Om Namo: సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎంపికైన రచయిత?
కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన ప్రముఖ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావును కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వరించింది. కన్నడ రచయిత శాంతినాథ దేశాయి రచించిన ‘ఓం ణమో’ పుస్తకాన్ని రంగనాథ 2018లో తెలుగులోకి అనువదించారు. ఈ రచనే పురస్కారానికి ఎంపికైంది. 2020 సంవత్సరానికి గాను అకాడమీ 24 భాషల నుంచి ఎంపిక చేసిన అనువాద రచనలకు 2021, సెప్టెంబర్ 18న అనువాద పురస్కారాలను ప్రకటించింది.
డాక్టర్ చంద్రశేఖర్ కంబర నేతృత్వంలో..
సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ కంబర నేతృత్వంలోని అకాడమీ కార్యనిర్వాహక మండలి సెప్టెంబర్ 18న న్యూడిల్లీలో సమావేశమై ఈ పురస్కారాల ఎంపికను ఆమోదించింది. ప్రతి భాషలో ముగ్గురి సభ్యులతో కూడిన ఎంపిక కమిటీ ఈ పురస్కారాలను సిఫారసు చేసింది. 2014 నుంచి 2018 మధ్య ప్రచురితమైన పుస్తకాలను ఎంపికకు ప్రాతిపదికగా తీసుకుంది. ఈ పురస్కారం కింద రూ.50 వేల నగదు, తామ్రపత్రం ప్రదానం చేస్తారు.
బాలల కోసం ఎన్నో రచనలు
తెలుగు, కన్నడ సాహిత్యాలకు వారధిగా ఉన్న రంగనాథ... 1953 ఏప్రిల్ 28న ఆదోనిలో జన్మించారు. బీఎస్సీ, ఎంఏ (ఆంగ్లం), బీఈడీ చదివిన ఆయన... ఆదోని నెహ్రూ మెమోరియల్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి 2011లో రిటైరయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రంగనాథ రామచంద్రరావు బాలల కోసం ఎన్నో రచనలు చేశారు. కొన్నింటిని పుస్తకాలుగా ప్రచురించారు.
అనేక కలం పేర్లతో రచనలు
రంగనాథ రామచంద్రరావు అనేక కలం పేర్లతో రచనలు చేశారు. సూర్యనేత్ర, స్పప్నమిత్ర, రంగనాథ, మనస్విని, నిగమ, స్వరూపాదేవి తదితర కలం పేర్లతో ఇప్పటివరకు 300కు పైగా వివిధ ప్రక్రియల్లో రచనలు, 250కు పైగా అనువాద కథలు, 140కి పైగా బాలల కథలు, 70కి పైగా సొంత కథలు అందించారు.
రంగనాథ రచనల్లో కొన్ని...
- అనువాద రచనలు: తిరుగుబాటు, వడ్డారాధన, రాళ్లు కరిగే వేళ, పూర్ణచంద్ర తేజశ్వి, అంతఃపురం, అవధశ్వరి, వాగు వచ్చింది, మరిగే ఎసరు
- కథా సంపుటాలు: దింపుడు కల్లం, నేనున్నాగా, మళ్లీ సూర్యోదయం, గొప్ప త్యాగం, ఎత్తుకు పైఎత్తు
- ఆత్మ కథలు: ఓ సంచారి అంతరంగం, అక్రమ సంతానం, మౌనంలో మాటలు, జోగిని మంజమ్మ, బుర్రకథ ఈరమ్మ
- అనువాద నవలలు: తేనె జాబిలి, ఘాచర్ త్యాగరత్న, ఓ రైతు కథ, భారతీపురం, తారాబాయి లేఖ, యానిమల్ ఫామ్, రాయల్ ఎన్‌ఫీల్డ్
చదవండి: భారత్ తరఫున బెస్ట్ విలేజ్ పోటీలో నిలిచిన గ్రామం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020 ఏడాదికిగాను సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎంపికైన రచయిత?
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : రంగనాథ రామచంద్రరావు
ఎందుకు : కన్నడ రచయిత శాంతినాథ దేశాయి రచించిన ‘ఓం ణమో’ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించినందుకు...