Department of Education: టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు చేపడతాం
ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపట్టబోమని స్పష్టం చేశారు. ప్రమోషన్లు, బదిలీలకు ఆటంకంగా ఉన్న న్యాయ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. పదోన్నతులు, బదిలీలపై మంత్రి సబిత ఏప్రిల్ 21న ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను మంత్రి ముందుంచారు. విద్యావ్యవస్థను మెరుగుపరిచేందుకు మంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. ఉద్యోగ ఖాళీల భర్తీ కూడా చేపట్టాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి ఎంఈవోలు, డీఈవోలు, డిప్యూటీ డీఈవోల ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు–మనబడి కార్యక్రమం విజయవంతమయ్యేందుకు ఇవన్నీ కీలకమని మంత్రి పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 5,571 ప్రధానోపాధ్యాయుల పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు చెప్పారు. మోడల్ స్కూళ్లలోనూ బదిలీల ప్రక్రియ ఉంటుందన్నారు. అన్ని రకాల బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే నిర్వహిస్తామన్నారు. అలాగే 10,479 భాషా పండితుల పదోన్నతులపై ఉన్న ఆటంకాలను తొలగిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీలు అలుగుబెల్లి నర్సిరెడ్డి, కూర రఘోత్తమ్ రెడ్డి, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, సురభి వాణిదేవి, ఉపాధ్యాయ నేతలు జంగయ్య, శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌రావు, మారెడ్డి అంజిరెడ్డి, విద్యాశాఖ అధికారులు సందీప్‌కుమార్ సుల్తానియా, దేవసేన, లింగయ్య, మదన్ మోహన్ ఈ భేటీలో పాల్గొన్నారు.