Skip to main content

Social Media Jobs 2023 : భారీ వేతనాల‌తో యూత్‌కు కొలువులు.. ఎలా అంటే..?

ఎన్నిక పండ‌గ వ‌చ్చింది.. అలాగే ఈ రంగంలో ప్ర‌తిభ ఉన్న యువ‌త‌కు రాజ‌కీయ పార్టీలు భారీ వేత‌నాల‌తో గాలం వేస్తున్నాయి. సర్వే సంస్థలకు అభ్యర్థులు, పార్టీలు ఇచ్చే మొత్తాన్ని బట్టి ఉద్యోగుల వేతనాలుంటాయి. పలు సర్వే సంస్థల నుంచి అందిన సమాచారం ప్రకారం ఒక్కో ఉద్యోగికి రోజుకు రూ. 3 నుంచి 5 వేల వరకూ చెల్లిస్తున్నారు.
Social Media Jobs 2023 Telugu News,High Salaries for Youth in Politics,Election Festival
Social Media Jobs 2023

కొన్ని సర్వే సంస్థలు స్మార్ట్‌ సర్వేలూ చేస్తున్నాయి. అభ్యర్థి నియోజకవర్గంలో ఉండే ఓటర్ల సోషల్‌ మీడియా ఫాలో అప్‌ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇతర సామాజిక మాథ్యమాల్లో అతను చేసే పోస్టింగులను విశ్లేషించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లను సర్వే సంస్థలు దిగుమతి చేసుకున్నాయి.

వీరికి ఎన్నికల సీజన్‌ వరకూ ఏక మొత్తంలో..
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్‌లో అనుభవం ఉన్న యువతను ఈ విభాగాల్లో నియమిస్తున్నారు. వీరికి ఎన్నికల సీజన్‌ వరకూ ఏక మొత్తంగా వేతనాలుంటాయని సర్వే సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ను డేటా ఎనాలసిస్‌లో అతి తక్కువ సమయంలో పూర్తి చేయగల నైపుణ్యం ఉన్న యువతకూ మంచి గుర్తింపు ఇస్తున్నారు.    భారీగానే డబ్బు ఇస్తుండడంతో  సర్వేలు చేయడా­నికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అన్ని రకాల సర్వేలు చేయడానికి కూడా యువత ఆసక్తి చూపుతున్నారు. 

యూత్‌కు ఎన్నికల సీజన్‌ వరంలా..
లింక్డ్‌ ఇన్‌... నౌకరీ డాట్‌ కామ్‌.. వంటి జాబ్‌ పోర్టల్స్‌లో మల్టీ నేషనల్‌ కంపెనీల ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న యూత్‌కు ఎన్నికల సీజన్‌ వరంలా మారింది. రాష్ట్రంలో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా, మరొ కొద్ది నెలల్లోనే పార్లమెంట్‌ ఎన్నికలు.. వరుసగా ఉండటంతో బంపర్‌ ఆఫర్లు వస్తున్నాయి. ఉద్యోగం తాత్కాలికమే అయినా మంచి వేతనం అంతకు మించిన అనుభవం లభించే వీలుంది. ఎలక్షన్‌ సర్వేల కోసం ఆయా సంస్థలు యువతీ యువకులను ఏరి కోరి ఎంపిక చేసుకుంటున్నాయి. ఆరు నెలల నుంచి ఈ తరహా ఉపాధి అవకాశాలు జోరందుకున్నా­యి.

చిన్నా చితకా కలిపి రాష్ట్రంలో వందకు పైగా సర్వే సంస్థలు ప్రస్తుతం ఎన్నికల సర్వే­ల్లో నిమగ్నమయ్యాయి. ఎలక్షన్‌ షెడ్యూల్‌ రావడంతో ఈ స్పీడ్‌ మరికొంచెం పెరిగింది. జనం నాడి తెలుసుకునేందుకు, ప్రజల మూడ్‌ను పట్టుకునేందుకు సర్వేక్షణం తోడ్పడుతుందని అన్ని పార్టీలూ, నేతలు నమ్ముతున్నారు. బహుళ జాతి కంపెనీలు ఆర్థిక అనిశ్చితితో కొట్టు మిట్టాడుతున్న తరుణంలో జాబ్‌ మార్కెట్‌కు ఎలక్షన్‌ సీజన్‌ కొంత ఆక్సిజన్‌ ఇచ్చిందని యువత అభిప్రాయపడుతున్నారు. 

