Palamuru University in development: అభివృద్ధి పథంలో పాలమూరు యూనివర్సిటీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ అన్ని వసతులు సమకూర్చుకుంటూ దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రధానంగా విద్యార్థులకు వసతుల కల్పనలో కొత్త పుంతలు తొక్కుతోంది. పీయూలో విద్యార్థులు ఆడుకునేందుకు ప్రారంభం నుంచి శాశ్వత గ్రౌండ్ లేదు. దీంతో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఎగ్జిక్యూటీవ్ కమిటీ సమావేశంలో సింథటిక్ ట్రాక్‌తో కూడిన గ్రౌండ్ నిర్మాణం కోసం చర్చించగా.. తాజాగా ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. 2.2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న గ్రౌండ్‌తో పీయూ పరిధిలోని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు క్రీడల పరంగా మరింత ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. శనివారం ఉదయం పీయూ అడ్మినిస్ట్రేషన్ భవనంపై సోలార్ ప్యానెల్స్ బిగింపు పనులు ప్రారంభమయ్యాయి. అడ్మిన్ భవనంలో విద్యుత్ సదుపాయం సోలార్ ప్యానెల్స్ ద్వారానే పొందనున్నారు. అలాగే రూ.10కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసెర్చ్ ఫెసిలిటీ భవనం పనులు ప్రారంభమయ్యాయి. పీయూలో నీటి పునర్వినియోగం కోసం సీవేజ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయనుండగా.. ఇది టెండర్ దశలో ఉంది.
న్యాక్ సందర్శన నేపథ్యంలో..
2019లో మొదటిసారి న్యాక్ (నేషనల్ అక్రిడేషన్ అసిస్‌మెంట్ కౌన్సిల్)కు వెళ్లారు. అప్పుడు మొదటి ప్రయత్నంలోనే పీయూకు బీ గ్రేడింగ్ వచ్చింది. దీంతో రూసా నుంచి రూ.5 కోట్లకు పైగా నిధులు అందాయి. ప్రతి ఐదేళ్లకోసారి న్యాక్ గుర్తింపు కోసం వెళ్లాలి. ఈ నవంబర్‌లో కూడా న్యాక్ బృందం పీయూను తనిఖీ చేయనుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. తనిఖీల నేపథ్యంలో పూర్తిస్థాయిలో వసతుల కల్పనపై దృష్టిపెట్టారు. ఈసారి మరింత మెరుగైన గ్రేడింగ్ సాధించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. గ్రేడింగ్ పెరిగితే నిధులు సైతం సమకూరే అవకాశం ఉంది. వసతుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వండటంతో వాటి కల్పనపై పీయూ అధికారులు దృష్టికేంద్రీకరించారు.
రూ.9.50 కోట్లతో..
పీయూలో జాతీయ స్థాయిలో క్రీడల నిర్వహణకు అ వసరమయ్యే సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి అనుమతులు రావడంతో అధికారులు పనులు ప్రారంభించారు. వీసీగా లక్ష్మీకాంత్ రాథోడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకం ఖేలో ఇండియాలో భాగంగా సింథటిక్ ట్రాక్ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించారు. దీంతో అధికారులు ఇప్పటికే గ్రౌండ్‌ను పరిశీలించగా.. అనుమతులు రావడానికి ఆలస్యమవుతున్నట్లు తెలుస్తుంది. అయి తే యూనివర్సిటీ, ప్రభుత్వ నిధులతో పూర్తిస్థాయి లో నిర్మించనున్నారు. గ్రౌండ్‌లో లెవలింగ్ పూర్తవగా.. సాంకేతిక పనులు చేపట్టాల్సి ఉంది. ఈ నిర్మాణంతో పీయూ పరిధిలో జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది. పీయూ పరిధిలో పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ట్రాక్ నిర్మిస్తే వీరు ఇక్కడే శిక్షణ పొందవచ్చు. ట్రాక్ ద్వారా యూనివర్సిటీకి ఆదాయం సైతం సమకూరే అవకాశం ఉంది.
వసతుల కల్పనతో..
పీయూలో వసతుల కల్పనపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. ఇప్పటికే బాస్కెట్‌బాల్, షటిల్ కోట్‌లను రూ.20 లక్షలతో నిర్మించారు. దీంతోపాటు విద్యార్థులను దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి కొరత తీర్చేందుకు పెద్ద ట్యాంక్ రూ.3.2 కోట్లతో నిర్మిస్తుండగా దాదాపు 70 శాతం పూర్తయ్యాయి. పీయూలో విద్యార్థినుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రూ.10 కోట్లతో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. అలాగే విద్యార్థుల సౌకర్యం కోసం పీయూలో కొత్త క్యాంటీన్‌ను రూ.70 లక్షలతో నిర్మించనున్నారు. పీయూలో సైన్స్ డిపార్ట్‌మెంట్‌లో రీసెర్చ్‌ని మెరుగుపరిచేందుకు ఫెసిలిటీ భవనం నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే దాదాపు రూ.10 కోట్లతో నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. పీయూ అనుబంధ పీజీ సెంటర్లు గద్వాల, కొల్లాపూర్, వనపర్తిలో సైతం నూతన తరగతి గదులు, హాస్టళ్ల నిర్మాణాలు పూర్తికాగా.. కొన్నిచోట్ల జరుగుతున్నాయి.