కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్‌కి..21 ఏళ్ల వన్డే కలెక్టర్..
ధైర్యం అంటే ఎలా ఉండాలి? ధైర్యానికి ఉదాహరణ ఏంటి?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అమ్మాయిలకు చెప్పాలంటే అర్చన కెవాట్‌ను చూపించాలి. 21 ఏళ్ల అర్చన ధైర్యానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని కాట్ని జిల్లా కలెక్టర్ అర్చనను ‘ఒకరోజు కలెక్టర్’గా నియమించి గౌరవించింది. ఆ ప్రభుత్వం 51,000 రూపాయలను కానుకగా ఇచ్చి, ఘనంగా సత్కరించింది. వేధింపులకు గురిచేస్తున్న అబ్బాయిల నుంచి ఇద్దరు మైనర్ బాలికలను రక్షించినందుకు గాను అర్చన కెవాట్‌కు దక్కిన అరుదైన గౌరవం ఇది.
కూరగాయలు అమ్మే వ్యక్తి కూతురుగా
మార్చి 8, సోమవారం ఉదయం 21 ఏళ్ల అర్చన కెవాట్ కాట్ని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కారులో చేరుకుంది. కాటన్ సల్వార్ సూట్ ధరించిన అర్చన కెవాటన్ పేరును మీడియా ముందు ‘వన్డే కలెక్టర్’గా ప్రకటించారు. ఆమె అంతే ఆత్మవిశ్వాసంతో తనకు అందించిన గౌరవాన్ని అందుకుంది. ఈ సందర్భంగా కూరగాయలు అమ్మే వ్యక్తి కూతురుగా తనను తాను పరిచయం చేసుకుంది. కలెక్టరేట్ కార్యాలయం లోపలికి వెళ్లేముందు అర్చనకు జిల్లా కలెక్టర్ ప్రియాంక్ మిశ్రా, సిబ్బంది పూలతో స్వాగతం పలికారు.
సమీక్షలు.. సమావేశాలతో..
సోమవారం కావడంతో జిల్లా పరిపాలన, అభివృద్ధికి సంబంధించిన సమీక్షలు జరిపే సమావేశం. ఈ సమావేశానికి అర్చన అధ్యక్షత వహించింది. జిల్లాల్లో పోషకాహార లోపం ఉన్న పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మొదటి ప్రాధాన్యంగా అధికారులను ఆదేశించింది. తక్కువ బరువు, పోషకాహార లోపం ఉన్న పిల్లలను పునరావాస కేంద్రాలకు చేర్చాలని తెలిపింది. సమావేశం తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో చకా గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొంది. ఆ తర్వాత మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యింది. ఒంటి గంటప్పుడు బస్టాండ్ వద్ద ఉన్న ఆడిటోరియం చేరుకుని, సమావేశం నిర్వహించింది. మధ్యాహ్నం 3 గంటలకు వన్‌స్టాప్ సెంటర్‌ను, సాయంత్రం 4 గంటలకు ఆడపిల్లల భద్రత గురించిన వివరాలను తెలుసుకుంది. పర్యటన, సమావేశాలు ఒకదాని తర్వాత ఒక కార్యక్రమాన్ని రోజంతా చేపడుతూనే ఉంది అర్చన.
కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్‌కి..
ఎనిమిది మంది తోబుట్టువులున్న అర్చన తండ్రి చేసే కూరగాయల వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటోంది. కొద్దిరోజుల క్రితం మార్కెట్ వద్ద టీనేజ్ అమ్మాయిలను రౌడీలు వేధిస్తుండటం చూసిన అర్చన సమీపంలోని వ్యక్తుల సాయంతో వారిని కొట్టుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, పోలీసులకు అప్పజెప్పింది. అర్చన ఎలాంటి భయం లేకుండా దుండగులను చట్టానికి పట్టించిన తీరు స్థానిక ప్రజానీకానికే కాకుండా అధికారులను సైతం ఆకట్టుకుంది. ఆమె సాహసానికి నగదు పురస్కారాన్ని ఇవ్వడమే గాకుండా ఒకరోజు కలెక్టర్‌గా నియమించి ఆమె పట్ల తమ గౌరవాన్ని చాటారు.