Good News for Employees: ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి పెంపు
ఈఎస్‌ఐ గరిష్ట వేతన పరిమితి 2016కు ముందు రూ.15 వేలు ఉండగా.. కేంద్ర ప్రభుత్వం దీన్ని రూ.21 వేలకు పెంచింది. ఈ తరహాలోనే ఈపీఎఫ్‌ఓ కూడా వేతన పరిమితిని రూ.21 వేలకు పెంచే యోచనలో ఉందని ప్రాథమిక సమాచారం.
ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని రూ.21 వేలకు పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్మిక సంఘాలు, అనుబంధ సంస్థలు ఇందుకోసం గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాయి.
ఈ క్రమంలో వేతన పరిమితి పెంపుతో జరిగే పరిణామాలపై కేంద్ర కార్మిక శాఖ ప్రాథమిక కసరత్తుకు ఉపక్రమించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈపీఎఫ్ చందాదారుడి గరిష్ట వేతన పరిమితి రూ.15 వేలుగా ఉంది. 2014కు ముందు ఇది రూ.6,500 కాగా.. అప్పటి ప్రభుత్వం ఈ పరిమితిని రూ.15 వేల వద్ద ఫిక్స్ చేసింది.
ఈపీఎఫ్‌ఓ ఫార్ములా ప్రకారం ఒక ఉద్యోగికి భవిష్యనిధి చందా కింద 12 శాతం యాజమాన్యం చెల్లిస్తుండగా, మరో 12 శాతం ఉద్యోగి వేతనం నుంచి చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని (పెన్షన్ మినహా) ఉద్యోగి పదవీ విరమణ సమయంలో వడ్డీతో సహా ఈపీఎఫ్‌ఓ తిరిగి ఇచ్చేస్తుంది.
ఉద్యోగికి లాభం..యాజమాన్యాలపై భారం
చందాదారుడి గరిష్ట వేతన పరిమితి పెంపుతో ఉద్యోగికి లాభం కలగనుండగా.. అధిక చెల్లింపుల భారం యాజమాన్యాలపై పడనుంది. ప్రస్తుత ఫార్ములా ప్రకారం ఉద్యోగి గరిష్ట వేతన పరిమితి రూ.15 వేలు కాగా అందులో 12 శాతాన్ని (రూ.1800) యాజమాన్యం సదరు ఉద్యోగి ఈపీఎఫ్‌ఓ ఖాతాకు బదిలీ చేస్తుంది.
ఇందులో నుంచి 8.33 శాతం(రూ.1250) పెన్షన్ ఖాతాకు బదిలీ అవుతుండగా... మిగతా 3.67 శాతం (రూ.550) మొత్తం భవిష్యనిధి ఖాతాలో జమ అవుతుంది. దీనికి సమానంగా ఉద్యోగి వేతనం నుంచి 12 శాతం (రూ.1800) భవిష్యనిధి ఖాతాలో జమ చేస్తారు.
తాజాగా ఉద్యోగి వేతన పరిమితి రూ.21 వేలకు పెంచితే ఇందులోని 12 శాతం (రూ.2520) యాజమాన్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కన ఉద్యోగి పెన్షన్ ఖాతాలో రూ.1790, భవిష్య నిధి ఖాతాలో రూ.730 జమ అవుతాయి. దీనికి సమానంగా ఉద్యోగి వేతనం నుంచి రూ.2520 భవిష్యనిధి ఖాతాలో జమ చేస్తారు.
ప్రస్తుతం ఈఎస్‌ఐ చట్టం కింద చందాదారుడి గరిష్ట వేతన పరిమితి రూ.21 వేలుగా ఉంది. రూ.21 వేలు దాటిన వారు ఈఎస్‌ఐ పరిధిలోకి రారు.
ఈఎస్‌ఐ గరిష్ట వేతన పరిమితి 2016కు ముందు రూ.15 వేలు ఉండగా.. కేంద్ర ప్రభుత్వం దీన్ని రూ.21 వేలకు పెంచింది.
ఈ తరహాలోనే ఈపీఎఫ్‌ఓ కూడా వేతన పరిమితిని రూ.21 వేలకు పెంచే యోచనలో ఉందని ప్రాథమిక సమాచారం. కాగా ఇందుకు సంబంధించి ఈపీఎఫ్‌ఓ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.