Skip to main content

సమాజ ప్రగతిలో యువత కీలకపాత్ర పోషించాలి: గవర్నర్ విశ్వభూషణ్

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: సమాజ ప్రగతిలో యువత కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. పట్టభద్రులు వినూత్న ఆలోచనలతో ముందడుగు వేస్తూ దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని సూచించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ 11, 12వ స్నాతకోత్సవం జనవరి 24 (శుక్రవారం)నఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్‌‌జ టెక్నాలజీస్ చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డికి నన్నయ వర్సిటీ తరఫున గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్ ప్రదానం చేశారు. 567 మంది విద్యార్థులకు పట్టాలు, ఎనిమిది మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ఆరుగురికి పీహెచ్‌డీలు అందజేసి వర్సిటీలో గవర్నర్ మొక్కలు నాటి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా, ఫిట్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాల ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం గుణాత్మకమైన విద్య కోసం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులతోపాటు ప్రాథమిక సూత్రాలు, బాధ్యతలను విద్యార్థులు గుర్తెరిగి సమాజ ప్రగతికి దోహదపడాలన్నారు. ఆర్జీయూకేటీ చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజమహేంద్రవరం ప్రాంతంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో అవిరళ కృషి చేశారన్నారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ తీసుకువచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. స్థానికంగా ఏయే రంగాలకు ప్రాధాన్యం ఇస్తే అభివృద్ధి సాధిస్తుందో అన్న అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుని అభివృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. నన్నయ వర్సిటీ ప్రగతి నివేదికను వైస్ చాన్సలర్ మొక్కా జగన్నాథరావు చాన్సలర్‌కు అందజేశారు.
Published date : 25 Jan 2020 02:43PM

Photo Stories