Skip to main content

CTET 2024 Notification: సీటెట్‌-2024 నోటిఫికేషన్‌ వివరాలు.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌..సంక్షిప్తంగా సీటెట్‌! ఈ పరీక్షలో విజయం సాధిస్తేనే.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో.. ఉపాధ్యాయ పోస్ట్‌లకు పోటీ పడే అర్హత లభిస్తుంది. బీఈడీ, డీఈడీ తదితర ఉపాధ్యాయ విద్య కోర్సుల ఉత్తీర్ణులు సీటెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల సీటెట్‌ జనవరి-2024 నోటిఫికేషన్‌ వెలువడింది. పరీక్షను జనవరి 21న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. సీటెట్‌-2024 వివరాలు, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..
CEET-2024 Preparation Guidance: Tips and Strategies for Success in Central Teacher Eligibility Test, CEET-2024 Syllabus Analysis: Subjects and Topics Covered in the Central Teacher Eligibility Test, CEET-2024 Exam Pattern: Overview of Sections and Marking Scheme, CEET-2024 Notification: January 21 Exam Date Announced for Central Teacher Eligibility Test, CTET 2024 Details, Exam Pattern, Syllabus Analysis, Preparation Guidance
  • సీటెట్‌ జనవరి-2024 నోటిఫికేషన్‌ విడుదల
  • టీచర్‌ కొలువుకు తప్పనిసరి అర్హతగా సీటెట్‌ 
  • డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణతతో పోటీ పడే అవకాశం
  • సీటెట్‌ స్కోర్‌కు జీవిత కాల గుర్తింపు

బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులు రాష్ట్ర స్థాయిలో టెట్‌తోపాటు జాతీయ స్థాయిలో సీటెట్‌కు కూడా పోటీ పడుతున్నారు. దీనికి కారణం.. సీటెట్‌ స్కోర్‌తో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుండటమే. సీటెట్‌ను సీబీఎస్‌ఈ ఆధ్వర్యంలో ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. 

రెండు పేపర్లుగా సీటెట్‌
సీటెట్‌ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోధనకు పేపర్‌-1కు హాజరు కావలసి ఉంటుంది. అదేవిధంగా ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు టీచింగ్‌కు పేపర్‌-2లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
రెండు స్థాయిల్లోనూ బోధించాలనుకునే వారు రెండు పేపర్లకు హాజరై ఉత్తీర్ణత సాధించాలి. ఈ పేపర్లు రాసేందుకు నిర్దేశిత విద్యార్హతలు కలిగుండాలి.

అర్హతలు

  • పేపర్‌-1: ఇంటర్మీడియెట్‌/తత్సమాన కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల డిప్లామా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) పాసవ్వాలి. లేదా 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత తోపాటు బీఈడీ లేదా బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పాసవ్వాలి. ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం-బీఈడీ అభ్యర్థులు సైతం ఎస్‌జీటీ పోస్ట్‌లకు అర్హులే. దీంతో సీటెట్‌-పేపర్‌-1కు బీఈడీ ఉత్తీర్ణులకు కూడా అర్హత లభించింది. 

పేపర్‌-2 అర్హత

  • బీఏ/బీఎస్సీ/బీకాంలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ) లేదా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) లేదా నాలుగేళ్ల బీఏ ఎడ్యుకేషన్‌/బీఎస్సీ ఎడ్యుకేషన్‌లలో ఉత్తీర్ణత ఉండాలి. లేదా నాలుగేళ్ల బీఏ బీఈడీ/బీఎస్సీ బీఈడీలలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి (లేదా)
  • బీఈ/బీటెక్‌లో 50 శాతంతో ఉత్తీర్ణత సాధించి బీఈడీ/బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) పాసవ్వాలి (లేదా) 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణతతోపాటు మూడేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ-ఎంఈడీ ఉత్తీర్ణులవ్వాలి. 

150 మార్కులకు పేపర్‌-1

  • ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోధించే వారికి నిర్వహించే పేపర్‌-1 పరీక్ష అయిదు విభాగాల్లో 150 మార్కులకు ఉంటుంది. ఇందులో..చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి 30 ప్రశ్నలు-30 మార్కులకు; లాంగ్వేజ్‌-1, 30 ప్రశ్నలు-30 మార్కులకు; లాంగ్వేజ్‌ -2, 30 ప్రశ్నలు-30 మార్కులకు; మ్యాథమెటిక్స్‌ 30 ప్రశ్నలు-30 మార్కులకు; ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ 30 ప్రశ్నలు-30 మార్కులకు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా జరుగుతుంది.
  • లాంగ్వేజ్‌-1, లాంగ్వేజ్‌-2 తప్పనిసరి పేపర్లు. లాంగ్వేజ్‌1 విభాగంలో అభ్యర్థులు ఎంచుకు­న్న బోధన మాధ్యమానికి సంబంధించిన ప్రశ్న­లు అడుగుతారు. లాంగ్వేజ్‌-2 విభాగంలో 20 లాంగ్వేజ్‌లలో ఏదో ఒక లాంగ్వేజ్‌ను ఎంచుకోవ­చ్చు.అయితే ఈ విభాగంలో ఎంచుకునే భాష­ను లాంగ్వేజ్‌-1 విభాగంలో ఎంచుకోకూడదు. తె­లుగు రాష్ట్రాల అభ్యర్థులకు లాంగ్వేజ్‌-2లో తెలు­గు, ఉర్దూ భాషల్లో హాజరయ్యే అవకాశం ఉంది.

