Skip to main content

Intermediate Public Exams 2024: ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల స్పాట్‌ వాల్యూయేషన్‌ ప్రక్రియలో జాప్యం

ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల స్పాట్‌ వాల్యూయేషన్‌ ప్రక్రియలో జాప్యం
spot valuation process   Intermediate Public Exams 2024   Delay in Spot Valuation Process of Intermediate Public Examinations
Intermediate Public Exams 2024: ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల స్పాట్‌ వాల్యూయేషన్‌ ప్రక్రియలో జాప్యం

గుంటూరు : ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల స్పాట్‌ వాల్యూయేషన్‌కు ప్రైవేటు, కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలలు మోకాలడ్డుతున్నాయి. పరీక్షలు రాసిన విద్యార్థుల పేపర్లను దిద్దేందుకు అవసరమైన అధ్యాపకుల్ని క్యాంప్‌నకు పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆన్సర్‌ స్క్రిప్ట్‌లకు మూల్యాంకనం నిర్వహించి, నిర్దేశిత సమయానికి ఫలితాల్ని ప్రకటించాల్సి ఉన్నప్పటికీ కళాశాలల యాజమాన్యాలు అనుసరిస్తున్న ధోరణితో మొత్తం స్పాట్‌ వాల్యూయేషన్‌ ప్రక్రియలో జాప్యం నెలకొనే పరిస్థితులు ఏర్పడ్డాయి.

విధుల్లో 500 మంది అధ్యాపకులు

ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల స్పాట్‌ వాల్యూయేషన్‌ క్యాంపు ఈనెల 9వ తేదీ నుంచి గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో జరుగుతోంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆన్సర్‌ స్క్రిప్ట్‌లకు అధ్యాపకులు వాల్యూయేషన్‌ చేస్తున్నారు. క్యాంపు అధికారి, ఆర్‌ఐవో జీకే జుబేర్‌ పర్యవేక్షణలో 500 మంది అధ్యాపకులు ఎగ్జామినర్‌, చీఫ్‌ ఎగ్జామినర్లుగా విధుల్లో నిమగ్నమయ్యారు. సంస్కృతంతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, సివిక్స్‌ సబ్జెక్టుల వారీగా వాల్యూయేషన్‌ జరుగుతుండగా, శుక్రవారం ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ సబ్జెక్టులు మొదలైంది.

యాజమాన్యాల నిర్లక్ష్యం

సబ్జెక్టుల వారీగా స్పాట్‌ వాల్యూయేషన్‌ విధులకు నియమించిన అధ్యాపకులు పూర్తిస్థాయిలో విధులకు హాజరు కావడం లేదు. స్పాట్‌ విధులకు నియమించిన అధ్యాపకుల్లో ఇంగ్లిష్‌లో 32, మాఽథ్స్‌లో 35, సివిక్స్‌లో 10 మంది చొప్పున హాజరు కావడం లేదు. ఇటీవల ముగిసిన పబ్లిక్‌ పరీక్షలకు గుంటూరు జిల్లాలో 58వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 70 శాతానికి పైగా ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల్లో చదువుతున్న వారే కావడం గమనార్హం. ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలలతో పోల్చితే స్పాట్‌ వాల్యూయేషన్‌ విధులకు ప్రైవేటు, కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల నుంచే ఎక్కువ మంది అధ్యాపకులు అవసరమున్నారు. స్పాట్‌ వాల్యూయేషన్‌ విధులకు బోర్డు ద్వారా ఆర్డర్లు అందుకున్న అధ్యాపకులు విధిగా హాజరు కావాల్సి ఉండగా, కళాశాలల ప్రిన్సిపాల్స్‌ వారిని రిలీవ్‌ చేయడం లేదు. ఈనెల 18న టెన్త్‌ పరీక్షలు ప్రారంభమైన రోజునే కార్పొరేట్‌ కళాశాలలు జూనియర్‌ ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులకు సీనియర్‌ ఇంటర్‌ తరగతులను ప్రారంభించేశాయి. జిల్లావ్యాప్తంగా కార్పొరేట్‌ కళాశాలల్లో జూనియర్‌ ఇంటర్‌ పరీక్షలు రాసిన వారికి సీనియర్‌ ఇంటర్‌తో పాటు సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు నీట్‌, ఏపీ ఈఏపీ సెట్‌, జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ కల్పిస్తున్న కారణంగా అధ్యాపకులను రిలీవ్‌ చేయకుండా స్పాట్‌ వాల్యూయేషన్‌కు మోకాలడ్డుతున్నారు.

తీవ్రంగా పరిగణిస్తున్న బోర్డు అధికారులు

స్పాట్‌ వాల్యూయేషన్‌ విధులకు అధ్యాపకులను పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలపై ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారులు సీరియస్‌గా ఉన్నారు. మూల్యాంకన విధులకు గైర్హాజరవుతున్న అధ్యాపకులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంతో పాటు, రిపోర్టు చేయాల్సిన రోజు మొదలు రోజుకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేశారు. కళాశాలల యాజమాన్యాల వైఖరిని తీవ్రంగా పరిగణిస్తున్న అధికారులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 31 నాటికి స్పాట్‌ వాల్యూయేషన్‌ ముగించాలని ఇంటర్‌ బోర్డు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అధ్యాపకులు గైర్హాజరు కారణంగా జాప్యం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

జరిమానాతో పాటు కఠిన చర్యలు

స్పాట్‌ వాల్యూయేషన్‌ విధులకు గైర్హాజరవుతున్న అధ్యాపకులకు రోజుకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రారంభమైన సబ్జెక్టుల్లో అధ్యాపకుల కొరత ఉంది. శుక్రవారం ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ మొదలైన దృష్ట్యా ఎంత మంది అధ్యాపకులు రిపోర్టు చేశారనే విషయమై శనివారానికి స్పష్టత వస్తుంది. గైర్హాజరైన అధ్యాపకులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చి, జరిమానా విధించడంతో పాటు కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. కార్పొరేట్‌ కళాశాలల వైఖరితో మొత్తం వాల్యూయేషన్‌ ప్రక్రియ జాప్యం నెలకొనే పరిస్థితులు ఏర్పడ్డాయి.

                                                                                                  – జీకే జుబేర్‌, ఆర్‌ఐవో

Published date : 23 Mar 2024 12:59PM

Photo Stories