Skip to main content

‘మనస్సుంటే మార్గం ఉంటుందనే’మాటకు ఈ దంపతులే సాక్ష్యం

సమాజంలో సాయం కోసం ఎదురుచూసే అభాగ్యులెందరో. వీరికి చెయ్యందించేవారు మాత్రం అరుదుగా కనిపిస్తారు.

కానీ పిసరంత సాయం దొరికితే చాలు అభాగ్యుల జీవితాలు కొంతైనా మెరుగుపడతాయని, చెప్పడమేగాక చేసి చూపుతున్నారు‘పొపాట్రో పుండే దంపతులు’. మనస్సుంటే మార్గం ఉంటుంది అనే మాటకు ఈ దంపతులు సాక్ష్యంగా నిలుస్తున్నారు.

గత ఆరేళ్లుగా వీరు తమ జీతాల్లో నుంచి...
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా పత్రాది ప్రాంతంలో నివసించే పొపాట్రో ఫుండె, అనురాధ దంపతులు స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడమేగాక.. గత ఆరేళ్లుగా వీరు తమ జీతాల్లోనుంచి 10 శాతం మొత్తాన్ని ఒంటరి నిరాశ్రయులైన మహిళలు, వితంతువులు, అనాథలు, బాధిత రైతులు, అవసరంలో ఉన్న స్కూలు పిల్లలకు ఖర్చుచేస్తున్నారు. ఇప్పటిదాకా దాదాపు 1200 మందికి సాయమందించారు. ఇంతకీ వీరికి ఈ ఆలోచన ఎందుకొచ్చిందంటే...

ఈ ఆలోచనతోనే...
అది 2014 జూన్ నెల.. ఓ రోజు స్కూల్లో ఉండగా అకస్మాత్తుగా పొపాట్రో సృ్పహ తప్పి పడిపోయాడు. దీంతో తోటి ఉద్యోగులు హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పొపాట్రోని పరీక్షించిన డాక్టర్ లో బి.పితో అలా సృ్పహతప్పి పడిపోయారని చెప్పారు. సకాలంలో డాక్టర్ వైద్యం అందించడంతో తనకు ఏ ప్రమాదం జరగలేదని గ్రహించిన పొపాట్రో... తనకు సాయం అందినట్లుగానే అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తే బావుంటుందన్న ఆలోచన తట్టింది. అనుకున్న వెంటనే సాయం చేయడం ప్రారంభించారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి..
{పొపాట్రో దంపతులు ఇద్దరూ ప్రతి ఆదివారం దగ్గరల్లోని గ్రామాల్లో పర్యటించి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం అందిస్తారు. ఇందులో భాగంగా వారు కుట్టుమిషన్, బట్టలు, బుక్స్, బర్త్‌డే గిఫ్ట్స్, వ్యవసాయం చేసుకునే రైతులకు మేకలు, అనాథలకు మౌలిక సదుపాయాల కల్పన వంటివి చేస్తుంటారు. కొంతమందికి వంట చేసుకోవడానికి గ్యాస్ స్టవ్, మరికొందరికి ఆసుపత్రి బిల్లులు కట్టడం, గృహిణులకు వెట్ గ్రైండర్‌లు వంటివి ఇచ్చి ఆదుకుంటున్నారు.

రిమోట్ ఏరియాల్లో..
{పొపాట్రో తన పదేళ్ల సర్వీసులో ఎక్కువగా రిమోట్ ఏరియాల్లో పనిచేయడంతో .. అక్కడ ఉన్న పరిస్థితులను నిశితంగా గమనించారు. దీంతో గ్రామాల్లో ఉన్న స్కూళ్లను మెరుగు పరిచేందుకు వారి స్నేహితులను, బంధువులు, సామాజిక కార్యకర్తలను సంప్రదించి ఇక్కడి పరిస్థితులు వివరించి వారు చేయగలిగిన సాయంతోపాటు వీరు కొంత ఖర్చుపెట్టి ..స్కూళ్లలో రెండు గదులను ఏర్పాటు చేయడం, కంప్యూటర్లు, ఈ-లెర్నింగ్‌‌స కిట్స్, లౌడ్‌స్పీకర్స్, బల్లలు, వాటర్ ఫ్యూరిఫయర్స్, టారుులెట్స్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించారు. అంతేగాక స్కూలు మానేసిన పిల్లలను మళ్లీ బడికి తీసుకు రావడం, వారు చదువుకోవడానికి అవసరమైన వాటిని కొనిస్త్తూ వారిని ప్రోత్సహించడం వీరి పనులు. గ్రామాల్లోని మహిళలకు స్వయం సహాయక సంఘాల గురించి అవగాహన కల్పించడం, పొదుపుతో కుటుంబాన్ని సక్రమంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో చెప్పి వారిని సైతం సరైన మార్గంలో నడిపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు.

Published date : 19 Feb 2021 06:21PM

Photo Stories