Exams 2024: పదో తరగతి, ఇంటర్మీడియట్, ఓపెన్ స్కూల్, ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు
తుమ్మపాల: త్వరలో జరగనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్, ఓపెన్ స్కూల్, ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, విద్యా, పోలీస్, వైద్య శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 18 నుంచి 27 వరకు టెన్త్, మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులన్నీ పూర్తిగా ఉండాలన్నారు. వైద్య శిబిరాలు, ఓఆర్‌ఎస్, గ్లూకోజ్ అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రశ్నాపత్రాలు, ఆన్సర్ షీట్లను కట్టుదిట్టమైన భద్రతలో ఉంచాలన్నారు.
టెన్త్ పరీక్షలకు 108 కేంద్రాలు
డీఈవో వెంకట లక్ష్మమ్మ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 108 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 397 పాఠశాలలకు చెందిన 21,259 మంది రెగ్యులర్ విద్యార్థులు, 2,324 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు.
Also Read : Tenth Class Chemistry Bit Bank
38 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు
డీవీఈవో బి.సుజాత మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలకు జిల్లాలో 38 పరీక్షా కేంద్రాలు, 14 పోలీస్ స్టేషన్లలో ప్రశ్నాపత్రాల స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 13,323 మంది విద్యార్థులు హాజరు కానుండగా వారిలో 1,074 మంది జనరల్, 2,619 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారన్నారు. సెకండియర్ పరీక్షలకు 15,298 మంది హాజరవుతుండగా.. వారిలో 1,278 మంది జనరల్, ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. అలాగే ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్‌ఎస్‌సీ పరీక్షలు మార్చి 18 నుంచి 27 వరకు ఐదు కేంద్రాల్లో జరుగుతాయని, 788 మంది హాజరవుతారని తెలిపారు. ఓపెన్ ఇంటర్ పరీక్షలు 11 కేంద్రాల్లో జరుగుతాయని, 2,205 మంది హాజరవుతారన్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు ఐదు కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని, 991 మంది హాజరవుతున్నట్లు చెప్పారు. డీఆర్‌వో బి.దయానిధి, అనకాపల్లి డీఎస్పీ సుబ్బరాజు, ఉపవిద్యాశాఖ అధికారి రవిబాబు, డీఈసీ సభ్యులు శ్రీనివాసరావు, పి.శిరీషరాణి, మూర్తి, మోహన్‌రావు, పోస్టల్ సూపరింటెండెంట్ పండా, ఆర్టీసీ మేనేజర్ నారాయణ, ఎస్‌టీవో రాజేష్ పాల్గొన్నారు.