Skip to main content

పట్టుదలతోనే ప్రథమ ర్యాంకు సాధ్యమైంది.. PECET 2014 U.G.D.P.Ed.టాపర్ బండి శకుంతల

మొదటి నుంచి క్రీడలంటే ఆసక్తి ఉండటం వల్లే అథ్లెటిక్స్‌లో రాణించానని ఆ అనుభవమే పీసెట్ 2014లో టాపర్‌గా నిలిచేందుకు తోడ్పడిందని అంటున్నారు చిత్తూరు జిల్లాకు చెందిన బండి శకుంతల. జాతీయ, రాష్ట్రస్థాయిలో అనేక మెడల్స్ సాధించడమే కాక 2014 పీసెట్ U.G.D.P.Ed.(Under Graduate Diploma in Physical Education) కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన అర్హత పరీక్షలో ప్రథమ ర్యాంకు సాధించిన శకుంతలతో సాక్షి ఎడ్యుకేషన్ ఇంటర్వ్యూ...

మొదటి ర్యాంకు సాధించడం ఎలా ఉంది?
చాలా ఆనందంగా ఉంది. పట్టుదలతో పీసెట్ కోసమే సిద్ధమయ్యా. కానీ టాపర్‌గా నిలుస్తాననుకోలేదు.

క్రీడలవైపు రావడానికి ఎవరు ప్రోత్సహించారు?
మా మామయ్య. మొదటి నుంచి క్రీడలపై నాకున్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు,. పీసెట్ పరీక్షకు కూడా ఆయన ప్రోద్బలంతోనే దరఖాస్తు చేశాను. నిరంతరం సాధన చేసి ప్రథమ ర్యాంకు సాధించాను.

టెస్ట్‌లో మీ ప్రదర్శన వివరాలు?
100 మీటర్ల పరుగు పందెం 14 సెకన్లలో పూర్తిచే శాను. లాంగ్ జంప్‌లో 4.50 మీటర్లు, షాట్‌పుట్‌లో 7.28 మీటర్లతో మెరిట్ సాధించాను. 400 మీటర్ల పరుగు పందెం 74 సెకన్లలో పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచాను.

టెస్ట్‌కు ఎలా సిద్ధమయ్యారు?
పీసెట్ పరీక్షకు సొంతంగా సాధన చేశా. రోజుకు 5-6 గంటలు సాధన చేశాను. పదోతరగతిలో కోచ్ నేర్పిన టెక్నిక్స్, అందించిన పోత్సాహం చాలా ఉపయోగపడ్డాయి.

మీ కుటుంబ నేపథ్యం చెప్పండి?
మాది చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని పాలగుంట చేను గ్రామంలో చిన్న వ్యవసాయ కుటుంబం. నాకు ఇద్దరు అక్కలు. ఒక తమ్ముడు. ఒక అక్కకు పెళ్లయింది. మరో అక్క ఎంబీఏ చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. తమ్ముడు డిప్లొమా చేస్తున్నాడు.

మీ చదువు గురించి చెప్పండి ?
పదోతరగతి వరకు కడప స్పోర్ట్స్ స్కూళ్లో చదివాను. పుత్తూరులోని హిమజ జూనియర్ కాలేజీలో ఇంటర్చదివాను. ఒక్క పక్క ఆటలు చూసుకుంటూనే పది, ఇంటర్ రెండింటిలోను 70 శాతం పైగా మార్కులు సాధించాను.

రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఏఏ మెడల్స్ సాధించారు?
నా ప్రధాన ఈవెంట్స్ 100, 200 మీటర్లు. ఇప్పటివరకు అండర్ 14, 16లో కలిపి మొత్తం 5 గోల్డ్, 3 సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించాను. చాలా టోర్నమెంట్‌ల్లో పాల్గొన్నాను. ప్రస్తుతం హాకీ ఆడుతున్నాను. హాకీలో కూడా చిత్తూరులో జరిగిన ఐహెచ్‌ఎఫ్ సబ్ జూనియర్ విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చింది.

మీ భవిషత్తు లక్ష్యాలు ఏంటి? క్రీడల్లోకి రావాలనుకునేవారికి మీరిచ్చే సలహా?
స్పోర్ట్స్ కోచ్‌గా స్థిరపడాలనుకుంటున్నాను. క్రీడల్లో రాణించాలనకునే వారు శ్రద్ధతో సాధన చేసి రకరకాల టెక్నిక్స్ నేర్చుకోవాలి. అంకితభావం, క్రమశిక్షణ చాలా ముఖ్యం.
Published date : 05 Jul 2014 01:01PM

Photo Stories