Skip to main content

BVSC Admissions: వెటర్నరీ బీవీఎస్సీ కోర్సుల ప్రవేశాలలో మహిళలే టాప్‌

Women top the admissions to Veterinary BVSC courses

మహిళలదే హవా

పశువైద్య కళాశాలలో బీవీఎస్సీ, ఎమ్‌వీఎస్సీ పీజీ, యూజీ కోర్సులలో గత కొన్నేళ్ల నుంచి అధిక సంఖ్యలో మహిళలు అడ్మిషన్లు పొందుతున్నారు. సుమారు 65 నుంచి 70 శాతం మేర ప్రతి ఏడాదీ విద్యార్థినులు పశువైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఎస్వీ వెటర్నరీ కళాశాలలో పీజీ, యూజీ కోర్సులు పూర్తి చేసిన మహిళలు విదేశాల్లో ఉద్యోగాలు పొందారు. కళాశాలలో నాణ్యమైన బోధన, ఫ్యాకల్టీ, హాస్టల్‌ వసతి వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

–డాక్టర్‌ పీ.జానకీరామయ్య, అసోసియేట్‌ డీన్‌, ఎస్వీ వెటర్నరీ కళాశాల, తిరుపతి

పశువైద్యులకు డిమాండ్‌

మాది శ్రీకాకుళం. నాన్న రైల్వే ఉద్యోగి. అమ్మ గృహిణి. పెట్స్‌ పెంచుకోవడం ఇంట్లో అందరికీ హాబీ. జంతువులు అనారోగ్యానికి గురైతే వ్యాధిని గుర్తించడం వైద్యులకే సాధ్యం. ఆధునిక సమాజంలో పెంపుడు జంతువులు లేని గృహం లేదంటే అతిశయోక్తి కాదేమో. దీంతో పుశువైద్యులకు డిమాండ్‌ పెరిగింది. వెటర్నరీలో పీజీ, యూజీ, పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు 100శాతం ఉపాధి, ఉద్యోగాలు సాధించారు. అందుకే నేను ఈ రంగాన్ని ఎంపిక చేసుకున్నా.

–ఎం.భావన, బీవీఎస్సీ విద్యార్థిని, తిరుపతి

అదే నా ఆకాంక్ష

మాది బాపట్ల జిల్లా అద్దంకి గ్రామం. నాన్న మెకానిక్‌. వైద్య విద్య చదవాలనే ఆకాంక్ష చిన్నప్పటి నుంచి బలంగా ఉండేది. తిరుపతి వెటర్నరీ కళాశాలలో సీటు సాధించి అడ్మిషన్‌ పొందాను. శతకోటి జీవరాశులలో మానవులతో సమానమైన మూగజీవాలకు వైద్యం చేసి వాటికి ప్రాణాలు పోసే విద్యను అభ్యసించడం గర్వంగా ఉంది. యూజీలోనూ అత్యధిక సంఖ్యలో మహిళలు పశువైద్య విద్యను అభ్యసిస్తున్నారు.

–టీ.అమూల్య, వెటర్నరీ యూజీ విద్యార్థిని, తిరుపతి

మూగజీవాలంటే ప్రాణం

మాది కృష్ణా జిల్లా గుడివాడ. నాన్న వృత్తి రీత్యా ఆటోమొబైల్‌ ఎలక్ట్రీషి యన్‌. నాకు వైద్య వృత్తి అంటే చాలా ఇష్టం. నాకు పెట్స్‌ అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి. గతంలో వెటర్నరీ డాక్టర్లుగా కేవలం పురుషులు అధిక సంఖ్యలో ఉండేవారు. ప్రస్తుతం పురుషులకంటే మహిళలే ఎక్కువగా రాణిస్తున్నారు. నీట్‌ పరీక్షలో ర్యాంకు సాధించి ఎస్వీ వెటర్నరీ కళాశాలలో సీటు సాధించాను. భవిష్యత్‌లో పీజీ పూర్తి చేసి పరిశోధన రంగంలో అడుగుపెట్టాలని ఉంది.

–జే.కావ్యశ్రీ, బీవీఎస్సీ విద్యార్థిని, తిరుపతి

Published date : 11 Nov 2024 10:07AM

Photo Stories