NVIDIA CEO Jensen Huang Sucess Story: ఒకప్పుడు రెస్టారెంట్‌లో సర్వర్.. ఇప్పుడు వేలకోట్లకు అధిపతి - ఎవరీ హువాంగ్!
కన్న కలను నిజం చేసుకోవడం అంటే అంత సులభమైన పనేమీ కాదు. దాని కోసం నిరంతర ప్రయత్నం, అంకిత భావం చాలా అవసరం. ఇవన్నీ తోడైనప్పుడు జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి సాధ్యమవుతుంది. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'జెన్సన్ హువాంగ్' (Jensen Huang). ఇంతకీ ఈయనెవరు? ఈయన సాధించిన సక్సెస్ ఏంటి అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..
రెస్టారెంట్ సర్వర్‌గా..
1963లో తైవాన్‌లోని తైనాన్‌లో జెన్సన్ హువాంగ్ జన్మించారు. ఈయన కుటుంబం అతనికి ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే.. థాయిలాండ్‌కు మకాం మార్చారు. తొమ్మిదేళ్ల ప్రాయంలో అతని మేనమామతో కలిసి వాషింగ్టన్‌లోని టాకోమాకు వెళ్ళాడు. చదువుకునే రోజుల్లోనే హువాంగ్ ఒకప్పుడు డెన్నీ రెస్టారెంట్‌లో సర్వర్‌గా పనిచేసేవారు.
ఆ తరువాత క్రిస్ మలాచోస్కీ అండ్ కర్టిస్ ప్రీమ్‌లతో కలిసి 1993లో 'ఎన్‌విడియా' (Nvidia) స్థాపించారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగారు. 2007లో సీఈఓగా జెన్సన్ హువాంగ్ వేతనం 24.6 మిలియన్ డాలర్లు. దీంతో యునైటెడ్ స్టేట్స్‌లో అత్యధిక జీతం తీసుకునే 61వ వ్యక్తిగా నిలిచారు.
ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా..
సర్వర్‌గా పనిచేసిన జెన్సన్ హువాంగ్ ప్రస్తుతం 64.2 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 23వ స్థానంలో ఉన్నారు. ఈయన కంపెనీ క్యాపిటలైజేషన్ 1.83 ట్రిలియన్లు లేదా రూ. 15100000 కోట్ల కంటే ఎక్కువ. ఒక సర్వర్ స్థాయి నుంచి ప్రపంచ ధనవంతుల జాబితాలో నిలిచే వరకు ఎదిగారంటే దాని వెనుక ఆయన కృషి, పట్టుదల ఇట్టే అర్థంపైపోతుంది.