Commerce Students: చదువుతోపాటు నైపుణ్యం కూడా అవసరం
లబ్బీపేట(విజయవాడతూర్పు): కామర్స్ విద్యార్థులకు చదువుతో పాటు వివిధ నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఐసీఎస్‌ఐ అమరావతి చాప్టర్ వైస్ చైర్మన్ సయ్యద్ మొహమ్మద్ అబ్బాస్ అన్నారు. నలంద డిగ్రీ కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కాంక్వెస్ట్ 2024 ఉత్సాహపూరితమైన వాతావరణంలో జరిగింది. నగరంలోని వివిధ కళాశాలల నుంచి 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ముఖ్యఅతిథిగా హాజరైన మొహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ కామర్స్ విద్యార్థులు ఎప్పటికప్పుడు ఆర్థిక రంగానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో అపార ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మరో అతిథి ఐసీఎస్‌ఐ కోశాధికారి నాగరాజు మాట్లాడుతూ కంపెనీ సెక్రటరీ కోర్సుకు అత్యంత డిమాండ్ ఉందని చెప్పారు.
AI Education: కళాశాల విద్యార్థులకు కృత్రిమ మేధ (ఏఐ)తో బోధన
విద్యార్థులు ఆ రంగంపై దృష్టి పెట్టాలని సూచించారు. తమ సంస్థ నుంచి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అనలిటిక్స్, క్విజ్, పీపీటీ, పోస్టర్ మేకింగ్, స్పాట్ ఫోటోగ్రఫీ, అంత్యాక్షరి, గ్రూప్‌డాన్స్ వంటి పోటీలు నిర్వహించారు. వాటిలో విజేతలకు బహుమతులు అందచేశారు. ప్రిన్సిపాల్ ఎం. అనురాధ, కామర్స్ హెచ్‌ఓడీ జె.వంసత్‌కుమార్ పాల్గొన్నారు.