Skip to main content

జయ శారదా ని‘కేతనం’.. మహాత్మాగాంధీ అడుగుపెట్టిన స్థలం

గుంటూరు ఎడ్యుకేషన్‌: బ్రిటిష్‌ పాలకులను ఎదిరించి జైలు శిక్షనూ అనుభవించిన స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నవ లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయమ్మ దంపతుల చేతుల మీదుగా రూపుదిద్దుకున్న అక్షర వేదిక.. వందేళ్ల క్రితమే మహిళా సాధికారత, సీ్త్ర విద్య ప్రాధాన్యాన్ని చాటిచెప్పిన సమరగీతిక.. గుంటూరు శారదా నికేతన్‌. ఈ విద్యాలయం ఏర్పడి ఇప్పటికి 101 ఏళ్లు పూర్తవుతోంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 76 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ చారిత్రక సరస్వతీనిలయం గురించి ఓసారి మననం చేసుకుందాం.
Sharada Niketan is the landing place of Mahatma Gandhi
జయ శారదా ని‘కేతనం’.. మహాత్మాగాంధీ అడుగుపెట్టిన స్థలం

1922లో నెలకొల్పిన శారదా నికేతన్‌ అంచెలంచెలుగా ఎదిగి మహిళా విద్యకు చిరునామాగా నిలిచింది. స్వతహాగా రచయిత అయిన ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన మాలపల్లి నవల అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఆ నవలను బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించింది. దేశ వ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమం సాగుతున్న కాలంలో మహాత్మా గాంధీ గుంటూరు పట్టణానికి వచ్చినప్పుడు బ్రాడీపేట 2/14లో ఉన్న శారదా నికేతన్‌ను సందర్శించారు. ఐదు రోజులపాటు అక్కడే బస చేశారు.

చదవండి: Gita Press: గాంధీ శాంతి బహుమతి.. రూ.కోటి న‌గ‌దు బ‌హుమ‌తి నిరాకరించిన గీతా ప్రెస్

ఆ ప్రాంగణంలోని మర్రిచెట్టు కింద కూర్చుని, అక్కడే ఉన్న బావి వద్ద రోజూ స్నానం చేసేవారు. సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతుగా ప్రజలను చైతన్యపర్చేందుకు మర్రిచెట్టునే ఆయన వేదికగా చేసుకుని స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు. గాంధీ గుంటూరు పర్యటన ముగించుకుని వెళ్లే సమయంలో ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులు మహాత్మునితో కలిసి అడుగులు వేశారు. ఆనాడు మహాత్మునికి నీడను ఇచ్చిన మర్రిచెట్టు కాలగమనంలో భారీ వర్షాలకు వేళ్లతో సహా నెలకొరిగింది.

చదవండి: NCERT: ఇక‌పై గాంధీ, గాడ్సే పాఠాలుండ‌వు... పాఠ్య‌పుస్త‌కాల నుంచి తొల‌గించిన ఎన్‌సీఈఆర్‌టీ.. ఎందుకంటే!

గాంధీ గడిపిన ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటం, జాతీయ జెండాలు
గాంధీ గడిపిన ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటం, జాతీయ జెండాలు

 

ఆయన స్నానమాచరించిన బావి కూడా పూడుకుపోయింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను పురస్కరించుకుని ఆనాడు మర్రిచెట్టు, బావి ఉన్న ప్రదేశాలను ఒక సర్కిల్‌గా ఏర్పాటు చేసి మహాత్మాగాంధీ చిత్రపటాన్ని, జాతీయ జెండాలతో అధికారులు అలంకరించారు. ఘన చరిత్ర కలిగిన శారదా నికేతన్‌ శతాబ్ది ఉత్సవాలను గతేడాది ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శారదా నికేతన్‌ మహిళా విద్యాసంస్థలను విద్యాశాఖ పరిధిలోకి తెచ్చిన ప్రభుత్వం, సంస్థల అభివృద్ధికి కృషి చేస్తోంది.

శతాధిక కీర్తిపతాక

స్వాతంత్య్రోద్యమ కాలంలో నెలకొల్పిన సరస్వతీనిలయం మహాత్మాగాంధీ అడుగుపెట్టిన పవిత్రస్థలం 101 ఏళ్లు పూర్తిచేసుకున్న విద్యాలయం

Published date : 14 Aug 2023 05:16PM

Photo Stories