Inspiration: నాటి అవమానం నుంచి పుట్టిన ఆలోచనే.. నేడు మీ ముందు ఇలా..
తోటి వారి కష్టాన్ని చూసి స్పందించే హృదయం.. చేయూత ఇవ్వాలనే ఆలోచన ఉంటే చాలు. ఈ కోవకు చెందిన వ్యక్తే కర్ణాటకకు చెందిన హరేకల హజబ్బ. పళ్లు అమ్ముకుని జీవనం సాగించే హజబ్బ తన ఊరి పిల్లల పాలిట దైవం అయ్యాడు.
రెక్కడాతే కాని డొక్కాడని పరిస్థితిలో..
రెక్కడాతే కాని డొక్కాడని స్థితిలో ఉన్న హజబ్బ.. తన ఊరి పిల్లల కోసం ఏకంగా పాఠశాల నిర్మించాడు. 1-10వ తరగతి వరకు ఇక్కడ ఉచితంగా చదువుకోవచ్చు. హజబ్బ సేవా గుణాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. ఆయన సేవా గుణం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ వివరాలు..
జీవితాన్ని మార్చిన ఘటన ఇదే..
మంగుళూరుకు చెందిన హరేకల హజబ్బ స్థానికంగా ఉన్న సెంట్రల్ మార్కెట్‌లో కమలాలు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫారిన్ దంపతులు హజబ్బ దగ్గరకు వచ్చి.. కిలో కమలాలు ఎంత అని ఇంగ్లీష్‌లో అడిగారు. హజబ్బకు కన్నడ, మాతృభాష అరబ్బీ తప్ప మరో భాష రాదు. అందుకే ఆ ఫారిన్ దంపతులు అడిగిన ప్రశ్నకు అతను సమాధానం చెప్పలేకపోయాడు. ఆ దంపతులు హజబ్బను చూసి ఎగతాళిగా నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
తన పరిస్థితి మరేవరికి రాకూడదని..
జరిగిన అవమానం హజబ్బను చాలా కుంగదీసింది. ఇంగ్లీష్ రాకపోవడం వల్లే తాను ఇలా అవమానాలు పొందాల్సి వచ్చిందని భావించాడు. తన గ్రామంలోని పిల్లలు ఎవరు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొకుండా ఉండాలంటే.. వారికి ఇంగ్లీష్ తప్పనిసరిగా రావాలని భావించాడు. కానీ తన గ్రామంలో మంచి స్కూల్ లేకపోవడం.. మదర్సాలో అరబ్బీ తప్ప మరో భాష నేర్పకపోవడం హజబ్బను కలవరపరిచింది.
రూ.5000తో..ఎన్నో అవమానాలు..అడ్డంకులు ఎదుర్కొని..
ఈ క్రమంలో హజబ్బ తానే స్వయంగా ఓ పాఠశాలను ప్రారంభించాలిన నిర్ణయించుకున్నాడు. అయితే అది అనుకున్నంత సులభంగా జరగలేదు. ఎన్నో అవమానాలు.. అడ్డంకులు ఎదురుకున్నాడు. వాటన్నింటిని దాటుకుని.. 1999, జూన్‌లో తన కలని నిజం చేసుకున్నాడు. అప్పటి వరకు తాను పొదుపు చేసుకున్న ఐదువేల రూపాయలతో సొంతంగా కొంత భూమి కొనుగోలు చేసి.. పాఠశాల నిర్మాణం ప్రారంభించాడు.
ప్రభుత్వం, దాతల సాయంతో అలా 2001 జూన్ నాటికి 8 తరగతి గదులు, రెండు మరుగుదొడ్లతో స్కూలు నిర్మాణం పూర్తయింది. అయితే పాఠశాల నిర్మించాలనే అతని కల నెరవేరింది. ఆ తర్వాత హైస్కూలు స్థాపించాలని నిర్ణయించుకున్నాడు హజబ్బ. పదేళ్లు కష్టపడి దాన్ని కూడా సాకారం చేసుకున్నాడు. 2012 నాటికి ప్రాథమిక పాఠశాల పక్కనే ఉన్నత తరగతి విద్యార్థుల కోసం మరో బిల్డింగ్ నిర్మించాడు. ప్రస్తుతం తన గ్రామంలో ప్రీ యూనివర్శిటీ కళాశాలను ప్రారంభించాలని ఆశిస్తున్నాడు. సాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.
హజబ్బకు సొంత ఇళ్లు లేదు. కానీ..
హజబ్బ సేవా నిరతని గుర్తించి ఇప్పటికే పలు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం అనేక అవార్డులతో సత్కరించారు. ఇక అవార్డులతో పాటు లభించే మొత్తాన్ని పాఠశాల అభివృద్ధి కోసమే వినియోగించాడు. ఈ క్రమంలో ఓ సారి అవార్డుతో పాటు వచ్చిన 5 లక్షల రూపాయలను స్కూల్ కోసం కేటాయించాడు. ఇక భవిష్యత్తులో వచ్చే మొత్తాన్ని కూడా పాఠశాల అభివృద్ధికే వినియోగిస్తానంటున్న హజబ్బకు సొంత ఇళ్లు లేదు. కానీ తన గురించి ఆలోచించకుడా.. పిల్లల భవిష్యత్తు గురించి ఇంతలా ఆరాటపడుతున్న హజబ్బను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజనులు.