Skip to main content

Sudha Bharadwaj Success Story : వీరి కోసం ఎన్నో పోరాటాలు చేశా.. ఓసారి నేను జైలులో ఉన్నప్పుడు..

ఈమెది అలుపెరుగని పోరాట‌ ప్రయాణం. ఈ పోరాటంలో ఎన్నో ఆట‌కాలు ఎదుర్కొన్ని.. నేడు అంద‌రి చేత ఔరా మ‌రో స్త్రీ శక్తి సుధా భరద్వాజ్‌. అమెరికాలో పుట్టి పెరిగింది సుధా భరద్వాజ్‌ అమ్మతో పాటు స్వదేశానికి వచ్చి కాన్పూర్‌ ఐఐటీలో చదువు పూర్తి చేసింది.
Sudha Bhardwaj, a symbol of resilience and determination, Sudha Bhardwaj, an American-born individual at IIT Kanpur

కార్మికులు, గిరిజన మహిళల వెతలు తెలుసుకొని అమెరికన్‌ పౌరసత్వాన్ని వదులుకుని న్యాయవాద వృత్తిని చేపట్టింది. మహిళా ఖైదీల సమస్యలపై పోరాడింది. సాధారణ జీవనం నుంచి సామాజిక కార్యకర్తగా బలహీనులకు న్యాయం చేయడానికి సమస్యలపై పోరాడుతూనే ఉంది. సుధా భరద్వాజ్‌ జీవితం తెలుసుకుంటే స్త్రీ శక్తి మరో కోణంలో పరిచయం అవకుండా ఉండదు. ఈ నేప‌థ్యంలో ఆమె స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :
అరవై ఏళ్ల క్రితం నవంబర్‌ 1న అమెరికాలో పుట్టాను. అమ్మనాన్నలు ఇద్దరూ పేరొందిన ఆర్థిక వేత్తలు. సామాజికంగానూ చాలా చురుకుగా ఉండేవారు. నేను పుట్టిన ఏడాదికి వారిద్దరూ భారతదేశం వచ్చారు. నాకు నాలుగేళ్ల వయసులో అమ్మానాన్నలు విడిపోయారు. అమ్మ ఒంటరిగా ఉంటూ నన్ను పెంచి, పెద్దచేసింది. అమ్మకు కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ ఫెలోషిప్‌ రావడంతో విదేశాలకు వెళ్లిపోయాం. ఆ తర్వాత కొన్నేళ్లకు రాజస్థాన్‌లోని జెఎన్‌యూలో టీచింగ్‌ చేయడానికి అమ్మ స్వదేశానికి వచ్చింది.

గొప్ప గొప్ప ఆర్థిక వేత్తలతో కలిసి..

Sudha-Bharadwaj story in telugu

అలా అమ్మతోపాటు నేనూ వచ్చేశాను.‘సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ స్టడీస్‌ అండ్‌ ప్లానింగ్‌’ని స్థాపించడంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించింది. గొప్ప గొప్ప ఆర్థిక వేత్తలతో కలిసి భారత ఆర్థిక వ్యవస్థపై లోతయిన అధ్యయనాలు చేసింది. జేఎన్‌యులో చదువుతో పాటు సామాజిక రాజకీయ అంశాలపై కూడా విద్యార్థులు చురుకుగా ఉండేవారు. నేను అలాంటి వాతావరణంలో పెరిగాను. సాహిత్య, సామాజిక కార్యక్రమాలంటే ఇష్టంగా ఉండేది. గణితంలో కూడా మంచి ఆసక్తి ఉండటంతో ఐఐటీ కాన్పూర్‌లో అడ్మిషన్‌ తీసుకున్నాను.

ఒక వైపు చదువుతూ.. మ‌రో వైపు కూలీలతో..
ఐఐటీలో కొంతమంది విద్యార్థులతో ఒక చిన్న రీసెర్చ్‌ టీమ్‌ ఏర్పడింది. కోర్సుతో పాటు పబ్లిక్‌ సెక్టార్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వరకు చదివేవాళ్లం. సామాజిక సమస్యలనూ చర్చించేవాళ్లం. అప్పుడే ప్రజా సంక్షేమానికి కృషి చేస్తేనే నా చదువుకు సార్థకత అనుకునేదానిని. కొంతమంది తోటివిద్యార్థులతో కలిసి కూలీల మధ్య పనిచేయడం ప్రారంభించాం.  ఓసారి ఉన్నావ్‌లోని ఓ ఫ్యాక్టరీలో కార్మికులపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన చోటుచేసుకుంది. మా టీమ్‌తో కలిసి నిజనిర్ధారణ కోసం వెళ్లాం. కష్టపడి పనిచేసే వారితో అనుబంధం అలా మొదలైంది. అక్కడ కార్మికులతో కలిసి వారి పాటలు, సంగీతం ఆస్వాదించేదాన్ని.

ఇంటికి వెళ్ళడానికి టికెట్లు కూడా కొనలేని..

Sudha-Bharadwaj story in telugu news

కాన్పురియా యాసలో మాట్లాడటం, పాడడం అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ విధంగా కార్మికుల ఉద్యమంతో చాలా ప్రభావితమయ్యాను. 1982లో ఆసియా క్రీడలు జరగడానికి ముందు ఢిల్లీలో ఫ్లై ఓవర్లు, స్టేడియం నిర్మిస్తున్నారు. ఈ పనులకోసం ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ లోని మారుమూల ప్రాంతాల నుంచి పేద కూలీలను రప్పించి, వారిని శిబిరాల్లో ఉంచారు. అయితే, వారు తమ ఇంటికి వెళ్ళడానికి టికెట్లు కూడా కొనలేని విధంగా చాలా తక్కువ కూలీ ఇచ్చేవారు. నాకెందుకో వారిని క్యాంపులో బంధించినట్లు అనిపించింది. ఆ తర్వాత 1984లో సిక్కుల ఊచకోత, భోపాల్‌ గ్యాస్‌ విషాదం దిగ్భ్రాంతికి గురిచేశాయి. సమాజంలో మార్పు తీసుకు రావాలనే సంకల్పం అప్పుడే నా మనసులో బలంగా మారింది.

ఇందుకే అమెరికా పౌరసత్వం వదులుకున్నా..
నాకు 21 ఏళ్లు వచ్చినప్పుడు, నేను పుట్టుకతో పొందిన అమెరికన్‌ పౌరసత్వాన్ని వదులుకోవాలని  అమ్మతో కలిసి అమెరికన్‌ ఎంబసీకి వెళ్లాను. నేను పౌరసత్వాన్ని వదులుకుంటున్నానని చెబితే ఆశ్చర్యపోయారు. అందుకు తగిన ఫారమ్‌ కోసం వెతికితే, దొరకలేదు. ‘వారం తర్వాత రండి. ఈ నిర్ణయం తీసుకునేముందు మీ ఇంట్లో ఎవరినైనా అడిగారా...?’ వంటి ప్రశ్నలు వేశారు. అంటే ఇంట్లో మగవారికి తెలియకుండా అమెరికన్‌ పౌరసత్వాన్ని వదులుకోవడానికి వచ్చామని వారు అనుకున్నారు. యుఎస్‌ పౌరసత్వాన్ని వదులుకున్న తర్వాత, హోం మంత్రిత్వ శాఖలో భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేశాను.  

అతని విడుదల కోసం..

Sudha-Bharadwaj news

మరోవైపు దేశంలో అలజడి కొనసాగుతోంది. మిల్లు కార్మికుల ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఈ ఉద్యమాల్లోనే అద్భుతమైన కార్మిక నాయకుడు శంకర్‌ గుహ నియోగి పేరు మొదటిసారిగా తెలిసింది. ’ఛత్తీస్‌గఢ్‌ ముక్తి మోర్చా’ ద్వారా కార్మికుల ఆర్థిక అవసరాలను పెంచడంతోపాటు, వారికోసం పాఠశాలలు, ఆసుపత్రులను నడుపుతూ వారి మధ్య ఉంటూ వ్యసనాల నుంచి బయటపడటానికి సహాయం చేస్తున్నాడు. జాతీయ భద్రతాచట్టం కింద అతణ్ణి అరెస్టు చేసినప్పుడు, అతని విడుదల కోసం విద్యార్థులుగా మేం పోరాడాం.

4,200 మంది కార్మికులను..
విడుదలైన తర్వాత ఆయనను కలిశాం. 1986 నాటికి, నేను ’ఛత్తీస్‌గఢ్‌ ముక్తి మోర్చా’తో పనిచేయాలని నిర్ణయించుకున్నాను. భిలాయ్‌ సమీపంలోని రాజహారా గనులలో పనిచేసే పిల్లలకు చదువు నేర్పించడం ప్రారంభించాను. కొంతకాలం తర్వాత, భిలాయ్‌లో కార్మిక చట్టాలను అమలు చేయడానికి భీకర పోరాటం ప్రారంభమైంది. 16 పెద్ద కంపెనీలు 4,200 మంది కార్మికులను తొలగించాయి. కార్మికులను తిరిగి పనిలో చేర్చడానికి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. కొంతమంది కార్మికులు చనిపోయారు. వారి కుటుంబాలతో కలిసి ఎండవానలు లెక్కచేయకుండా గడిపాం.

