CTET Notification: CTET July-2024 వివరాలు... పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్ గైడెన్స్..
- సీటెట్ జూలై–2024 నోటిఫికేషన్ విడుదల
- జాతీయ స్థాయిలో జూలై 7న సీటెట్ నిర్వహణ
- పేపర్–1, పేపర్–2లుగా సీటెట్
- సీటెట్ స్కోర్‌కు శాశ్వత గుర్తింపు
ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం–ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకునే వారికి బీఈడీ, డీఈడీ, బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్)తోపాటు సీటెట్‌లోనూ అర్హత ఉండాలి. సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ వంటి వాటిలో అడుగు పెట్టాలంటే సీటెట్ ఉత్తీర్ణత తప్పనిసరిగా మారింది. సీబీఎస్‌ఈ సీటెట్ పరీక్షను పేపర్–1, పేపర్–2లుగా నిర్వహిస్తుంది.
అర్హతలు
ఆయా పేపర్‌ను అనుసరించి డీఈడీ, బీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.
పేపర్–1: పాఠశాలల్లో ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోధించాలనుకునే వారు పేపర్–1కు హాజరు కావాలి.
పేపర్–2: ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు టీచింగ్ కోసం పేపర్–2లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
రెండు స్థాయిల్లోనూ బోధించాలనుకునే వారు రెండు పేపర్లకు హాజరై ఉత్తీర్ణత సాధించాలి.
150 మార్కులకు పేపర్–1 పరీక్ష
పేపర్–1 పరీక్ష అయిదు విభాగాల్లో ఉంటుంది. అవి..చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి (30 ప్రశ్నలు–30 మార్కులు), మ్యాథమెటిక్స్ (30 ప్రశ్నలు–30 మార్కులు),ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ (30 ప్రశ్నలు–30 మార్కులు),లాంగ్వేజ్–1 (30 ప్రశ్నలు–30 మార్కులు),లాంగ్వేజ్–2(30 ప్రశ్నలు–30 మార్కు లు). మొత్తం 5 విభాగాల్లో 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. లాంగ్వేజ్–1, లాంగ్వేజ్–2 విభాగాలకు సంబంధించి అభ్యర్థులకు 20 లాంగ్వేజ్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో తమకు ఆసక్తి ఉన్న లాంగ్వేజ్‌లు రెండింటిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
పేపర్–2 ఇలా
రెండున్నర గంటల వ్యవధిలో 150 మార్కులకు పేపర్ 2 నిర్వహిస్తారు. మొత్తం అయిదు విభాగాల్లో పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి 30 ప్రశ్నలు–30 మార్కులకు, మ్యాథమెటిక్స్, సైన్స్ 60 ప్రశ్నలు–60 మార్కులకు (లేదా) సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్ 60 ప్రశ్నలు–60 మార్కులకు, లాంగ్వేజ్–1, 30 ప్రశ్నలు–30 మార్కులకు, లాంగ్వేజ్–2, 30 ప్రశ్నలు–30 మార్కులకు పరీక్ష ఉంటుంది.
60 శాతం మార్కులు తప్పనిసరి
సీటెట్ పేపర్–1, పేపర్–2లలో తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు పొందాలనే నిబంధన విధించారు. అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులతో (90 మార్కులు) ఉత్తీర్ణత సాధించాలి.
శాశ్వత గుర్తింపు
సీటెట్‌లో ఉత్తీర్ణత పొందితే ఆ స్కోర్‌కు జీవిత కాల గుర్తింపు కల్పించే విధానం అమలవుతోంది. దీంతో ఒకసారి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే.. ఎప్పుడైనా టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఏప్రిల్ 2
- సీటెట్ తేదీ: 2024, జూలై 7 (పేపర్–2: 9:30–12; పేపర్–1: 2 – 4:30 వరకు)
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్
- వివరాలకు వెబ్‌సైట్: https://ctet.nic.in/
చదవండి: Telangana TRT & DSC 2024 Notification: 11,062 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
బెస్ట్ స్కోర్ సాధించేలా
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి
బోధన, అభ్యసనంకు సంబంధించి ఎడ్యుకేషనల్ సైకాలజీ మీద ప్రాథమిక స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ప్రధానంగా శిశువు సైకాలజీ సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు మొదలైన అంశాలను క్షుణ్నంగా చదవాలి. శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం, అభ్యసన బదలాయింపు అంశాలను చదవాలి. సైకాలజీ అంశాలను చదివేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు–సూత్రాలు, ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర విషయాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. ఇక పెడగాజి అంటే బోధన శాస్త్రం. ఇందులో సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం– నాయకత్వం– గైడెన్స్–కౌన్సెలింగ్ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పొందాలి. పెడగాజిలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తేనే ఏ కోణంలో ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.
