Abdul Nazeer: వేదాలు విజ్ఞాన భాండాగారాలు
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 7వ స్నాతకోత్సవం ఏప్రిల్ 28న మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. వర్సిటీ చాన్సలర్ హోదాలో గవర్నర్ ఈ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. హైదరాబాద్‌కు చెందిన వేద పండితులు వి.సుబ్రహ్మణ్య శాస్త్రి సలక్షణ ఘనాపాఠి, చెన్నైకి చెందిన ఆర్. మణి ద్రావిడ శాస్త్రికి మహా మహోపాధ్యాయ పురస్కారాలను గవర్నర్ ప్రదానం చేశారు. అన్నవరానికి చెందిన కె. రామ సోమయాజి శాస్త్రి, మైసూరుకు చెందిన సి.వంశీకృష్ణ ఘనాపాఠికి వాచస్పతి పురస్కారాలను అందజేశారు.
చదవండి: యూజీసీ నిబంధనల నుంచి మినహాయించాలి: సీఎం జగన్
సర్టిఫికెట్ కోర్సుల నుంచి పీహెచ్‌డీ వరకు వేద విద్యనభ్యసించిన 539 మందికి డిగ్రీ పట్టాలను అందజేశారు. గవర్నర్ మాట్లాడుతూ.. వేలాది సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు గణిత, వైజ్ఞానిక, ఆర్థిక, సాంకేతిక, జ్యోతిష్య శాస్త్రాలను వేదాల్లోని వైదిక అంశాలతో మేళవించి ప్రపంచానికి తెలియజేశారన్నారు. భారతీయ సంప్రదాయం, ఆధునిక శాస్త్ర సాంకేతికత మధ్య సమన్వయం పెంపొందించుకోగలిగితే దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వీసీ రాణి సదాశివమూర్తి, రిజిస్ట్రార్ రాధే శ్యాం, ఈసీ సభ్యులు హరే కృష్ణ శతపతి, ఫణి యాజులు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: ఢిల్లీ ఎస్వీ కళాశాల గవర్నింగ్ బాడీ చైర్మన్‌గా వైవీ వైవీ సుబ్బారెడ్డి ఎంపిక