IIITDM Kurnool: రూ.296.12 కోట్లతో ట్రిపుల్ ఐటీడీఎం క్యాంపస్ నిర్మాణం.. నేడు జాతికి అంకితం!!
అన్ని రకాల సదుపాయాలతో తీర్చిదిద్దిన ఈ సంస్థను ఫిబ్రవరి 20వ తేదీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా జాతికి అంకితం చేయనున్నారు. ఇదే రోజు దేశంలో సుమారుగా 32 ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీడీఎం, ఐఐఎస్‌ఈఆర్ సంస్థలను జాతికి అంకితం చేయనున్నారు. వీటిలో కర్నూలు ట్రిపుల్‌ఐటీ డీఎం, తిరుపతి ఐఐటీ, శ్రీసిటీ ఐఐఐటీ, తిరుపతి ఐఐఎస్‌ఈఆర్ (ఇండియన్ ఇన్‌స్టిటూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్), వైజాగ్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లు ఉన్నాయి. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ట్రిపుల్‌ఐటీ డీఎంకు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మొదటగా ఈ సంస్థను కాంచీపురం(తమిళనాడు)లో 2015 ఆగస్టులో ప్రారంభించారు.
Indian Institute of Management: ఫిబ్రవరి 20వ తేదీ ఐఐఎం విశాఖ ప్రారంభం
శాశ్వత క్యాంపస్‌తో కర్నూలులో 2018 జూలై నుంచి ఈ సంస్థ విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. క్యాంపస్‌లో నాలుగు యూజీ, 6 పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. బీటెక్ సీట్లు మొదట 75 ఉండగా నేడు 271కి పెరిగాయి. ఇక్కడ బీటెక్ పూర్తి చేసిన వారు ఏడాదికి రూ.7.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.30 లక్షల వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నారు. ఎంటెక్‌లో 100 శాతం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఉంటున్నాయి. రూ.11 లక్షల వార్షిక వేతనంతో ఎంటెక్ విద్యార్థులు ఉద్యోగాలు పొందుతున్నారు. రెండేళ్ల ఎంటెక్ కోర్సులో ఒకేడాది ఇక్కడ, నార్వేలో మరో సంవత్సరం విద్యాభ్యాసానికి సంస్థ నార్వే ఆగ్ధర్ యూనివర్సిటీలో ఒప్పందం చేసుకోగా, ప్రస్తుతం ఆరుగురు విద్యార్థులు నార్వేలో చదువుతున్నారు. క్యాంపస్‌లో 5జీ ల్యాబ్ ఏర్పాటు చేశారు.
అన్ని సౌకర్యాలు..
కర్నూలు నగర శివారులోని శివారులోని జగన్నాథగట్టుపై 151.51 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో ఈ సంస్థ ఏర్పాటైంది. గట్టులో లోయలు, ఎత్తు పల్లాలు ఉన్నప్పటికీ ఆర్కిటెక్చర్ నైపుణ్యంతో కట్టిన భవనాలు క్యాంపస్‌కు సరికొత్త అందాలను ఇచ్చాయి. రూ.296.12 కోట్లతో క్యాంపస్‌లో మొత్తం 16 తరగతి భవనాలు, 22 ప్రయోగశాలలు, లైబ్రరీ, మూడు సెమినార్ హాల్స్, ఒకటి మల్టిపర్పస్ హాల్, కంప్యూటర్ ల్యాబ్, రెండు మెస్ బ్లాక్‌లు, డైరెక్టర్ బంగ్లా, 20 ఫ్యాకల్టీ క్వార్టర్స్, రెండు సబ్ స్టేషన్లు, హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లతో పాటు 1,260 మంది విద్యార్థులు ఉండేలా భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి.