Skip to main content

గురుకులాల్లో సమ్మర్‌ క్యాంపుల హడావుడి!

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో సమ్మర్‌ క్యాంపులకు తెరలేచింది.
Rush of summer camps in Gurukul
గురుకులాల్లో సమ్మర్‌ క్యాంపుల హడావుడి!

ఏప్రిల్‌ 21 నుంచి మే 6వ తేదీ వరకు క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌(ఈఎంఆర్‌ఎస్‌), మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాసంస్థల  సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)ల పరిధిలోని 86 గురుకుల పాఠశాలల్లో ఈ క్యాంపులు నిర్వహించనున్నారు. క్యాంపుల్లో దాదాపు 25 వేల మంది విద్యార్థుల కోసం వివిధ అంశాల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహి స్తారు.

చదవండి: Jobs: గురుకుల కొలువుల ’దరఖాస్తు’లు మొదలు!

సమ్మర్‌ క్యాంపుల్లో విద్యార్థుల ఎంపికకు ప్రతిభను ప్రామాణికంగా తీసుకున్నారు. తరగతికి ఎనిమిది మంది చొప్పున ఒక్కో పాఠశాల నుంచి 40 మంది విద్యార్థులు క్యాంపులో పాల్గొంటారు. ఈ విద్యార్థులకు తోడుగా ఒక్కో టీచర్‌ను ఎంపిక చేస్తారు. నాలుగు సొసైటీల నుంచి 650 మంది ఉపాధ్యాయులు క్యాంపుల్లో పాల్గొననున్నారు. అయితే ఈ ఉపాధ్యాయులకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వడం లేదు. కనీసం ఈఎల్‌(సంపాదిత సెలవులు) కూడా ఇవ్వకపోవడంపట్ల టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమ్మర్‌ క్యాంపులకు హాజరయ్యేందుకు పలువురు నిరాసక్తత వ్యక్తం చేస్తూ వినతులు సమర్పిస్తున్నారు. 

చదవండి: OU: డాక్టరేట్‌ అందుకున్న‌ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌

విద్యార్థుల్లోనూ అయిష్టతే... 

గురుకుల సొసైటీలు నిర్వహిస్తున్న సమ్మర్‌ క్యాంపులపట్ల విద్యార్థులు సైతం అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్యాంపుల్లో ఐదు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. కుటుంబసభ్యులతో గడిపే కాలం తగ్గిపోతుందనే భావన ఎక్కువ మందిలో కనిపిస్తోంది. మరోవైపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, కొన్నిచోట్ల కోవిడ్‌–19 కేసులు పెరుగుతుండటంతో తల్లిదండ్రులు సైతం సమ్మర్‌ క్యాంపులకు పంపేందుకు సాహసించడంలేదు. వేసవి సెలవుల్లో పిల్లలతో ఇలా ప్రత్యేక క్యాంపులు నిర్వహించడం విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధమంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. సమ్మర్‌ క్యాంపులకు అవసరమైన మెటీరియల్‌ సరఫరా, ఏర్పాటు, ఇతరాత్ర సౌకర్యాల కల్పన బాధ్యతలు ప్రైవేటు సంస్థలకు ఇవ్వడాన్ని గురుకుల ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటు సంస్థల కోసమే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

చదవండి: ప్రధాని మోదీతో ఎస్సీ,ఎస్టీ గురుకుల విద్యార్థులు

Published date : 22 Apr 2023 03:58PM

Photo Stories