‘Bhavita’ విద్యార్థులకు భత్యం
ఇలాంటి విద్యార్థులను ప్రభుత్వం ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నెలనెలా రవాణా, ఎస్కార్ట్, స్టైఫండ్, రీడింగ్ అలవెన్సులు అందిస్తోంది. ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర శిక్షా తెలంగాణ, పీఎంశ్రీ ఆధ్వర్యంలో విడుదల చేస్తాయి.
విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుండడంతో ఆ కుటుంబాల్లో కాస్త ఆర్థిక వెసులుబాటు కలుగుతోంది. అయితే జిల్లాలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి 1,090 మంది విద్యార్థులకు రూ.34.76 లక్షలు నిధులు రావాల్సి ఉండగా.. వాటిని సంబంధిత లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తోంది.
చదవండి: Good News for Employees: ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి పెంపు
జిల్లాలో 28 భవిత కేంద్రాలు..
మానసిక, శారీరక వైకల్యం కలిగిన బాల బాలికలకు వివిధ పద్ధతుల్లో విద్య అందించడానికి ప్రభుత్వం విలీన విద్యా వనరుల కేంద్రాలు (ఐఈఆర్‌సీ) ఏర్పాటు చేసింది. వీటినే భవిత కేంద్రాలుగా పిలుస్తుంటారు. జిల్లాలో 28 భవిత కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 7 మండలాల్లో సొంత భవనాల్లో ఈ కేంద్రాలు ఉండగా మిగతా 21 మండలాల్లో పాఠశాలల ఆవరణలోనే ఒక గదిలో (ఐఈఆర్‌సీ) కొనసాగిస్తున్నారు.
వీరికి ఐఈఆర్‌పీ (ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్)లు సమ్మేళన విద్యా విధానంతో ఈ చిన్నారులకు శిక్షణనిచ్చి సాధారణ పిల్లల్లా తీర్చిదిద్దుతుంటారు. భవిత కేంద్రాలకు రాలేని మానసిక వైకల్యం ఉన్న వారికి ఇంటి వద్దకే వెళ్లి నైపుణ్యాలు నేర్పిస్తుంటారు. జిల్లాలో 46 మందికి గాను 41 మంది వరకు ఐఈఆర్‌పీలు ఉన్నారు. ప్రతి శనివారం ఒక్కో ఐఈఆర్‌పీ తమ పరిధిలోని ఇలాంటి పిల్లల ఇళ్లకు వెళ్లి బోధిస్తుంటారు.
చదవండి: TSWREIS: గురుకుల సొసైటీల ఇష్టారాజ్యం!.. ఇంటర్ బోర్డు నిబంధనల అతిక్రమణ
లబ్ధిదారుల ఖాతాలో జమవుతాయి
పాఠశాలలు, భవిత కేంద్రాలు, ఇంటి వద్ద శిక్షణ పొందుతున్న మానసిక, శారీరక వైకల్యం కలిగిన పిల్లలకు ప్రభుత్వం రవాణా, ఎస్కార్ట్, స్టైపండ్, రీడింగ్ అలవెన్స్‌లను ప్రభుత్వం ఏటా అందజేస్తోంది. ప్రస్తుతం జిల్లాకు సంబంధించిన లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వమే నేరుగా జమచేయడం జరుగుతుంది.
– యర్రంశెట్టి రాంబాబు, జిల్లా విలీన విద్య సమన్వయకర్త, సూర్యాపేట
వివిధ కేటగిరీల కింద..
భవిత కేంద్రాలకు వచ్చే దివ్యాంగ పిల్లలకు నెలకు రూ.500 చొప్పున పది నెలలు రవాణా భత్యం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.5 వేల చొప్పున ఏటా చెల్లిస్తాయి.1–12 తరగతి వరకు లబ్ధి పొందవచ్చు.
అంధత్వం, అంగవైకల్యం కలిగి పాఠశాలలకు వచ్చి చదివే వారికి నెలకు రూ.550 చొప్పున, పది నెలలకు రూ.5,500లు అందజేస్తారు. ఆ విద్యార్థులను కుటుంబ సభ్యులు ఎవరైనా తీసుకొని వస్తుండటంతో ఎస్కార్టు భత్యం కింద వీటిని అందిస్తారు. ప్రభుత్వం పొందుపరచిన దివ్యాంగుల జూబితాలో ఉన్న వర్గాల వారు 1 నుండి 12వ తరగతి వరకు ఈ భత్యం పొందవచ్చు.
పాఠశాలలు, భవిత కేంద్రాలు, ఇంటి వద్ద విద్య పొందే బాలికలకు స్టైఫండ్ కింద నెలకు రూ.200 చొప్పున అందిస్తుంటారు. వీరికి కూడా పది నెలలకు రూ.2 వేలు వస్తాయి. 1–12వ తరగతి వరకు పొందే వీలుంది.
అంధులు, తక్కువ దృష్టి కలిగిన పిల్లలకు రీడింగ్ భత్యం పేరుతో నెలకు రూ.60 చొప్పున పది నెలలకు రూ.600 చెల్లిస్తారు. వీరు కూడా 1–12 తరగతి వరకు పొందవచ్చు.