Skip to main content

శాస్త్రవేత్త కావాలన్నదే నా లక్ష్యం... గేట్ ఈసీఈ 8వ ర్యాంకర్

ఆర్‌ఎంపీ వైద్యుని కుమారుడు.. పదో తరగతి వరకు మారుమూల పల్లెలోనే విద్యాభ్యాసం.. అయినా పదిలో మండల టాపర్‌గా నిలిచి, బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో సీటు దక్కించుకున్నాడు. ఇప్పుడు గేట్-2014లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో జాతీయ స్థాయిలో ఎనిమిదో ర్యాంకు సాధించాడుతాడూరి నవీన్..

మా స్వస్థలం కరీంనగర్ జిల్లా, కమలాపూర్ మండలంలోని శనిగరం. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. 2008లో పదో తరగతిలో 545 మార్కులతో మండల టాపర్‌గా నిలిచాను. ఫలితంగా ఆ ఏడాదే మొదలైన ఏపీ ట్రిపుల్ ఐటీల్లో బాసర క్యాంపస్‌లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశం లభించింది. మొదటి రెండేళ్లు అందరికీ ఉమ్మడిగా ఉండే పీయూసీ (ఎంబైపీసీ) చదివాను. చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్స్ పరికరాలపై నాకు చాలా ఆసక్తి. దాంతో వాటి పనితీరు తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్‌ను ఎంచుకున్నాను.

స్ఫూర్తి నింపిన మాటలు:
బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మా బ్యాచ్ ప్రారంభమైన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాంపస్‌కు వచ్చారు. ఆ సందర్భంగా..‘‘మీ ఉజ్వల భవిష్యత్తు కోసం ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశాం. ఇందుకోసం ప్రత్యేకంగా యూనివర్సిటీని కూడా నెలకొల్పాం. తొలుత ఒక్కో క్యాంపస్‌కు వేయి సీట్లు మాత్రమే అనుకున్నప్పటికీ.. మీలాంటి విద్యార్థులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రెండు వేల సీట్లకు పెంచాం. మీరంతా పెద్ద చదువులు చదువుకొని ప్రయోజకులు అయినప్పుడే మా ఆశలు నెరవేరుతాయి’’ అంటూ ఆయన ఉద్విగ్నంగా మాట్లాడారు. ఆయన మాటలు నాలో స్ఫూర్తి నింపాయి. ఆ స్ఫూర్తి పట్టుదలగా చదవడానికి సహకరించింది.

గేట్ లక్ష్యంగా:
ట్రిపుల్ ఐటీలలోని ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో చేరిన రెండో ఏడాది నాకు గేట్ గురించి తెలిసింది. గేట్ ప్రాధాన్యాన్ని వివరించడంలో ట్రిపుల్ ఐటీ అధ్యాపకుల పాత్ర ఎంతో ఉంది. అందులో రాణించేందుకు అవసరమైన మెటీరియల్‌ను సైతం అందుబాటులో ఉంచారు. అప్పటికే ఎలక్ట్రానిక్స్ అంటే సహజమైన ఆసక్తి ఉండటంతో ఉన్నత విద్య దిశగా ‘గేట్’ను లక్ష్యంగా ఎంచుకున్నాను.

బీటెక్+గేట్.. సమాంతర ప్రిపరేషన్:
గేట్‌లో ర్యాంకు సాధించడమే లక్ష్యంగా చదవడం ప్రారంభించాను. ఒకవైపు బీటెక్ కోర్సు సబ్జెక్టులు చదువుతూనే గేట్‌కు ప్రిపేర్ కావడంలో ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. బీటెక్‌లో కోర్ సబ్జెక్టులను మొదట్నుంచీ లోతుగా అధ్యయనం చేయడం ఎంతో లాభించింది. మరోవైపు.. ఐఐటీ ప్రొఫెసర్లు రూపొందించిన వీడియో లెక్చర్స్‌ను అందించేవారు. ఇది కూడా ఎంతో ఉపయోగపడింది. ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ విభాగాల విషయంలో కొంత ఇబ్బందిపడ్డాను. లేకుంటే మరిన్ని మార్కులు వచ్చేవి.

మాక్ టెస్ట్‌లతో మరింత పదును:
గేట్ పరీక్షపై అవగాహన కోసం 2013 వేసవి సెలవు ల్లో రెండు నెలలు శిక్షణ తీసుకున్నాను. ఆ సందర్భం గా నిర్వహించిన మాక్ టెస్ట్‌లు బాగా ఉపయోగపడ్డాయి. వీటివల్ల పరీక్షలో ప్రశ్నలు అడిగే తీరు, వాటి క్లిష్టత తదితర అంశాలపై అవగాహన వచ్చింది.

లోతుగా అధ్యయనం:
గేట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్ష అంటే చాలామంది విద్యార్థులు ఆందోళన చెందుతారు. ఈ క్రమంలో మార్కెట్లో లభించే ప్రతి మెటీరియల్‌ను చదవాలని, లేదంటే విఫలమవుతామనే అపోహలో ఉంటారు. బీటెక్ తొలి ఏడాది నుంచే సబ్జెక్టులను లోతుగా అధ్యయనం చేస్తే మంచి ర్యాంకు సాధించడం సులభమే. రోజుకు నాలుగైదు గంటల ప్రిపరేషన్‌తో బీటెక్ సబ్జెక్ట్‌లు, గేట్ ప్రిపరేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి, గేట్‌కు అనుగుణంగా ప్రామాణిక పుస్తకాలు చదివితే సరిపోతుంది. ఈ విషయంలో సీనియర్లు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. నేను ఇదే ఫార్ములా అనుసరించాను.

శాస్త్రవేత్త.. నా లక్ష్యం:
ప్రస్తుత గేట్ ర్యాంకుతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- బెంగళూరులో మైక్రో ఎలక్ట్రానిక్స్ చదవాలని భావిస్తున్నాను. అది పూర్తయ్యాక డీఆర్‌డీఓలో సైంటిస్ట్‌గా కెరీర్ ప్రారంభించడమే లక్ష్యం. ఇది వ్యక్తిగత సంతృప్తిని ఇవ్వడంతోపాటు సమాజానికి సేవ చేసేందుకు కూడా దోహదపడుతుంది.

నా సలహా:
భవిష్యత్తులో గేట్ రాసే విద్యార్థులకు ఒకటే సలహా.. బీటెక్‌లోని ప్రతి సబ్జెక్టును కాన్సెప్ట్స్ ఆధారితంగా చదవండి. కాన్సెప్ట్‌లపై అవగాహన పొందుతూ పాత ప్రశ్న పత్రాలను బాగా ప్రాక్టీస్ చేయండి. తద్వారా ఓ వైపు బీటెక్, మరోవైపు గేట్ రెండు గమ్యాలు ఒకే సమయంలో చేరుకోవచ్చు.

అకడమిక్ నేపథ్యం:
  • పదో తరగతి: 545 మార్కులు (2008లో)
  • ట్రిపుల్ ఐటీలో పీయూసీ: 2010లో 95.7శాతం (ఎంబైపీసీ).
  • ప్రస్తుతం బీటెక్ ఈసీఈ చివరి సెమిస్టర్. ఇప్పటి వరకు 90.6 శాతం మార్కులు వచ్చాయి.
Published date : 03 Apr 2014 06:04PM

Photo Stories