Jagananna Vidyadevena Scheme: విద్యా దీవెన.. మారిన నిబంధన.. ఈ ఖాతా తప్పనిసరి
అందుకు గాను ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ విడతలో జిల్లాలో డిగ్రీ, పీజీ, డిప్లమా, ఇంజినీరింగ్, ఐటీఐ వంటి చదువులు చదువుతున్న 51,337 మందికి ప్రయోజనం చేకూరనుంది. అయితే మారిన నిబంధనలను అందరూ తెలుసుకోవాలని, వాటిపై అప్రమత్తం కావాలని అధికారులు సూచిస్తున్నారు.
జాయింట్ ఖాతా తప్పనిసరి
ఈ ఏడాది నుంచి విద్యాదీవెన, వసతి దీవెన పథకం లబ్ధిదారులైన విద్యార్థులకు తప్పనిసరిగా తల్లితో కూడిన జాయింట్ అకౌంట్ ఉండాలని కొత్త నిబంధన తీసుకువచ్చారు. దీనిపై ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీని ప్రకారం ఎస్సీ విద్యార్థులు మినహా ఇతర అన్ని కేటగిరీల విద్యార్థులు జాయింట్ అకౌంట్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలి. తల్లి లేకుంటే తండ్రితో జాయింట్ అకౌంట్ కలిగి ఉండాలి. ఈ ఏడాది చదువుతున్న విద్యార్థులంతా ఈ ఖాతాలను బ్యాంకులో ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది.
చదవండి: Tenth Class & Inter: ‘ఓపెన్’ స్కూల్ ప్రవేశాలకు చివరి తేదీ ఇదే
ఇప్పటికే చదువులు పూర్తి చేసుకుని నాల్గో విడత విద్యా దీవెన కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు ఈ జాయింట్ అకౌంట్‌ను ప్రారంభించాల్సిన అవసరం లేదు.
గతంలో ఉన్న తల్లుల బ్యాంకు ఖాతాలకు ఈ విద్యాదీవెన నగదు జమ చేయనున్నారు. ఈ ఏడాది ఇంకా చదువుతున్న వారు మాత్రం తప్పని సరిగా జాయింట్ అకౌంట్‌ను తీసుకోవాలి. విద్యార్థులు జాయింట్ అకౌంట్ పూర్తయిన తర్వాత వారి పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయంలో తమ ఖాతా వివరాలను అప్‌లోడ్ చేయించుకోవాలి.
కావాల్సిన పత్రాలివే..
జాయింట్ అకౌంట్ ప్రారంభించడానికి తల్లి, విద్యార్థి పాస్‌ఫొటోలు మూడు, ఇద్దరి ఆధార్ కార్డులు, విద్యార్థి ఐడీ కార్డు, ఆధార్ కార్డులో విద్యార్థి పూర్తి డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే పదో తరగతి మార్కుల మెమో ఉండాలి. అకౌంట్ ఓపెనింగ్‌కు నగదు అవ సరం లేదు. అకౌంట్ పూర్తిగా జీరో అకౌంట్ కావున సొమ్ము జమ చేయాల్సిన అవసరం లేదు. అకౌంట్‌లో ప్రైమరీ వ్యక్తిగా విద్యార్థి ఉండాలి. నవంబర్ 24 లోపు సచివాలయంలో అప్‌లోడ్ చేయాలి. తర్వాత చేసిన వారికి నగదు విడుదల కాదు. పోస్టల్ ఇతర సంస్థల్లో అకౌంట్లు చెల్లుబాటు కావు.
విద్యార్థులు గుర్తించాలి
విద్యా దీవెన పొందుతున్న వారిలో ఎస్సీ విద్యార్థులు మినహా అన్ని కేటగిరీల వారు జాయింట్ అకౌంట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికే బ్యాంకు అధికారులకు కలెక్టర్, ఎల్‌ఏడీఎంలు జాయింట్ అకౌంట్ ఓపెనింగ్‌లపై మార్గదర్శకాలు అందజేశారు. కళాశాల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు ఈ విషయంలో విద్యార్థులకు తగు సూచనలు చేసి, జాయింట్ ఖాతాలను ఏర్పాటు చేసుకునేలా సహకరించాలి. 2022–23వ విద్యా సంవత్సరంలో చివరి ఏడాది చదివిన వారు ఉమ్మడి ఖాతా తెరవాల్సిన అవసరం లేదు.
– వై.విశ్వమోహన రెడ్డి, డీడీ సాంఘిక సంక్షేమ శాఖ