TS Gurukulam Jobs: డిసెంబర్‌లో 9,096 గురుకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పోస్టుల వివరాలు ఇవే.. వారంలోగా..
ప్రభుత్వం అనుమతించిన పోస్టుల భర్తీకీ సంబంధించిన ప్రతిపాదనల(ఇండెంట్లు)ను గురుకుల సొసైటీలు తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు సమర్పించాయి.ఈ నేపథ్యంలో ఆ ప్రతిపాదనల మేరకు పోస్టులవారీగా రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల వివరాలను పరిశీలించేందుకు నియామకాల బోర్డు సన్నద్ధమైంది.
రాష్ట్రంలోని నాలుగు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో 9,096 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ భర్తీ బాధ్యతలను ప్రభుత్వం తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు అప్పగించింది.
వారంలోగా పూర్తి..
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్‌ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) ల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో సొసైటీలవారీగా మంజూరు చేసిన పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు రూపొందించిన సొసైటీలు బోర్డుకు సమర్పించాయి. ఈ ప్రతిపాదనలను వారంరోజుల్లోగా పరిశీలించేలా బోర్డు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రతిపాదనల పరిశీలనకు షెడ్యూల్ రూపొందించిన బోర్డు సంబంధిత సొసైటీ అధికారులు సహకారం అందించాలని స్పష్టం చేసింది. సొసైటీలు సమర్పించిన ప్రతిపాదనల్లో పొరపాట్లు, సవరణలుంటే వాటిని పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వనుంది.
ఇవి పాటిస్తే.. టీచర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips
డిసెంబర్‌లో నోటిఫికేషన్..
గురుకుల విద్యాసంస్థల ఖాళీల భర్తీకి సంబంధించి వచ్చేనెల డిసెంబర్‌లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. వారంరోజుల్లోగా ప్రతిపాదనల పరిశీలన పూర్తయిన అనంతరం పోస్టుల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వాలని గురుకుల నియామకాల బోర్డు కార్యాచరణ సిద్ధం చేయనుంది. ప్రాధాన్యతాక్రమంలో పై నుంచి కిందిస్థాయి వరకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ ప్రక్రియను సైతం అదే క్రమంలో పూర్తిచేయాలని భావిస్తోంది.
అత్యధిక ఖాళీలను.
ప్రస్తుతం గురుకుల కొలువుల్లో అత్యధికంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 9,096 పోస్టులకు అనుమతులు ఇవ్వగా వాటిలో మూడో వంతుకు పైబడిన ఖాళీలు మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)లో ఉన్నాయి.
టెట్ మెరిట్‌తో ముడి..
ఆ తర్వాత స్థానంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలో 2,267 ఉద్యోగాలు, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో 1,514 కొలువులు, తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్) పరిధిలో 1,445 ఉద్యోగ ఖాళీలున్నాయి. గురుకుల టీజీటీ పోస్టులకు టెట్ మెరిట్‌తో ముడిపడి ఉంది. ఈ క్రమంలో ఇటీవల టెట్ ఫలితాలు సైతం వెలువడటంతో ఆయా పోస్టుల నియామకాలకు మార్గం సుగమమైంది.
కేటగిరీలవారీగా నోటిఫికేషన్లు..
ఇక పీజీటీ, జేఎల్, డీఎల్ పోస్టులకు సంబంధించిన నిబంధనలు సైతం ఖరారయ్యాయి. ఈ క్రమంలో గురుకుల సొసైటీలు నియామక బోర్డుకు ఇండెంట్లు సమర్పించిన వెంటనే వాటిని దాదాపు పక్షం రోజుల్లో పరిశీలించి కేటగిరీలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని గురుకుల సొసైటీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వివరించారు.
సొసైటీల వారీగా భర్తీ చేయనున్న ఉద్యోగాల సంఖ్య :
సొసైటీ పోస్టులు
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ 2,267
టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ 1,514
టీఎంఆర్‌ఈఐఎస్ 1,445
ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ 3,870
మొత్తం 9,096
TET/DSC 2022: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..