గిరిజన విద్యార్థులు సత్తా చాటేలా ప్రత్యేక కార్యాచరణ
రాష్ట్రంలో మొత్తం 199 గిరిజన విద్యాలయాల్లో 54,025 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వాటిలో 128 గురుకులాల్లో టెన్త్ చదువుతున్న 5,252 మంది, ఇంటరీ్మడియెట్ ప్రథమ సంవత్సరం 4,450 మంది, ఇంటర్ ద్వితీయ సంవత్సరం 4,884 మంది విద్యార్థులు 2023లో పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. పబ్లిక్ పరీక్షలకు వారిని సన్నద్ధం చేసి మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టినట్టు ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జాయింట్ సెక్రటరీ పి.హేమలతారాణి వివరించారు.
చదవండి: Education: విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించగలం
డిజిటల్, వర్చువల్ క్లాస్ రూముల్లో బోధన
గిరిజన గురుకులాల్లో ఆధునిక బోధనా పద్ధతుల ద్వారా విద్యను బోధించేందుకు డిజిటల్, వర్చువల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు సాధారణ స్టడీ తర్వాత ప్రతిరోజు వేకువజామున 4.30 నుంచి 6 గంటల వరకు, రాత్రి 9.30 నుంచి 10.30 గంటల వరకు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో అదనపు స్టడీ అవర్స్‌ను నిర్వహిస్తున్నారు. అదనపు స్టడీ అవర్స్‌లో విద్యార్థులకు అదనపు పౌష్టిక ఆహారం అందిస్తున్నారు. వెనుకబడిన అంశాల్లో ప్రావీణ్యత పెంచేలా విద్యార్థులను 5 నుంచి 10 మంది చొప్పున ఒక గ్రూప్‌గా చేసి ఉపాధ్యాయులకు దత్తత ఇవ్వడం ద్వారా ప్రతి విద్యార్థిపై శ్రద్ధ తీసుకుంటున్నారు.
చదవండి: Navodaya Exam: ఒక్కసారి ఎంటర్ అయితే చాలు... ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఫ్రీ
చాప్టర్ల వారీగా పరీక్షలు
పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల నమూనాలో ప్రతి గురుకులం నుంచి ప్రత్యేక ప్రశ్న పత్రాలను తయారు చేసి రోజుకు రెండు సబ్జెక్టుల నుంచి చాప్టర్ల వారీగా పరీక్షలు నిర్వహించనున్నారు. టెన్త్ విద్యార్థులకు జనవరి 20 నుంచి మార్చి 31వ తేదీ వరకు, ఇంటర్ విద్యార్థులకు జనవరి 28 నుంచి మార్చి 6 వరకు నమూనా పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. కార్పొరేట్‌కు దీటుగా గిరిజన విద్యాసంస్థల్లో ఫలితాలు ఉండాలని సీఎం జగన్, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఆదేశాల మేరకు పక్కా ప్రణాళికతో గిరిజన విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సమాయత్తం చేస్తున్నట్టు హేమలతారాణి వివరించారు.
చదవండి: Program for Leadership Development: నాయకత్వాభివృద్ధికి హార్వర్డ్ కిటుకులు!