Skip to main content

Medical College: మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌

Ragging in medical college

భువనేశ్వర్‌: పూరీ శ్రీజగన్నాథ్‌ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ ఘటన కలకలం రేపింది. ఈ మేరకు కళాశాల డీన్‌ మరియు ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ మాయా పాఢి పెంటకోట మైరెన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థి అభిషేక్‌ మీనా కళాశాల సీనియర్‌ విద్యార్థుల ర్యాగింగ్‌కు గురయ్యాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

విచారణ ప్రారంభం
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ర్యాగింగ్‌ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టారు. ఈ విచా రకర సంఘటనకు పాల్పడిన విద్యార్థులను గుర్తించే దిశలో విచారణ చేపట్టారు. క్యాంపస్‌లో ర్యాగింగ్‌ నివారణపై చైతన్యం, అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వర్గం పని చేస్తుంది. ర్యాగింగ్‌ వ్యతిరేక కమిటీ ప్రత్యక్షంగా ఈ వ్యవహారం పర్యవేక్షిస్తుందని ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ మాయ పాఢి తెలిపారు.

చదవండి: Medical Students: వైద్య విద్యార్థులకు వరం.. డిజిటల్‌ లైబ్రరీ

ర్యాగింగ్‌ ఇలా...
ఈనెల 17న మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. మొదటి సంవత్సరం చదువుతున్న అభిషేక్‌ మీనాపై రెండో సంవత్సరం చదువుతున్న కొందరు విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. సీనియర్లు బలవంతంగా అభిషేక్‌ గడ్డం, మీసాలు తీసేసి అతనితో అసభ్యంగా ప్రవర్తించి ర్యాగింగ్‌కు పాల్పడినట్లు సమాచారం. దీంతో అభిషేక్‌ కళాశాల అధికారులకు ఫిర్యాదు చేయగా, ర్యాగింగ్‌ నిరోధక కమిటీతో చర్చించిన అనంతరం డీన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్‌ ఆరోపణ తలెత్తితే సత్వర చర్యలు చేపట్టడం అనివార్యం. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ యూజీసీ మార్గదర్శకాల మేరకు చర్యలు చేపట్టి తక్షణమే తెలియజేయాల్సి ఉంటుందని డీన్‌ వివరించారు.

యూజీసీ మార్గదర్శకాల మేరకు ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుంది. స్థానిక ఎస్పీ క్యాంపస్‌ సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పూరీ ఎస్‌డీపీవో తెలిపారు. ఇదిలా ఉండగా ముగ్గురు నిందిత విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్‌కు క్షమాపణ లేఖను సమర్పించినట్లు తెలిసింది.

Published date : 22 Aug 2023 03:33PM

Photo Stories