లాంగ్వేజ్ పేపర్లకు ఇలా
అభ్యర్థులు తాము బోధించాలనుకునే భాషలో నిర్వహించే లాంగ్వేజ్–1 విభాగంలో రాణించేందుకు.. అదే విధంగా మరో ఇతర లాంగ్వేజ్ నైపుణ్యాన్ని పరీక్షించే లాంగ్వేజ్–2 పేపర్‌లో రాణించేందుకు ఆయా భాషా విభాగాలకు సంబంధించి స్కూల్ స్థాయిలోని సబ్జెక్ట్ పుస్తకాలను పూర్తిగా చదవాలి. సాధారణంగా లాంగ్వేజ్–2కు సంబంధించి ఎక్కువ మంది అభ్యర్థులు ఇంగ్లిష్‌ను ఎంచుకుంటున్నారు. ఇంగ్లిష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, డెరైక్ట్ అండ్ ఇన్ డెరైక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపేరిజన్, వొకాబ్యులరీ.. ఇలా అన్ని అంశాలపైనా అవగాహన పెంపొందించుకుంటే రాణించవచ్చు.
అభ్యర్థులు నిర్దిష్టంగా ఒక ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకుని సిద్ధం కావాలి. పెడగాజికి సంబంధించి టీచింగ్ మెథడ్స్, అప్రోచెస్, టెక్నిక్స్, లాంగ్వేజ్ స్కిల్స్, ఇంగ్లిష్ నేపథ్యం మీద ప్రశ్నలు వస్తాయి.
మ్యాథమెటిక్స్
ఈ సబ్జెక్ట్‌కు సంబంధించి పేపర్–1లో ఒకటి నుంచి నుంచి అయిదో తరగతి స్థాయిలో.. పేపర్–2లో ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉండే కాన్సెప్టులపైనే ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల క్లిష్టత ఇంటర్ స్థాయిలో ఉంటుంది.
ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్
ఈ విభాగంలో రాణించేందుకు బోటనీ బేసిక్ అంశాలతోపాటు, పర్యావరణం, సైన్స్ ఇన్ డైలీ లైఫ్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
సైన్స్
ఈ విభాగంలో మార్కుల కోసం మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పుస్తకాలు ఔపోసన పట్టాలి. పేపర్–2 కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. గత సీటెట్‌లో ఈ విభాగంలో ప్రశ్నలు కాసింత క్లిష్టంగానే ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి అభ్యర్థులు ఆయా అంశాల బేసిక్స్, అప్లికేషన్స్ వంటి వాటిపై ప్రత్యేక అధ్యయనం చేయాలి.
సోషల్ స్టడీస్
ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. భూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలను చదివాలి. వాతావరణ,భౌగోళిక పరిస్థితులు,నదులు.. వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా సివిక్స్, ఎకనామిక్స్ అంశాలను సమకాలీన అంశాలతో అప్‌డేట్ చేసుకుంటూ చదవాలి.
Tags
- CTET Notification 2024
- CTET July 2024
- CTET July 2024 Notification
- CTET July 2024 Exam Pattern
- Central Teacher Eligibility Test
- CTET July 2024 Syllabus
- CTET Preparation 2024
- Teacher Eligibility Test
- Eligibility Test
- Teacher jobs
- Central Govt Jobs
- Kendriya Vidyalayas
- Navodaya Vidyalayas
- Army Public Schools
- CBSE CET Exam
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- Exam Pattern Details
- Special Article on Preparation
- Syllabus Topics