Delay in issuance of certificates 2024:విద్యార్థుల ప్రవేశాలకు ఆదాయ,కుల ధ్రువపత్రాల జారీలో ఆలస్యం .. ప్రవేశాలకు ఆటంకం!
ఏలూరు: ప్రస్తుతం వివిధ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు జరుగుతున్నాయి. వీటికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అలాగే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే తరచూ సర్వర్లు మొరాయిస్తుండటంతో సమయానికి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందడం లేదు.
ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఈ నెల 7, డిగ్రీ ప్రవేశాలకు 10వరకు మాత్రమే గడువు ఉంది. సర్వర్ల మొరాయింపుతో సకాలంలో సర్టిఫికెట్లు అందక విద్యార్థులు హైరానా పడుతున్నారు. సమయానికి ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోగలమా, లేదా అనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఆయా ధ్రువపత్రాలు అప్‌లోడ్ చేస్తే గానీ విద్యార్థులకు రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటివి అందే అవకాశం లేదు.
Also Read: New Certificate Course: హెచ్‌సీయూలో మరో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం
సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు
విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు కుల, నివాస, ఆదాయ ధ్రువపత్రాలు తప్పనిసరి. దీంతో వాటికోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇటీవల సచివాలయ సిబ్బందితో పింఛన్లను పంపిణీ చేయించడంతో ఈ నెల ఒకటి, రెండు తేదీల్లో సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో లేరు. మరికొన్నిచోట్ల సచివాలయాలను వేరొక చోటకి మార్చారు. కొత్తగా వీటిని ఎక్కడ పెట్టారో తెలియక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు ధ్రువపత్రాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు తప్పనిసరిగా నోటరీ చేయించాలంటున్నారు. పాత సర్టిఫికెట్లను రెన్యువల్ చేయడానికి మళ్లీ నోటరీ ఎందుకు అని ప్రశ్నిస్తే నోటరీ చేయిస్తేనే దరఖాస్తులు ముందుకు కదులుతాయని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు నోటరీ చేయించాల్సి వస్తోంది.
నోటరీకి సుమారు రూ.200 వసూలు చేస్తుండడం పేద విద్యార్థులకు భారంగా పరిణవిుంచింది. దీంతో పాటు పాత ధ్రువపత్రాలు, రేషన్ కార్డులు, కుటుంబంలోని అందరు సభ్యుల ఆధార్ కార్డుల జిరాక్సులకు మరికొంత వెచ్చించాల్సి రావడం ఆర్థికంగా ఇబ్బందవుతోంది. ఇవన్నీ సచివాలయ సిబ్బందికి సమర్పించడానికి విద్యార్థులు ఒకటికి రెండుసార్లు సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీలో ఆలస్యం
ఎలాగోలా సచివాలయ సిబ్బంది కోరిన పత్రాలన్నీ సమర్పించి వారి నుంచి పత్రాలను తీసుకువెళ్లి తహసీల్దారు కార్యాలయంలో సమర్పిస్తే అక్కడ ఆర్‌ఐ, తహసీల్దారు సంతకాలకు ఆలస్యమవుతోంది. వారు ఇతర పనులతో బిజీగా ఉండడంతో రాత్రికి గానీ కార్యాలయాలకు చేరుకోవడం లేదు. ఆ తర్వాత ఇతర పనులపై దృష్టి సారించి విద్యార్థుల ధ్రువపత్రాలపై చివరలో సంతకాలు చేస్తున్నారు. ఆ తర్వాత ఆన్‌లైన్ చేయడానికి సర్వర్ల మొరాయింపుతో మరింత ఆలస్యమవుతుంది. దీంతో విద్యార్థులకు ఇబ్బంది తప్పడం లేదు.
వలంటీర్లతో ఇంటి వద్దే అందించిన గత ప్రభుత్వం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వలంటీర్ల ద్వారా విద్యార్థుల కోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించింది. ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వలంటీర్లు ఇంటింటికీ తిరిగి ఎవరికి ఏ సర్టిఫికెట్లు కావాలో అడిగి తెలుసుకుని వారే ఇంటి వద్దే ఆన్‌లైన్ చేశారు. కావాల్సిన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి సర్టిఫికెట్లు వచ్చేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
పైగా ఈ డ్రైవ్‌ల్లో సర్టిఫికెట్లకు దరఖాస్తులు చేసుకున్నవారికి ఎటువంటి రుసుం తీసుకోకుండా వాటిని అందజేసింది. ప్రస్తుతం వలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం దూరం పెట్టడంతో ధ్రువపత్రాలు పొందడం విద్యార్థులకు కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రవేశాల గడువు ముంచుకొస్తుండటంతో తమకు సకాలంలో సర్టిఫికెట్లు అందేలా చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
Tags
- Admissions 2024
- Admissions in Degree College
- Education News
- Andhra Pradesh News
- Degree Course
- Income certificate
- Latest News
- Eluru admissions process
- Online application issues
- Income verification documents
- Caste verification upload
- Server problems
- Fee reimbursement challenges
- Student admissions
- SakshiEducationUpdates