ఒక్కో నియోజకవర్గంలో 1000 మందిని..
తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో సర్వే చేయడానికి కనీసం వెయ్యి మంది అవసరం అని సర్వే సంస్థలు చెబుతున్నాయి. పొలిటికల్‌ సైన్స్‌ నేపథ్యం ఉన్న పోస్టు–గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులను నేరుగా ప్రజా క్షేత్రంలోకి పంపుతారు. ప్రజల రాజకీయ అభిప్రాయం, అభ్యర్థి నుంచి ప్రజలు ఏం కోరుతున్నారో ఈ బృందం సేకరిస్తుంది. ఆపై డేటా ఎనలిస్టులు కీలక పాత్ర పోషిస్తారు. టెక్నాలజీ నేపథ్యం ఉన్న యువతను ఈ కేటగిరీలో నియమిస్తున్నారు. వివిధ కేటగిరీల నుంచి వచ్చే పలు రకాల డేటాను అప్‌లోడ్‌ చేయడం, అవసరమైన ఫార్మాట్‌లోకి దీన్ని తేవడం వారి బాధ్యత.

ఆ తర్వాత కేటగిరీలో ఎనలిస్టులుంటారు. ఆన్‌లైన్‌ నుంచి అందే డేటాను క్రోడీకరించి, ఇందులో అంశాల ద్వారా విశ్లేషణ చేయడం, కచ్చితమైన ప్రజాభిప్రాయ సేకరణ చేయడం వారి విధి. అభ్యర్థి వ్యక్తిగతంగానే కాదు... పార్టీలూ ఈ సర్వే సంస్థలకు ఆహ్వానం పలుకుతున్నాయి. దీంతో ఎన్నికల సీజన్‌లో కనీసం ఆరు నెలలు సర్వే సంస్థలకు పెద్ద ఎత్తున మానవ వనరులు అవసరం ఉంటుంది. ఇవి తమ వృత్తికి పదును పెట్టే అనుభవంగా కూడా యువత భావిస్తున్నారు. 

తాత్కాలిక ఉపాధే అయినా..
ప్రజల నాడి తెలుసుకునేందుకు రాజకీయ నేతలు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఎన్నికల రణరంగంలో ఈ సర్వేలే కీలకమని భావిస్తున్నారు. వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేయాలంటే వేల సంఖ్యలో వివిధ రకాల విద్యావంతులు అవసరం. తాత్కాలిక ఉపాధే అయినా, వారికి మెరుగైన అనుభవం వస్తోంది. ఈ ఎన్నికల సీజన్‌లో దాదాపు లక్షకు పైగానే యువత ఎన్నికల సర్వేలో నిమగ్నమైనట్టు అంచనా.  
                                                                                      –దేశినేని రాజ్‌కుమార్‌ (హెచ్‌ఎంఆర్‌ రీసెర్చ్‌) 

యువతను..
సర్వే సంస్థలో పనిచేసేందుకు ఉత్సాహం చూపే యువతను గుర్తించి నెల రోజులు సాంకేతికంగా, ఫీల్డ్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. స్కిల్‌ వెలుగులోకి రావడానికి ఇది తోడ్పడుతుంది. ఈ తక్కువ సమయంలో లభించే వేతనం పోటీ పరీక్షలు, కొన్ని రోజులు ఆర్థికంగా నిలదొక్కు కునేందుకు ఉపయోగపడుతోంది. 
                                                                                           – శైలజ (సర్వే సంస్థలో ఉద్యోగి) 

వేతనంతో పాటు ఫీల్డ్‌కు వెళ్లినప్పుడు..
ప్రజాక్షేత్రంలో ఎన్నికల సర్వే చేపట్టడం ఓ మంచి అనుభవం. ఈ సమయంలో వేతనంతో పాటు ఫీల్డ్‌కు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా టీఏ, డీఏ ఉంటాయి. ఉపాధి పరంగానూ మంచి అవకాశమే. యువత  సర్వే చేయడానికి ముందుకొస్తున్నారు. ప్రజలు కోరుకునేదేంటో నేతల దృష్టికి తీసుకెళ్తున్న తృప్తి ఉంటోంది. 
                                                                                              – లక్ష్మాగౌడ్‌ (ఎన్నికల సర్వేలో ఫీల్డ్‌  సిబ్బంది)

Published date : 16 Oct 2023 07:56AM

Photo Stories