Skip to main content

వ్యవసాయ పరిశోధనలకు ‘స్వర్ణా’వకాశం

కలెక్టర్... డాక్టర్... ఇంజనీర్... ఇవి నేటి యువత కలలుగనే కెరీర్లు. శాస్త్రవేత్తగా అడుగులు వేసే వారు కొందరే.. అందులోనూ వ్యవసాయ రంగంలో అంటే అరుదే. ఇదే బాటను అనుసరించింది రోణంకి స్వర్ణ. పల్లె వాతావరణంలో పుట్టి పెరిగిన ఆమెకు వ్యవసాయం-దాని ప్రాధాన్యమేంటో తెలుసు. ఆ రంగంలో కర్షకుడు పడే కష్టాలను కళ్లారా చూసింది. అందుకే తన చదువును సాగు రంగానికి అంకితం చేసింది. అందులోనే పరిశోధనలు చేయాలని సంకల్పించింది. ప్రణాళికతో పట్టు సడలకుండా ప్రయత్నం సాగించింది. జాతీయ స్థాయిలో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎంపికై తన కలను సాకారం చేసుకుంది.

మాది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఉరజాం గ్రామం. నాన్న రోణంకి సీతారామనాయుడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఆర్టీసీ డిపోమేనేజర్. అమ్మ దమయంతి గృహిణి. తమ్ముడు ధవళేష్. కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

వ్యవసాయమంటే ఆసక్తి
వ్యవసాయం అంటే ఆసక్తి. చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలోనే పుట్టి పెరిగాను. రైతుల కష్టాలను చూశాను. సరైన శాస్త్ర విజ్ఞానం ఇప్పటికీ వారికి చేరడం లేదు. ఈ పరిస్థితులు డాక్టరవుదామనుకున్న నా అభిప్రాయాన్ని మార్చాయి. ైనైర వ్యవసాయ కళాశాల(శ్రీకాకుళం జిల్లా)లో ఏజీ బీఎస్సీలో చేరాను. ఇక్కడే శాస్త్రవేత్తగా స్థిరపడాలనే నా లక్ష్యానికి బీజం పడింది.

హీహెచ్‌డీ ప్రస్థానం:
ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం -హైదరాబాద్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) నిర్వహించిన పరీక్ష ద్వారా రీసెర్చ్ స్కాలర్‌గా ఎంపికయ్యాను. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నా.

విజయం:
పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (న్యూఢిల్లీ) శాస్త్రవేత్తల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైంది. నా ఆశయం నెరవేరే అవకాశం లభించే ఈ పరీక్షలో ఎలాగైనా విజయం సాధించాల ని నిర్ణయించుకున్నా. ఇందుకోసం పక్కా ప్రణాళికతో చదివాను. ప్రిలిమ్స్, మెయి న్స్, ఇంటర్వ్యూలో ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు. దాని ప్రతిఫలమే ఈ విజయం.

లక్ష్య సాధనకు:
ఇటువంటి పరీక్షలో విజయం సాధించాలంటే అకడమిక్ పాఠ్య పుస్తకాల నుంచి నోట్స్ రాసుకోవాలి. కేవలం ఉత్తీర్ణత దృష్టితోకాకుండా విషయావగాహన, పరిశీలనా దృక్పథం, శాస్త్రీయ వైఖరితో చూడాలి.

ఇంటర్వ్యూ ఇలా
ఇంటర్వ్యూలో ప్రధాన పంటలు, సాగు రంగం-సమస్యలు, పరిష్కార మార్గాలు, సబ్జెక్టుకు సంబందించి ప్రశ్నించారు. వ్యక్తిగత అంశాలను ప్రస్తావించారు. ఆహార భద్రతకు ఏం చేయాలి? వంటి అంశాలతోపాటు జనరల్ నాలెడ్‌‌జ నుంచి కూడా ప్రశ్నలు అడిగారు.

లక్ష్యం
క్షేత్రస్థాయిలో కర్షకుడు కోరుకునే పరిశోధనలకే ప్రాధాన్యం ఇవ్వాలి. నేను ఆ దిశగా అహర్నిశలు కృషి చేస్తా. ఇదే నా లక్ష్యం.
Published date : 15 Aug 2014 03:36PM

Photo Stories