Skip to main content

New Medical College: మెడి‘కల’ తీరింది!

సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటు కావాలన్న జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరింది.
New Medical College,District Center,kama reddy,Inauguration
మెడి‘కల’ తీరింది!

సెప్టెంబ‌ర్ 15న‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వర్చువల్‌గా వైద్య కళాశాలను ప్రారంభించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో నిర్మించిన మాతా, శిశు సంరక్షణ ఆస్పత్రి భవనంలో వైద్య కళాశాల నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. సొంత భవనం నిర్మాణానికి నిధులు మంజూరై టెండర్ల దశలో ఉన్నాయి. కాగా జిల్లా కేంద్రంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కావడంతో జిల్లాకు చెందిన విద్యార్థులతో పాటు చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాలకు చెందిన దాదాపు పది మంది విద్యార్థులు కాలేజీలో జాయిన్‌ అయ్యారు.

చదవండి: Gold Medal in Medical Exams: వైద్య ప‌రీక్ష‌ల్లో బంగారు ప‌త‌కం సాధించిన యువ‌తి

నీట్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయించారు. ఫస్టియర్‌లో వంద సీట్లు ఉండగా 85 సీట్లు రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు, 15 సీట్లు ఆల్‌ ఇండియా కోటాలో ఇతర రాష్ట్రాలకూ కేటాయిస్తారు. మొదటి విడతలో 85 సీట్లకు గాను 80 మంది ఇప్పటికే ప్రవేశం పొందారు. ఆల్‌ ఇండియా కోటాలో 15 సీట్లకు పది మంది జాయిన్‌ అయ్యారు. మాప్‌ అప్‌ రౌండ్‌లో మిగతా పది సీట్లు భర్తీ అవుతాయని భావిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్థులకు సీట్లు లభించాయి. దీంతో వైద్య విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బంది తప్పిందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చుట్టు పక్కల జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులు జాయిన్‌ అయ్యారు.

విద్యార్థులు, తల్లిదండ్రులతో ఇంటరాక్షన్‌

మెడికల్‌ కాలేజీ ప్రారంభమైన తర్వాత సెప్టెంబ‌ర్ 15న‌ ఉదయం కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఇంటరాక్ట్‌ అయ్యారు. కాలేజీలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని కాలేజీకి వన్నె తేవాలని ప్రొఫెసర్లు సూచించారు.

చదవండి: 5 New Medical Colleges in AP: ఏపీని హెల్తీ అండ్‌ హ్యపీ స్టేట్‌గా చూస్తున్నాం - మెడికల్‌ విద్యార్థులు

సెప్టెంబ‌ర్ 21 నుంచి తరగతులు..

కాలేజీ ప్రారంభించిన నేపథ్యంలో సెప్టెంబ‌ర్ 21 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ప్రొఫెసర్లు విద్యార్థులతో ఇంటరాక్ట్‌ అయ్యారు. కాలేజీలో అనాటమీ, బయోకెమిస్ట్రీ, ప్రివెంటివ్‌ మెడిసిన్‌పై ప్రథమ సంవత్సరం పాఠ్యాంశాలుగా బోధించనున్నారు. తెల్లకోటు ధరించిన విద్యార్థులంతా కాలేజీలో అడుగుపెట్టారు. సీఎం ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. అంతకుముందు కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్‌రావ్‌ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.

Published date : 16 Sep 2023 02:51PM

Photo Stories