పేపర్‌-2 ఇలా
ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించే వారికి నిర్వహించే పేపర్‌-2 పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఇందులో.. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి 30 ప్రశ్నలు-30 మార్కులకు; లాంగ్వేజ్‌ 1, 30 ప్రశ్నలు-30 మార్కులకు; లాంగ్వేజ్‌ 2, 30 ప్రశ్నలు-30 మార్కులకు; మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌ 60 ప్రశ్నలు-60 మార్కులకు; సోషల్‌ స్టడీస్‌/సోషల్‌ సైన్స్‌ 60 ప్రశ్నలు-60 మా­ర్కులకు ఉంటాయి. అభ్యర్థులు తాము ఏ మాధ్యమంలో బోధించాలనుకుంటున్నారో ఆ మీడియంలో లాంగ్వేజ్‌-1 పరీక్ష రాయాల్సి ఉంటుంది. లాంగ్వేజ్‌-2 విభాగంలో లాంగ్వేజ్‌-1లో హాజరైన భాష కాకుండా.. ఇతర లాంగ్వేజ్‌ను ఎంచుకోవాలి. మొ­త్తం 20 భాషలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌ టీచింగ్‌ అభ్యర్థులు పేపర్‌-2లో నాలుగో విభాగాన్ని, సోషల్‌ టీచర్లు అయి­దో విభాగాన్ని ఎంచుకుని పరీక్షకు హాజరు కావాలి. 

కనీస అర్హత మార్కులు
సీటెట్‌లో ప్రతి పేపర్‌లోనూ.. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులతో (90 మార్కులు) ఉత్తీర్ణత సాధించాలి. బీసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో (70 మార్కులు), ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులతో (60 మార్కులు) ఉత్తీర్ణత సాధించాలి.

జీవిత కాల గుర్తింపు
సీటెట్‌లో ఒకసారి నిర్ణీత అర్హత మార్కులతో స్కోర్‌ సొంతం చేసుకుంటే.. ఆ స్కోర్‌కు జీవిత కాలం గుర్తింపు ఉంటుంది. అంటే.. ఒకసారి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే.. ఎప్పుడైనా టీచింగ్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 01-12-2023
  • సీటెట్‌ పరీక్ష తేదీ: 2024, జనవరి 21
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌.
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://ctet.nic.in

పరీక్షలో రాణించేలా
చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి
పరీక్షలో ఎంతో కీలకమైన విభాగం ఇది. ఇందులో ఎడ్యుకేషనల్‌ సైకాలజీపై ప్రాథమిక స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ప్రధానంగా శిశువు సైకాలజీకి సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు మొదలైన అంశాలను క్షుణ్నంగా చదవాలి. శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం, అభ్యసన బదలాయింపు అంశాలను చదవాలి. సైకాలజీ అంశాలను చదివేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు-సూత్రాలు, ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర విషయాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. పెడగాజి అంటే బోధన శాస్త్రం. ఇందులో సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం-నాయకత్వం-గైడెన్స్‌-కౌన్సెలింగ్‌ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.

లాంగ్వేజ్‌ పేపర్లు
లాంగ్వేజ్‌-1 విభాగంతోపాటు లాంగ్వేజ్‌-2లో రాణించేందుకు సంబంధిత భాషా విభాగాలపై స్కూల్‌ స్థాయి పుస్తకాలను పూర్తిగా చదవాలి. లాంగ్వేజ్‌-2కు సంబంధించి ఎక్కువ మంది అభ్యర్థులు ఇంగ్లిష్‌ను ఎంచుకుంటున్నారు. ఇంగ్లిష్‌లో పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, ఆర్టికల్స్, డెరైక్ట్‌ అండ్‌ ఇన్‌డెరైక్ట్‌ స్పీచ్, డిగ్రీస్‌ ఆఫ్‌ కంపేరిజన్, వొకాబ్యులరీ.. ఇలా అన్ని అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. అభ్యర్థులు నిర్దిష్టంగా ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకుని సన్నద్ధం కావాలి. పెడగాజికి సంబంధించి టీచింగ్‌ మెథడ్స్, అప్రోచెస్, టెక్నిక్స్, లాంగ్వేజ్‌ స్కిల్స్, ఇంగ్లిష్‌ నేపథ్యంపై ప్రశ్నలు వస్తాయి.

మ్యాథమెటిక్స్‌
పేపర్‌-1లో ఒకటి నుంచి అయిదో తరగతి వరకు పుస్తకాలను చదవాలి. తద్వారా ఈ సబ్జెక్టులో ప్రాథమిక అంశాలపై పూర్తి స్థాయి పట్టు సాధించాలి. పేపర్‌-2లో ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉండే కాన్సెప్టులపైనే ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల క్లిష్టత స్థాయి ఇంటర్‌ స్థాయిలో ఉంటుంది.

ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌
బోటనీ బేసిక్స్‌తోపాటు, పర్యావరణ అంశాలు, సైన్స్‌ ఇన్‌ డైలీ లైఫ్‌ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.

సైన్స్‌
ఈ సబ్జెక్ట్‌లో మంచి మార్కుల పొందాలంటే.. మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పుస్తకాలు ఔపోసన పట్టాలి. పేపర్‌-2 కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. గత టెట్‌లో ఈ విభాగంలో ప్రశ్నలు కాసింత క్లిష్టంగానే ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి అభ్యర్థులు ఆయా అంశాల బేసిక్స్, అప్లికేషన్స్‌ను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి.

సోషల్‌ స్టడీస్‌
హైస్కూల్‌ స్థాయిలో పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. భూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలను తెలుసుకోవాలి. వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, నదులు.. వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా సివిక్స్, ఎకనామిక్స్‌ అంశాలను సమకాలీన పరిణామాలతో అప్‌డేట్‌ చేసుకుంటూ అధ్యయనం చేయాలి.

Published date : 29 Nov 2023 03:38PM

Photo Stories