Skip to main content

Inspiration Story: చెస్‌లో విశ్వ విజేత‌... తొలి ఖేల్‌ర‌త్న అవార్డుతో పాటు వంద‌ల రికార్డులు.. విశ్వ‌నాథ‌న్ ఆనంద్ తొలి గురువు తెలుసా.?

ప్రతి ఆటకూ ఒకరు టార్చ్‌బేరర్‌ ఉంటారు... అతను నడిచిన బాట కొత్త తరానికి మార్గనిర్దేశనం చేస్తుంది.. అతను వేసిన దారి కొత్తవారి విజయాన్ని సులువు చేస్తుంది..ఆ ఆటగాడు ఇచ్చిన స్ఫూర్తి అందరికీ నమ్మకాన్ని కలిగిస్తుంది.. మేమూ సాధించగలమనే ధైర్యాన్నిస్తుంది.
viswanathan anand

భారత్‌ చదరంగానికి సంబంధించి ఆ ఘనాపాటి విశ్వనాథన్‌ ఆనంద్‌.. మిగతా క్రీడల్లో మరో పేరు స్ఫురణకు రావచ్చేమో కానీ ఆనంద్‌ లేకుండా భారత చెస్‌ లేదు..ఇప్పుడు భారత్‌లో 79 మంది గ్రాండ్‌మాస్టర్లు.. మొదటివాడు మాత్రం మన ‘విషీ’..

దశాబ్దాలుగా చదరంగంలో సాగుతున్న రష్యా ఆధిపత్యాన్ని ఆనంద్‌ బద్దలు కొట్టగలిగాడు. గ్యారీ కాస్పరోవ్, అనతొలి కార్పొవ్, వ్లదిమిర్‌ క్రామ్నిక్‌.. మొదలైన వారికి సవాల్‌ విసురుతూ ఆనంద్‌ శిఖరానికి చేరగలిగాడు. ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. చెస్‌ ఆటకు మన దేశం నుంచి అసలైన రాయబారిగా నిలిచాడు.

Viswanathan Anand Parents

చ‌ద‌వండి: వైకల్యంతో పుట్టాడ‌ని తల్లిదండ్రులు వదిలేశారు... ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతున్నాడు

అమ్మే ఆది గురువు...
అమ్మ సుశీల ఆనంద్‌కు చెస్‌లో ఆది గురువు. 1980వ ద‌శ‌కంలో తల్లిదండ్రులకు ఏదైనా క్రీడలో ఆసక్తి ఉండి వారు అందులో ప్రోత్సహిస్తే అదే ఆటను ఎంచుకోవడం తప్ప సొంతంగా తమ ఇష్టాయిష్టాలను ప్రదర్శించే అవకాశం తక్కువ. అందులోనూ చెస్‌ అంటే ‘ఏం భవిష్యత్‌ ఉంటుంది?’ అన్నట్లుగానే ఉండేది. ఆనంద్‌ తల్లికి చదరంగం అంటే ఇష్టం. దీంతో తానే గురువుగా మారి అన్నీ నేర్పించింది.  తండ్రి కృష్ణమూర్తి కూడా ఎంతో ప్రోత్సహించాడు. ఉద్యోగరీత్యా తాను ఫిలిప్పీన్స్‌లో ఉండాల్సి వస్తే అక్కడకు వెళ్లాక సరైన రీతిలో శిక్షణ ఇప్పించాడు.
లైట్నింగ్‌ కిడ్‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు...
ఆ కుర్రాడు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఊహించినదానికంటే వేగంగా ఎదుగుతూ దూసుకుపోయాడు. మద్రాసులో ఆరేళ్ల వయసులో చెస్‌లో ఓనమాలు దిద్దుకున్న ఆనంద్‌ ఐదు పదులు దాటినా విశ్వవ్యాప్తంగా ఇప్పటికీ తనదైన ముద్రను చూపించగలుగుతున్నాడంటే అతని ఘనత ఎలాంటిదో అర్థమవుతోంది. వర్ధమాన ఆటగాడిగా ఎదుగుతున్న సమయంలో ‘లైట్నింగ్‌ కిడ్‌’ అంటూ చెస్‌ ప్రముఖులతో పిలిపించుకున్న విషీ.. ఆ తర్వాత చదరంగంలో తన విజయాలతో వెలుగులు విరజిమ్మాడు. 

చ‌ద‌వండి: పాతికేళ్ల‌కే జ‌డ్జి అయిన యువ‌తి స‌క్సెస్ స్టోరీ తెలుసా.?
వరుస విజయాలతో...
14 ఏళ్ల వయసులో జాతీయ సబ్‌ జూనియర్‌ చాంపియన్‌ గెలవడం మొదలు ఆనంద్‌కు ఎదురు లేకుండా పోయింది. ఆశ్చర్యకర రీతిలో అసలు అపజయాలు లేకుండా అతను పైపైకి దూసుకుపోయాడు. తర్వాతి ఏడాదే ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌, 15 ఏళ్లకే ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ నార్మ్‌ సాధించిన ఆటగాడిగా గుర్తింపు, 16 ఏళ్లకే జాతీయ సీనియర్‌ చాంపియన్‌, 18 ఏళ్ల వయసులో వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌ .. ఈ జాబితా అలా సాగుతూ పోయింది.

