Skip to main content

ఈ పట్టాలమ్మాయి చర్మం నల్లబడితే పెళ్లిచేసుకోరా..? : కశిష్‌ శర్మ, తనిఖీ ఇంజినీర్‌

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీలోంచి బయటకు చూడటమే తప్ప రైల్వే ట్రాక్‌ ఇన్‌స్పెక్షన్‌ ఇంజినీర్‌ అవుతాననుకోలేదంటుంది కశిష్‌ శర్మ. రైల్వే లైన్స్, ట్రాక్స్‌ నిర్మాణంలో సాంకేతికతకు సంబంధించి రోజూ పది గంటల పాటు ఆన్‌సైట్‌లో ఉండి పరీక్షించే ఏకైక మహిళా తనిఖీ ఇంజినీర్‌ కశిష్‌. పది మంది మగవారు చేసే పని తానొక్కదాన్నే పూర్తిచేయగలను అనే ధీమాను వ్యక్తం చేస్తోన్న ఈ పట్టాలమ్మాయిని పరిచయం చేసుకుందాం...
నా స్వభావానికి విరుద్ధమైన జాబ్ ఇది..అయినా..
రైల్వే ట్రాక్స్‌ తనిఖీ చేసే ఇన్‌స్పెక్షన్‌ ఇంజినీర్‌ కశిష్‌ది రాజస్థాన్‌లోని అజ్మీర్‌. ఇండియన్‌ రైల్వే ప్రాజెక్ట్‌ (డబ్లు్యడిఎఫ్‌సి–వెస్ట్రన్‌ డెడికేటెడ్‌ ఫ్రీయిట్‌ కారిడార్‌) కోసం ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ ఇన్‌స్పెక్షన్‌ ఇంజనీర్‌గా వర్క్‌ చేస్తోంది. జాబ్‌లో చేరి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. సైట్‌ వద్ద సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి కిలోమీటర్ల దూరం నడుస్తుంది కశిష్‌. మూడు పదుల వయసున్న కశిష్‌ ఫీల్డ్‌లో పట్టిన చెమటలను తుడుచుకోవడం కంటే ఎక్సెల్‌ షీట్లను తయారు చేసే డెస్క్‌ ఉద్యోగానికి బాగా సరిపోతుంది. కానీ, ‘నేనెందుకు ఈ పని చేయలేను అనే పంతంతో ఎంచుకున్న ఉద్యోగం అది. ‘నిజానికి ఇది నా స్వభావానికి విరుద్ధమైన జాబ్‌. కానీ, ఒక అమ్మాయి మగవారు చేసే పని చేయలేదు అంటే మాత్రం ఊరుకోలేకపోయాను. సవాల్‌గా తీసుకున్నాను. చేసి చూపిస్తున్నాను’ అంటోంది కశిష్‌. ఈ జాబ్‌ గురించి మరింత వివరంగా మాట్లాడుతూ...

అదే బాధనిపిస్తుంది..
‘ఉద్యోగంలో చేరిన మొదట్లో సైట్‌కు పంపాలా వద్దా అనే విషయంపై ఆఫీసులో ప్రతి వారం చర్చలు జరిగేవి. ప్రతి వారం నేను బలంగా చెప్పేదాన్ని ‘నేను సైట్‌లో చేయగలను’ అని. ఈ రంగంలో నాకు అవకాశం ఇవ్వమని మా సీనియర్లను ఒప్పించాను. మొదటి అడుగు వేసే ముందు నేను పని చేసే బృందంతో మాట్లాడాను. సైట్లో ఉన్నంతసేపు ఒక మహిళగా చూడద్దు, నిపుణురాలిని మాత్రమే చూడాలని చెప్పాను. ఇప్పుడు ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కరికి నా సామర్థ్యం ఏమిటో తెలుసు. 10–15 మంది మగవాళ్లు చేసే పనిని ఒక్కదాన్ని నిర్వహించగలను. అలా చేసినప్పుడు నువ్వు మా ‘కొడుకు’వి అని చెప్తారు. అదే బాధనిపిస్తుంది.

