంబ సంబంధాలకు ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల అక్కడ మానవ సంబంధాలు,తద్వారా ఆరోగ్యకరమైన సామాజిక బంధాలు ఏర్పడుతున్నాయి.

విశ్రాంతి వేళలను కూడా అక్కడి ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. మానసిక విశ్రాంతి ద్వారా మెదడుకు కూడా చాలినంత విశ్రాంతిని పొందుతున్నారు. ఆ విధంగా మానసిక ఆరోగ్యాన్ని బాగా పెంచుకుంటున్నారు.ఆందోళనలు,అసంతృప్తులు,ఒత్తిళ్లను దూరం చేసుకుంటున్నారు.మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యానికి కూడా మూల స్థంభంగా నిలుస్తోంది.ఈ దేశంలో విద్యా విధానం చాలా ఆదర్శంగా, ప్రత్యేకంగా ఉంది. జ్ఞానంతో పాటు విలువలకు అత్యున్నత స్థానాన్ని ఇస్తున్నారు. ప్రీ స్కూల్ నుంచి పీ.జీ వరకూ ఉచిత విద్యను ప్రభుత్వం అందిస్తోంది. 

మొక్కుబడి పరీక్షల విధానం కాకుండా, ప్రామాణికతతో కూడిన సమగ్ర అభివృద్ధికి అద్దం పట్టే విద్యను అందిస్తున్నారు.విద్యార్థి దశలోనే విజ్ఞానం,వికాసం పొందుతున్నారు.తద్వారా పిల్లల్లో అచంచలమైన ఆత్మవిశ్వాసం కూడా పోగవుతోంది. వారు చదువుకొనే చదువు వారికి, వారి కుటుంబానికి,ఆ దేశానికి ఎంతో ఉపయుక్తంగా ఉండేలా సిలబస్ ను తీర్చిదిద్దుకున్నారు.ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది.పేద - పెద్ద భేదాలు లేకుండా అందరికీ సమానమైన ఆరోగ్యసేవలు ఆ దేశంలో అందుబాటులో ఉంచారు.

'సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ'ను నిర్మించడం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా, అనందంగా ఎక్కువ కాలం జీవిస్తున్నారు.ఫిన్ ల్యాండ్ లో అవినీతి చాలా తక్కువ. ఈ సంస్కృతి వల్ల ప్రజలకు ప్రభుత్వ సంస్థలపై అత్యధిక విశ్వాసం, గౌరవం పెరుగుతున్నాయి. ఈ వాతావరణం అక్కడి ప్రజలను నిజాయితీ గల పౌరులుగా నిలబెడుతోంది.
ధర్మబద్ధమైన,న్యాయబద్ధమైన జీవనాన్ని సాగిస్తున్నారు.ప్రభుత్వ పాలనలో పారదర్శకత,నైతికత, జవాబుదారీతనం రాజ్యమేలుతోంది. ఈ తరహా పాలన వల్ల ఆ దేశం మచ్చలేని కీర్తిని అనుభవిస్తోంది.

విద్య, ఉద్యోగం,రాజకీయం, సమాజంలోని అన్ని రంగాల్లో స్త్రీకి సమానమైన భాగస్వామ్యం, గౌరవం కలిపిస్తున్నారు. లింగ వివక్షకు తావు లేకుండా చూస్తున్నారు.
పిన్ ల్యాండ్ ప్రజలు ( సౌనాస్ ) అనే స్నానం ఎక్కువగా చేస్తూ వుంటారు. దీనినే ఆవిరి స్నానం అంటారు.వీటి కోసం 30 లక్షల ప్రత్యేక స్నానం గదులు ఉన్నాయి. ఈ స్నానం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుందని ఆ దేశ ప్రజల అనుభవం చెబుతోంది. ప్రజా సమూహాల మధ్య అనుబంధాలు,ఒకరికొకరు సాయపడే లక్షణాలు, ఐకమత్యం మొదలైన సుగుణాలన్నీ అక్కడి ప్రజల్లో చూడవచ్చు.

కేవలం 55 లక్షల జనాభా కలిగిన ఈ చిన్న దేశం పెద్ద పేరు తెచ్చుకుంటోంది.ఇది ఉత్తర యూరప్ లోని స్కాండనేవియన్ దేశం.ఇక్కడి పురుషులు, స్త్రీల ఆయుఃప్రమాణం 80ఏళ్లకు పైగా వుంది.ఇతర దేశాల సంస్కృతి ప్రభావంతో జీవనశైలి వ్యాధులు కొంచెం పెరుగుతూ వస్తున్నా,ప్రపంచంలోని దేశాలన్నింటితో పోల్చుకుంటే ఫిన్ ల్యాండ్ 'ఆనందవనం' గా ప్రపంచ మానవాళికి ఆదర్శంగా నిలుస్తోంది.'జ్ఞానభూమి','యోగభూమి' గా నిన్న మొన్నటి వరకూ పేరుతెచ్చుకున్న మన భారతదేశం పూర్వ వైభవంతో 'ఆనందభూమి'గా అవతరించాలని 
అభిలషిద్దాం.

maa sharma

 

 

 

 

-మాశర్మ,  ప్రముఖ సీనియర్‌ జర్నలిస్ట్‌

Published date : 11 May 2024 03:01PM

Photo Stories