నూతన విద్యా విధానంతో నైపుణ్యాభివృద్ధి: గవర్నర్ విశ్వభూషణ్
Sakshi Education
సాక్షి, అమరావతి/ కొమ్మాది (విశాఖ): సంపూర్ణ విజ్ఞాన సముపార్జనతో భారత దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా పురోగమించేందుకు నూతన జాతీయ విద్యా విధానం దోహదపడుతుందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు.
34 ఏళ్ల తర్వాత వినూత్న అభ్యాస కేంద్రీకృత జాతీయ విద్యా విధానం సాధ్యమైందన్నారు. 21వ శతాబ్దపు సవాళ్లు, అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాల సాధనలో ఈ విద్యా సంస్కరణలు ఉపకరిస్తాయని తెలిపారు. భారత విశ్వవిద్యాలయాల సంఘం బుధవారం వర్చువల్ విధానంలో నిర్వహించిన సౌత్ జోన్ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ యువత నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు నూతన విద్యా విధానం ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. అనంతరం భారత విశ్వవిద్యాలయాల సంఘం రూపొందించిన ‘యూనివర్సిటీ న్యూస్’ ప్రత్యేక సంచికను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆవిష్కరించారు.
Published date : 25 Feb 2021 03:50PM