చర్మం నల్లబడితే పెళ్లిచేసుకోరా..?!
ఈ వృత్తిలో అమ్మాయిని చూసినప్పుడు దానిని జీర్ణించుకోవడం కష్టం. ముఖ్యంగా ఆమె కింద పని చేయాల్సిన వారికి మరీనూ. ఇది వారి తప్పు కాదు, ఎందుకంటే గతంలో అమ్మాయిలెవ్వరూ ఈ రంగంలో లేరు. వాళ్లు ఆడవారి నుంచి సూచనలు తీసుకోలేదు. ఇది మన సంస్కృతిలో అలా ఇమిడిపోయింది. కొంతకాలం ఇబ్బంది పడ్డారు. కానీ, నేను వారి మనస్తత్వాన్ని మార్చగలను అని నమ్మాను. సాధించాను. ఇంటర్వ్యూలో నన్ను అడిగారు.. ‘ఆన్‌సైట్‌లో కొన్ని గంటల పాటు ఉండటం వల్ల చర్మం నల్లబడుతుంది. వరుడు దొరకడు, పెళ్లి అవడం కష్టం’ అని. ‘చర్మం రంగు ఆధారంగా నన్ను వివాహం చేసుకున్న వారితో కలిసి ఉండటానికి ఎంతమాత్రం నాకు ఆసక్తి లేదు’ అని చెప్పడంతో ఈ ఉద్యోగం నన్ను వరించింది.

ఇది తప్పనిసరి..
సైట్‌లోని కార్మికుల పిల్లల భవిష్యత్తును మెరుగుపర్చడానికి ఏం చేయాలా ఆలోచించాను. ఆ పిల్లల తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా వారికి చదువు చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. నేను నా హక్కులను, నా గౌరవాన్ని కాపాడుకుంటూ నా విధిని నిర్వర్తిస్తున్నాను. నేను ఎప్పుడూ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం వైపు మొగ్గు చూపేదాన్ని. ఇస్రో పరీక్షకు అప్లై చేసుకున్నాను. అయితే, దానికి ముందే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. అందుకు నా తల్లిదండ్రుల మద్దతు కూడా ఉంది.

నన్ను వెనక్కి వెళ్లిపొమ్మన్న జనాలే..
సైట్‌లో వాష్‌రూమ్‌ కోసం నిజానికి పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. వాష్‌రూమ్‌లు సైట్‌లో ఉండాలనేది తప్పనిసరి నిబంధన. కాని కాంట్రాక్టర్‌ దీనిని ఏర్పాటు చేయడు. ఎందుకంటే ఇది మగ వాళ్లు పనిచేసే చోటు. నాకు వాష్‌రూమ్‌ అవసరమనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి వారికి 6 నెలలు పట్టింది. నన్ను వెనక్కి వెళ్లిపొమ్మన్న జనాలే ఉన్నారు అక్కడ. మొత్తానికి సాధించాను. కొంతమంది మద్దతు కోసం నేను చాలా పోరాడాల్సి వచ్చింది. మొదట అందరూ నన్నో గ్రహాంతరవాసిలా చూసారు. కొన్ని రోజుల పాటు నేను ఒంటరిగానే పని చేశాను.

ఈ జాబ్‌లోకి రావడానికి అర్హత ఏంటని..?
నా కింది వారు కూడా నన్ను తప్పించడానికి ప్రయత్నించారు. కానీ, నేను బలంగా నిలబడ్డాను. మద్దతు కోసం సోషల్‌ మీడియాలో పేజీని ప్రారంభించాను. ఈ పేజీని ప్రారంభించిన తరువాత, పాతిక మంది యువతులు రైల్వేలో ఈ జాబ్‌లోకి రావడానికి అర్హత ఏంటని నన్ను అడగడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మహిళలు చేయలేరనే విభాగంలోకి ఎక్కువ మంది మహిళలు రావాలి. సమాజం మనలో నింపే భయాన్ని అడ్డుకోవాలి’ అని వివరిస్తుంది కశిష్‌.
Published date : 11 Jun 2021 08:44PM

Photo Stories