Skip to main content

డెల్టా + ఒమిక్రాన్‌ = Delmicron !!

కరోనా కట్టడికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి మాత్రం సరికొత్త రూపాల్లో మానవాళిపై దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది.
Delta+Omicron=Delmicron
Delta+Omicron=Delmicron

తాజాగా బయటపడ్డ ఒమిక్రాన్‌ వల్ల పాశ్చాత్య దేశాలు విలవిల్లాడుతున్నాయని అందరూ భావిస్తున్నారు. ఇది ఒమిక్రాన్‌ ఒక్కదాని వల్ల జరగడం లేదని, డబుల్‌ వేరియంట్‌ వల్లనే ఈ కల్లోలం జరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు. యూరప్, యూఎస్‌ సహా పశ్చిమాదిన కలకలం సృష్టిస్తున్నది ‘డెల్మిక్రాన్‌’ అనే డబుల్‌ వేరియంట్‌ అని, దీనికి డెల్టా తీవ్రత, ఒమిక్రాన్‌ వేగం ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022లో కరోనా రహిత ప్రపంచాన్ని చూడొచ్చన్న ప్రజల ఆశలకు ఈ డెల్మిక్రాన్‌ వమ్ముచేసిందంటున్నారు.

ఆల్ఫా, బీటా లాగ‌నే...
పశ్చిమ దేశాల్లో కేసుల సునామీకి ఇదే కారణమని కోవిడ్‌ పరిశోధకుడు డా. శశాంక్‌ జోషి అభిప్రాయపడ్డారు. ఆల్ఫా, బీటా లాగా డెల్మిక్రాన్‌ కరోనా కొత్త వేరియంట్‌ కాదని, ఇది ఇప్పటికే ఉన్న వేరియంట్ల కలయికతో ఏర్పడిందని వివరించారు. అంటే దీన్ని డబుల్‌ వేరియంట్‌గా చెప్పవచ్చు. ఇలాంటి డబుల్‌ వేరియంట్లు రూపొందడం చాలా అరుదుగా జరుగుతుంది. డెల్టా కేసులు భారత్‌లో ఈ ఏడాది సెకండ్‌ వేవ్‌కు కారణమయ్యాయి. తాజాగా ఒమిక్రాన్‌ భారత్‌లోకి ప్రవేశించింది. ఈ దశలో ఇండియాలో ఈ రెండు వేరియంట్ల కలయిక ఏ పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాల్సిఉందని జోషి చెప్పారు.  

ఇబ్బందులు ఇవే..
వైరస్‌లో జరిగే మ్యుటేషన్లు(ఉత్పరివర్తనాలు) కొత్త వేరియంట్‌ ఏర్పడేందుకు కారణమవుతాయి. కానీ ఇలాంటి డబుల్‌ వేరియంట్లు ఇప్పటికే ఉన్న వేరియంట్ల కలయికతో రూపొందుతాయని సైంటిస్టులు వివరించారు. ఉదాహరణకు ఇప్పటికే డెల్టా వేరియంట్‌ సోకి కోలుకుంటున్న వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకితే అతనిలో డెల్మిక్రాన్‌ రూపొందే అవకాశం ఉందన్నారు. డెల్మిక్రాన్‌లో అటు డెల్టా నుంచి తీవ్ర వ్యాధి కలిగించే లక్షణాలు, ఇటు ఒమిక్రాన్‌ నుంచి వేగంగా వ్యాపించే లక్షణం వచ్చాయి. అందుకే ఇది ప్రస్తుతం పాశ్చాత్య దేశాలను ముంచెత్తుతోంది.

ల‌క్ష‌ణాలు ఇలా..
డెల్మిక్రాన్‌ సోకిన వారిలో అధిక జ్వరం, నిరంతర దగ్గు, వాసన లేదా రుచి కోల్పోవడం, తలనొప్పి, ముక్కుదిబ్బడ, గొంతులో గరగరలాంటి లక్షణాలను నిపుణులు గమనించారు. భారత్‌లో ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇంతవరకు డెల్మిక్రాన్‌ వేరియంట్‌ జాడ మాత్రం భారత్‌లో లేదు. భారత వాతవరణానికి ఒమిక్రాన్‌ ఎలా స్పందిస్తుందోనని నిపుణులు ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. కొందరు మాత్రం ఇండియాలో డెల్మిక్రాన్‌ ప్రమాదం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. డెల్టా, ఒమిక్రాన్, డెల్మిక్రాన్‌.. ఏదైనా సరే టీకాలు తీసుకోవడం, సరైన నిబంధనలు పాటించడంతో దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చని ఆరోగ్య నిపుణుల సూచన.

Published date : 25 Dec 2021 01:38PM

Photo Stories