Medical Students: వైద్య విద్యార్థులకు వరం.. డిజిటల్ లైబ్రరీ
- అత్యాధునిక సదుపాయాలతో డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్సిటీలో ఏర్పాటు
- అందుబాటులో వేలాది టెక్స్ట్ బుక్స్, జర్నల్స్, వీడియోలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యవిద్యకు సంబంధించిన అత్యాధునిక పుస్తకాలు, వివిధ రకాల అరుదైన చికిత్సలకు సంబంధించిన వీడియోలు, వేలాది జర్నల్స్‌తో కూడిన డిజిటల్ లైబ్రరీ (ఈ–లైబ్రరీ)ని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
వైఎస్సార్ మెడ్‌నెట్ కన్సార్షియం పేరుతో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీలో మెడికల్, డెంటల్, ఫిజియోథెరపీ, ఆయుష్, పారా మెడికల్, నర్సింగ్ కోర్సులకు సంబంధించి వేలాది రకాల అత్యాధునిక పాఠ్యపుస్తకాలు, జర్నల్స్, అరుదైన చికిత్సలు, ట్రీట్‌మెంట్ ప్రొటోకాల్‌కు సంబంధించిన వీడియోలు ఉంచారు. ప్రతి విద్యార్థి డిజిటల్ లైబ్రరీని సులభంగా వినియోగించుకునేందుకు మైలాఫ్ట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం యూనివర్సిటీ రూ. 4 కోట్లు వెచ్చించింది.
మైలాఫ్ట్.. యూజర్ ఫ్రెండ్లీ యాప్..
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 2008లోనే డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. కానీ పరిమిత సంఖ్యలో మాత్రమే అక్కడ పుస్తకాలు అందుబాటులో ఉండేవి. లైబ్రరీలో మాత్రమే దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో లైబ్రరీ పనివేళల్లో వెళ్లేందుకు కుదరకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడేవారు.
చదవండి: Outsourcing Posts: వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్ సోర్సింగ్ పోస్టులు
పరిస్థితి గమనించిన ప్రస్తుత వర్సిటీ అధికారులు అత్యాధునిక పరిజ్ఞానంతో మైలాఫ్ట్ (మై లైబ్రరీ ఆన్ ఫింగర్ టిప్స్) అప్లికేషన్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థులు, టీచింగ్ వైద్యులు, ఎక్కడినుంచైనా తమ మొబైల్‌లో సైతం లాగిన్ అయ్యి డిజిటల్ లైబ్రరీని వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీన్లో 21 వేలకు పైగా ఈ–బుక్స్, 22,433కు పైగా ఈ– జర్నల్స్, 11,000 పైగా వీడియోలు ఉన్నాయి.
ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా
ప్రతి విద్యార్థి ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా డిజిటల్ లైబ్రరీని ఆధునీకరించాం. మైలాఫ్ట్ యూజర్ ఫ్రెండ్లీ యాప్ ద్వారా విద్యార్థులు, ఫ్యాకల్టీ ఎక్కడి నుంచైనా, తమ మొబైల్స్‌లో సైతం లాగిన్ అయ్యే అవకాశం కల్పించాం. డిజిటల్ లైబ్రరీ వినియోగంపై అన్ని కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ వి.రాధికారెడ్డి, రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ
సద్వినియోగం చేసుకోవాలి
మైలాఫ్ట్ యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు టెక్నికల్ సిబ్బందితో కలిసి జోనల్ వారీగా సదస్సులు నిర్వహించి యాప్ వినియోగంపై ఫ్యాకలీ్ట, విద్యార్థుల్లో అవగాహన కలి్పస్తున్నాం. వేలాది ఈ–బుక్స్, ఈ–జర్నల్స్, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి.
– డాక్టర్ కె.సుధ, కో ఆర్డినేటర్, కన్సార్షియం, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