Skip to main content

అటెండర్‌ కుమార్తె..మొదటి ప్రయత్నంలోనే స్టేట్‌ ఫస్ట్ ర్యాంక్‌

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో ఓ అటెండర్‌ కుమార్తె రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటారు.
ఈ ఫలితాల్లో కర్నూలు నగరంలోని పూలబజార్‌కు చెందిన సి.పద్మాజీరావు, హేమ దంపతుల కుమార్తె సి.భారతి పేపర్‌–1లో 150 మార్కులకు 141 సాధించారు. తద్వారా మొదటిర్యాంకు కైవసం చేసుకున్నారు. పద్మాజీరావు చేనేత, జౌళి శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్నారు.

ఎప్పటికైనా నాల‌క్ష్యం ఇదే..
ఈయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. రెండో కుమార్తె సి.భారతి 2014–16 విద్యా సంవత్సరంలో డీఎడ్‌ పూర్తి చేశారు. టెట్‌ పరీక్షకు మొదటిసారి హాజరయ్యారు. మొదటి ప్రయత్నంలోనే అత్యుత్తమ ఫలితాన్ని రాబట్టారు. ఈమె ప్రాథమిక, సెకండరీ విద్య అంతా కర్నూలులోని కింగ్‌ మార్కెట్‌ దగ్గర ఉన్న ఉన్నత పాఠశాలలో చదివారు. ఇంటర్మీడియట్‌ హజీరా కాలేజీలో పూర్తి చేశారు. పద్మాజీరావు తనలా పిల్లలు ఉండకూడదని, ఉన్నతస్థాయికి ఎదగాలని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. తండ్రి కష్టాన్ని కళ్లారా చూస్తున్న భారతి చిన్నప్పటి నుంచే చదువులో రాణిస్తున్నారు. ఎప్పటికైనా సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ కావాలన్నదే తన లక్ష్యమని ఆమె తెలిపారు. టెట్‌ కోచింగ్‌ను స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని ప్రతిభా కోచింగ్‌ సెంటర్‌లో తీసుకున్నారు. ఆరు నెలల పాటు రోజుకు పది గంటల పాటు ప్రిపేర్‌ అయ్యారు.
Published date : 26 Jun 2021 08:20PM

Photo Stories