న్యాయం కోసం..ఏ మాత్రం భయపడకుండా..
కార్మికుల అభ్యర్థన మేరకు, నేను 2000 సంవత్సరంలో నా న్యాయవిద్యను పూర్తి చేసి వారి కోసం న్యాయపోరాటం ప్రారంభించాను. కూలీలు, గిరిజనులు, మహిళలు అనే తేడా లేకుండా వారి కోసం చేసిన చట్టాలు సక్రమంగా అమలు కాకపోవడం చూశాను. నిరసన తెలిపితే వారిపై కేసులు పెడతారు. ఆ తర్వాత కొంతమంది తోటి లాయర్లతో కలిసి జన్‌–హిత్‌ పేరుతో గ్రూప్‌ని ప్రారంభించాను. ఆ తర్వాత భూసేకరణ, అటవీ హక్కులు, పర్యావరణ సంబంధిత సమస్యలకు సంబంధించిన అనేక కేసులను వాదించడం ప్రారంభించాం. కేసులన్నీ కార్పొరేట్లపైనే ఉన్నాయి. అప్పటికి చాలామంది శత్రువులను కూడగట్టుకున్నానని గ్రహించాను. కానీ, ఏ మాత్రం భయపడకుండా బలహీనుల కోసం నా గొంతు పెంచుతూనే ఉన్నాను.

ఆశ సన్నగిల్లిన..
2006లో దంతెవాడలో ఐదుగురు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ మహిళల కేసుపై పోరాడేందుకు న్యాయవాది ఎవరూ సిద్ధంగా లేరు, నేను నా సహోద్యోగులతో కలిసి వారికి న్యాయం చేసే బాధ్యతను తీసుకున్నాను. బాధితుల వాంగ్మూలం నమోదు చేసేందుకు దంతెవాడకు 150 కి.మీ దూరంలోని కొంటకు వెళ్లాల్సి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌ భాషలో, కొంట అంటే మూల అని అర్థం, ఆ ప్రదేశం నిజానికి ఛత్తీస్‌గఢ్‌లోని ఒక మూల. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రారంభమవుతుంది. జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ప్యూన్‌ సైకిల్‌పై ఎక్కి వస్తారంటే అక్కడి పరిస్థితిని అంచనా వేయవచ్చు. బాధితులు గోండీ భాషలో తమ బాధలను వివరిస్తుంటే అక్కడ ఉన్న ప్యూన్‌ అనువాదకుడిగా మారాడు. అప్పుడే అత్యాచారం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసు దంతెవాడకు బదిలీ అయింది. ఆ తర్వాత మహిళలపై ఒత్తిడి తెచ్చి కేసులు ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకునేలా చేశారు. అప్పుడు న్యాయంపై ఆశ చచ్చిపోయిందనిపించింది.

8 నెలల గర్భిణి.. అపస్మారక స్థితికి చేరుకోవడంతో..
రాజహారలో ఉన్నప్పుడు 8 నెలల గర్భిణిని. ఆ రోజు చాలా వర్షం, మెరుపులు, కడుపునొప్పితో బాధపడుతున్నాను. మా యూనియన్‌ చెందిన షాహీద్‌ హాస్పిటల్‌ కి నడుచుకుంటూ వెళుతుండగా రక్తం కారుతున్నట్లు అనిపించింది. ఎలాగోలా ఆసుపత్రికి చేరుకుని అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆపరేషన్‌ అయింది. స్పృహ వచ్చాక గర్భస్రావం అయిందని తెలిసింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత, మళ్లీ గర్భం ప్రమాదకరమనుకున్నాను. అందుకే ఒకమ్మాయిని దత్తత తీసుకున్నాను. కూతురు డిగ్రీ చదువు కోసం డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీకి వచ్చి 58 ఏళ్ల వయసులో నేషనల్‌ లా యూనివర్సిటీలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా తొలిసారి రెగ్యులర్‌ ఉద్యోగంలో చేరాను.

నేను జైలులో ఉన్నప్పుడు..

Sudha-Bharadwaj stroy telugu

ఏడాది సాఫీగానే గడిచింది. కానీ, ఉద్యమకారిణిగా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. చాలా పోరాటం తర్వాత తను గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. జైలులో ఉన్నప్పుడు కూతురిని కలవాలని చాలా తపించేదాన్ని. నెలకు ఒకసారి ఉత్తరానికి సమాధానం వచ్చేది. కలవడానికి వీలయ్యేది కాదు.  జైలులో ఉన్న మూడేళ్లు మహిళా ఖైదీల సమస్యలను వింటూ, వారి కోసం వర్క్‌ చేశాను. సామాజిక కార్యకర్తలకు వ్యక్తిగత జీవితం లేదన్నది నిజం. వారు ఇంటికీ, సామాజిక జీవితానికీ మధ్య సమన్వయం చేసుకోలేరు. 

దీపం కింద చీకటి అనే సామెత నిజం అవుతుంది. ముఖ్యంగా మహిళా సామాజిక కార్యకర్తలు మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నా జైలు డైరీ ’ఫ్రం ఫాన్సీ యార్డ్‌’లో నేను అలాంటి చాలామంది మహిళల కథలను పంచుకున్నాను. సమాజంలోని ఈ దురాచారాలకు వ్యతిరేకంగా నేను ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నాను’’ అని వివరిస్తారు ఈ సామాజిక కార్యకర్త.

Published date : 03 Nov 2023 10:29AM

Photo Stories