Skip to main content

Cyber Alert: ఆఫ‌ర్లంటే ఎగ‌బ‌డుతున్నారా... పొర‌పాటున ఆ లింక్స్ ఓపెన్ చేశారో

స్మార్ట్‌ఫోన్‌కి మాన‌వ జీవితాల‌కు విడిపోని బంధం ఏర్ప‌డింది. ఇంట‌ర్‌నెట్ చౌక‌గా ల‌భిస్తుండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రూ స్మార్ట్‌ఫోన్ వాడ‌డం మొద‌లు పెట్టారు. వాడ‌కం ఎక్కువ‌య్యే కొద్దీ ఆర్థిక నేరాలు అధికం అవుతున్నాయి. ప్ర‌తీ రోజు ఎక్క‌డో చోట సైబ‌ర్ వ‌ల‌లో చిక్కుకొని ల‌క్ష‌ల్లో డబ్బులు పోగొట్టుకుంటున్న‌వారిని చూస్తునే ఉన్నాం. నేప‌థ్యంలో సైబ‌ర్ వ‌ల‌కు చిక్క‌కుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే ఉన్నంత‌లో బాధితులుగా మారే అవ‌కాశం ఉండ‌దు.

- ఆర్థిక లావాదేవీలు, ఫుడ్ డెలివరీ, షాపింగ్, టికెట్ బుకింగ్, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్.. ఇలా ప్రతి అవసరానికి యాప్‌లు ఉన్నాయి. అయితే కొన్ని యాప్‌లలో భద్రత లోపంతో మాల్‌వేర్‌ ద్వారా యూజర్‌ వ్యక్తిగత డేటా హ్యాకర్స్‌కు చేరిపోతున్నాయి. కొత్తగా యాప్‌లు డౌన్‌లోడ్ చేసే ముందు వాటికి ప్లేస్టోర్‌, యాప్‌ స్టోర్‌ ప్రొటెక్షన్ ఉందా, లేదా అని సరిచూసుకోవాలి. యూజర్‌ రేటింగ్ తక్కువగా ఉండి, అనుమానస్పదంగా ఉన్న యాప్‌ల జోలికెళ్లక‌పోవడం ఉత్తమం.
- ఆఫర్ల పేరుతో మెయిల్, మెసేజ్‌ల ద్వారా వచ్చే లింక్‌లపై పొర‌పాటున కూడా క్లిక్ చేయొద్దు. వాటిలో ఎక్కువ శాతం స్పామ్ లింక్‌లే ఉంటాయి. యూజర్స్‌ డేటాను దొంగిలించేందుకు హ్యాకర్స్ మాల్‌వేర్‌ కోడ్‌తో వాటిని యూజర్‌ మొబైల్ లేదా మెయిల్‌కు పంపుతారు. ఆఫ‌ర్లో త‌క్కువ‌గా కొనేద్దామ‌నుకుంటే మ‌న ఇళ్లు గుళ్ల‌వుతుంది.
- సామాజిక మాధ్య‌మాల ఖాతాల‌కు పాస్‌వ‌ర్డ్ ప్రొటెక్ష‌న్ బ‌లంగా ఉండేలా చూసుకోవాలి. యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్ ల‌ను పేరు, పుట్టిన తేదీలను పాస్‌వర్డ్‌గా అస్స‌లు పెట్ట‌కూడ‌దు. టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను క‌చ్చితంగా తీసుకోవాలి. 
- వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ (వీపీఎన్‌).. ఇది యూజర్లకు, ఇంటర్నెట్‌కు మధ్య సురక్షితమైన కనెక్షన్‌ను అందిస్తుంది. దీని ద్వారా ఆన్‌లైన్ బ్రౌజింగ్ చేస్తే మిమ్మల్ని ఎవరూ ట్రాక్ చేయలేరు. హ్యాకర్ల నుంచి డేటాను కాపాడుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు ఎక్కువగా ఈ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంటాయి.
-  ఉచిత వైఫై పొర‌పాటున కూడా ఉప‌యోగించ‌కండి. ఫ్రీ వైఫై కోసం ఆశపడితే మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్స్‌కు చేరిపోయే ప్రమాదం ఉంది. బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వైఫైని ఉప‌యోగించ‌కపోవ‌డం అత్యుత్త‌మం.
-  నకిలీ వెబ్‌సైట్లతో కూడా జాగ్ర‌త్త‌గా ఉండాలి. బ్రౌజర్‌లో వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు అడ్రస్‌ బార్‌లో హెచ్‌టీపీపీఎస్ అని ఉండాలి. హెచ్‌టీపీపీ అని ఉంటే ఆ పేజీని అనుమానించాల్సిందే. ఈ పేజీ ద్వారా ఆన్‌లైన్‌ లావాదేవీలు చేయడం మంచిది కాదు.
- అలాగే మొబైల్ ఓఎస్‌(ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌)ని అప్‌డేట్ చేస్తూ ఉండాలి. వైర‌స్‌ల నుంచి ప్రొటెస్ట్ చేసే యాంటీ వైర‌స్ యాప్‌ల‌ను ఇన్‌స్టాల్ చేసుకోవ‌డం కూడా మంచిదే.

Published date : 18 Mar 2023 06:48PM

Photo Stories