Education: విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించగలం
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో జనవరి 9న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఉపకార వేతనాల ప్రదానోత్సవం నిర్వహించారు. గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించారు. కౌండిన్య ఐఏఎస్ అకాడమీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అజ్ఞానపు చీకట్లను పారదోలే సాధనమే విద్య అని అన్నారు.
చదవండి: SPMVV: ఘనంగా మహిళా వర్సిటీ స్నాతకోత్సవం
నిరుపేదలు విద్యావంతులుగా ఎదగడం ద్వారానే ధనిక, పేదల మధ్య అసమానతలను రూపుమాపగలమన్నారు. విద్యాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో ధనవంతులు, మనసున్న దాతలు భాగస్వాములై తమవంతు చేయూతను అందించాలన్నారు. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలు దేశాభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.
చదవండి: నూతన విద్యా విధానంతో నైపుణ్యాభివృద్ధి: గవర్నర్ విశ్వభూషణ్
ఉపకారవేతనాలను పొందిన విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా ఎదిగి, జీవితంలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నాక తిరిగి సమాజానికి తమవంతు మేలు చేయాలని సూచించారు. కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు గవర్నర్ తన వ్యక్తిగతంగా రూ.రెండు లక్షలు విరాళం ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కాంతిరాణా మాట్లాడుతూ కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 17ఏళ్లుగా ఉపకారవేతనాలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు.
చదవండి: యూనివర్సిటీ ల్లో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు సిలబస్‌ను రీడిజైన్ చేయండి: ఏపీ గవర్నర్
కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఈవీ నారాయణ మాట్లాడుతూ 2006లో ముగ్గురు విద్యార్థులకు రూ.10వేలతో ఉపకారవేతనాల పంపిణీని ప్రారంభించామని, ఇప్పటివరకు ఆరువేల మందికి రూ.1.50 కోట్లు అందించామని వివరించారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని 450 మంది విద్యార్థులకు రూ.18 లక్షలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఓఎస్డీ ఆర్పీ సిసోడియా, కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, వాణిజ్య పన్నులశాఖ విశ్రాంత అదనపు కమిషనర్ వై.సత్యనారాయణ, ట్రస్ట్ ప్రతినిధి వాకా రామ్‌గోపాల్‌గౌడ్, గౌడ జన సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.
చదవండి: సమాజ ప్రగతిలో యువత కీలకపాత్ర పోషించాలి: గవర్నర్ విశ్వభూషణ్