Viswanathan Anand with his Wife


1988లో నూత‌న చ‌రిత్ర‌కు శ్రీకారం
ఆనంద్‌ ఉన్నాడంటే చాలు ప్రత్యర్థులు రెండో స్థానానికి పోటీ పడేందుకు సిద్ధమైనట్లే అన్నట్లుగా పరిస్థితి ఉండేది! తన విజయాలు గాలివాటం కాదని, ఈ అసాధారణ ప్రతిభతో మున్ముందు తానేంటో చూపించగలననే నమ్మకం ఎట్టకేలకు 19వ ఏట వచ్చింది. 1988లో సొంత రాష్ట్రంలోని కోయంబత్తూర్‌లో జరిగిన శక్తి ఇంటర్నేషనల్‌ టోర్నీని గెలవడంతో ఒక కొత్త చరిత్ర నమోదైంది. భారతదేశపు తొలి గ్రాండ్‌మాస్టర్‌గా విశ్వనాథన్‌ ఆనంద్‌ అవతరించాడు. అక్కడ మొదలైన ఆ అగ్రస్థాయి ప్రస్థానం ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా నిలిపింది.  
అందరికీ ఇష్టుడు...
‘వై దిస్‌ నైస్‌ గై ఆల్వేస్‌ విన్‌ ’.. విశ్వనాథన్‌ ఆనంద్‌ గురించి చెస్‌ ప్రపంచంలో తరచుగా వినిపించే, అతనికి మాత్రమే వర్తించే వ్యాఖ్య! సాధారణంగానే చెస్‌ ఆటగాళ్లు బోర్డుపై మినహా బయట ఎక్కువగా దూకుడు ప్రదర్శించరు. కానీ ఆనంద్‌ వారందరికంటే మరో మెట్టు పైనుంటాడు. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో హోరాహోరీ మ్యాచ్‌లలో ఆడినా ఏరోజూ అతను సంయమనం కోల్పోలేదు. విమర్శలు, ప్రతివిమర్శలు చేయలేదు. ఏర్పాట్లు, సౌకర్యాల విషయంలో ఫిర్యాదు చేయలేదు.
వేల కి.మీ. రోడ్డు ద్వారా ప్రయాణించి....
అతని ఆటలాగే మాట, వ్యవహారశైలి కూడా ప్రశాంతంగా ఉంటుంది. తాను జూనియర్‌గా ఉన్న సమయంలో ఏర్పాట్లు బాగా లేవంటూ ఆటగాళ్లంతా మూకుమ్మడిగా టోర్నీని బహిష్కరిస్తే తాను మాత్రం ఎక్కడైనా ఆడేందుకు సిద్ధమని ఆనంద్‌ స్పష్టంగా చెప్పేశాడు. అదే నాలుగుసార్లు వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత కూడా విమానాలు అనూహ్యంగా రద్దయితే రెండు రోజుల పాటు 2 వేల కిలోమీటర్లు రోడ్డు ద్వారా ప్రయాణించి మరీ ఇచ్చిన మాటకు కట్టుబడి అక్కడికి చేరుకున్న వెంటనే మ్యాచ్‌ ఆడాడు. ఇలాంటి వ్యక్తిత్వమే ఆనంద్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను తెచ్చి పెట్టింది.

చ‌ద‌వండి: కొడుకుతో పోటీ ప‌డిన తండ్రి.. కూతురుతో పోటీ ప‌డిన త‌ల్లి ఎక్క‌డో తెలుసా.?
తొలిసారి వరల్డ్‌ నంబర్‌వన్‌గా....
2000, 2007, 2008, 2010, 2012లలో విశ్వనాథన్‌ ఆనంద్‌ వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచాడు. 2007లో తొలిసారి ర్యాంకింగ్స్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌గా మారిన అతను సుదీర్ఘకాలం ప్రపంచ చెస్‌ను శాసించాడు. తన సమకాలికులు ఎందరికో సాధ్యం కాని రీతిలో 48 ఏళ్ల వయసులో అత్యంత వేగంగా సాగే ‘ర్యాపిడ్‌’ ఈవెంట్‌లో సత్తా చాటాడు. తన తరంలో అత్యుత్తమ ర్యాపిడ్‌ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను 2003, 2017లలో ఈ విభాగంలో విశ్వవిజేతగా నిలిచాడు.
అన్ని ఫార్మాట్ల‌లోనూ అత‌నే విజేతగా....
ర్యాపిడ్‌ కంటే కూడా వేగంగా క్షణాల వ్యవధిలో సాగే బ్లిట్జ్‌లో తన ముద్ర వేయడం ఆనంద్‌కే చెల్లింది. 2000లో వరల్డ్‌ బ్లిట్జ్‌ కప్‌ విజేతగా నిలవడం అతని సామర్థ్యాన్ని చూపించింది. టోర్నమెంట్‌ ఫార్మాట్, మ్యాచ్‌ ఫార్మాట్, నాకౌట్‌ ఫార్మాట్, ర్యాపిడ్‌ ఫార్మాట్‌లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఏకైక ఆటగాడు కావడం.. ఆనంద్‌ గొప్పతనాన్ని చెబుతుంది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లు మాత్రమే కాదు కోరస్‌ ఇంటర్నేషనల్, టాటా స్టీల్, తాల్‌ మెమోరియల్, లినారెస్‌ చెస్‌లాంటి ప్రతిష్టాత్మక టోర్నీ విజయాలు అతని ఖాతాలో ఉన్నాయి.
అవార్డులు... రివార్డులు
భారత ప్రభుత్వం నుంచి తొలి ‘ఖేల్‌రత్న’ పురస్కారంతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లు అతనికి కంఠాభరణంగా మారాయి. ‘మై బెస్ట్‌ గేమ్స్‌ ఆఫ్‌ చెస్‌’ అంటూ తన అనుభవాలతో భారత్‌ చెస్‌కు కొత్త పాఠాలు నేర్పించిన ఆనంద్‌ కెరీర్‌ ఆద్యంతం స్ఫూర్తిదాయకం.   
- మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

Published date : 25 Feb 2023 01:40PM

Photo Stories