Sakshi Spell- B Exam Conducted- సాక్షి స్పెల్-బీ పరీక్షకు విశేష స్పందన
‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్ బీ పరీక్షకు విశేష స్పందన లభించింది. జనవరి 7న అనకాపల్లిలొని అక్కయ్యపాలెంలో గల జ్ఞాననికేతన్ పాఠశాలలో జరిగిన పరీక్షకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు నుంచి విద్యార్థులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులను నాలుగు కేటగిరీలుగా విభజించి స్పెల్ బీ పరీక్ష నిర్వహించారు.
ఆ పాఠశాలల నుంచి..
పాఠశాల, జిల్లా స్థాయిలో ఇప్పటికే జరిగిన పరీక్షలో ప్రతిభ చాటిన విదార్థులు రీజినల్ స్థాయి పరీక్షలో పాల్గొన్నారు. వీరిలో సత్తా చాటిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జరిగే పరీక్షకు హాజరుకానున్నారు. రవీంద్ర భారతి, శ్రీ చైతన్య, చలపతి, రవీస్ లిటిల్ ఛాంప్, గ్రీన్ సిటీ, శ్రీ విశ్వ, విశాఖ, నారాయణ దొర, వి.టి.స్కూల్, రామకృష్ణ తదితర పాఠశాలల నుంచి విద్యార్థుల పరీక్షకు హాజరయ్యారు.
పోటీతత్వాన్ని పెంపొందించేలా..
పోటీతత్వాన్ని పెంపొందించేలా నిర్వహిస్తున్న పరీక్ష కావటంతో విద్యార్థులు తల్లిదండ్రులు సైతం ఎంతో ఆసక్తి కనబరిచి, వారే స్వయంగా తమపిల్లలను పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సాక్షి మీడియా ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు.
ప్రజెంటింగ్ స్పాన్సర్‌గా డ్యూక్స్ వ్యాపి, అసోసియేట్ స్పాన్సర్ గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరించాయి. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష కేంద్రంలో తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించారు. జ్ఞాననికేతన్ ఎయిడెడ్ స్కూల్ కరస్పాండెంట్ సునీత పరీక్షలను పర్యవేక్షించి, తగిన సహకారం అందించారు.
పిల్లలకు ఎంతో ఉపయోగం
మా అమ్మాయి లాస్య 8వ తరగతి చదువుతుంది. సాక్షి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్ బీ పరీక్ష రాస్తానని చెబితే ప్రోత్సహించాం. ఇంగ్లిష్‌పై పట్టు సాధించేందుకు ఇలాంటి పరీక్షలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
– కట్టా సునీత, విద్యార్థి తల్లి,
విశాఖపట్నం
పోటీతత్వం పెరుగుతుంది
మా పెదబాబు 8, చిన్నోడు 5వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరినీ కూడా సాక్షి మీడియా గ్రూప్ వారు నిర్వహించే స్పెల్ బీ పరీక్ష రాయిస్తున్నాను. పెదబాబు గతంలో కూడా రాష్ట్ర స్థాయి వరకు వెళ్లాడు. ఇలాంటి పరీక్షల వల్ల పిల్లల్లో పోటీ తత్వం పెరుగుతుంది.
– మజ్జి సుజాత, విద్యార్థి తల్లి, గాజువాక