Pariksha Pe Charcha 2024: పరీక్షల జ్వరానికి ‘చర్చా’ మాత్ర!
మీరు చేయాల్సిందల్లా ప్రధానమంత్రి ‘పరీక్ష పే చర్చ’ యాప్‌లో ఆన్‌లైన్‌లో నమోదు కావాల్సి ఉంది. ఏటా పరీక్షల ముందు ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ‘పరీక్ష పే చర్చ’ ఇప్పటికే ఆరవ ఎడిషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. ఇప్పుడు 7వ ఎడిషన్ నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
చదవండి: Narendra Modi: అడ్డదారులను నమ్ముకుంటే కష్టాలే
అందులో భాగంగా దేశవ్యాప్తంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేరుగా సంభాషించనున్నారు. పరీక్షలను సమర్థంగా, ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడం, చిరునవ్వుతో ప్రశ్నలకు సమాధానాలు రాసేలా ప్రోత్సహిస్తారు. విద్యార్థులకు పరీక్షలపై భయాన్ని తొలగించేందుకు ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో నమోదుకు జనవరి 12 తుది గడువు
పరీక్షల సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలి.. ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి? వాటిని ఎలా అధిగమించాలి? వారి ఆకాంక్షలు ఏమిటి? వాటిని చేరుకోవడానికి అనుసరించాల్సిన మార్గాలు ఏమిటి? పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఎలా ఉండాలి? ఇలా పలు అంశాలపై శ్రీపరీక్షా పే చర్చాశ్రీ కార్యక్రమం జరుగుతుంది. ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు 9–12 తరగతులు చదివే విద్యార్థులు అర్హులు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి శక్తివంతమైన యువతతో కనెక్ట్ అవుతారు. యువతతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. యువత ఎదుర్కొనే సవాళ్లను, ఆకాంక్షలను మరింతగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం కూడా కలుగుతుంది.
శ్రీపరీక్ష పే చర్చశ్రీ మొదటి ఎడిషన్ 2018 ఫిబ్రవరి 16న ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో నిర్వహించారు. విద్యార్థులు తమ ప్రశ్నను ప్రధానమంత్రిని నేరుగా అడగవచ్చు. ప్రశ్న గరిష్టంగా 500 అక్షరాల లోపు ఉండాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా శ్రీపరీక్ష పే చర్చశ్రీలో పాల్గొనవచ్చు. వారి ఎంట్రీలను కూడా ఆన్‌లైన్‌లో పంపే అవకాశం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కల్పించింది.
చర్చించే అంశాలు (విద్యార్థులకు)
- మీ స్వాతంత్య్ర సమరయోధులను తెలుసుకోండి. మన సంస్కృతి మన గర్వం. నా పుస్తకం నా ప్రేరణ. భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడండి. నా జీవితం, నా ఆరోగ్యం. నా స్టార్టప్ కల. ఎస్‌టీఈఎం విద్య/హద్దులు లేని విద్య. పాఠశాలల్లో నేర్చుకోవడానికి బొమ్మలు, ఆటలు
ఉపాధ్యాయుల కోసం
- మన వారసత్వం. అభ్యాస పర్యావరణాన్ని ప్రారంభించడం. నైపుణ్యం కోసం విద్య. తక్కువ కరిక్యులమ్ లోడ్, పరీక్షలకు భయం లేని వాతావరణం. భవిష్యత్తు విద్య సవాళ్లు.
తల్లిదండ్రుల కోసం
- నా బిడ్డ, నా గురువు. వయోజన విద్య–ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులను చేయడం. కలిసి నేర్చుకోవడం, పెరగడం.
లాగిన్ అవ్వాలిలా..
విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లింక్‌ను క్లిక్ చేసి, మొబైల్ నంబరు లేదా జీ మెయిల్ ఖాతాను పూర్తి చేయాలి. ఓటీపీతో లాగిన్ అయి క్లిక్ చేయాలి. ఓటీపీ రాగానే మళ్లీ లాగిన్ చేయాలి. విద్యార్థులు/ఉపాధ్యాయులు/తల్లిదండ్రులు ప్రాథమిక సమాచారం వివరాలను పూర్తి చేయాలి.
కార్యాచరణ వివరాలను పూర్తి చేసిన తర్వాత థీమ్‌ను ఎంచుకుని 1,500 అక్షరాల లోపు వివరించాలి. పరీక్ష పే చర్చా కార్యక్రమం నిర్వహణకు జిల్లా స్థాయిలో సైన్స్ అధికారులు జిల్లా కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు. అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరీక్ష పే చర్చలో పాల్గొనేలా మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరముంది.
పరీక్ష పే చర్చలో ఎంపికై న సుమారు 2,050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా పీపీసీ కిట్‌లను బహుమతిగా అందజేయనున్నారు.
విజేతలుగా నిలిస్తే..
పరీక్షా పే చర్చా కార్యక్రమంలో విజేతలుగా నిలిచినవారు నేరుగా ప్రధానమంత్రిని కలుసుకునే అవకాశాన్ని పొందుతారు. ప్రతి విజేతకు పరీక్షా పే చర్చా కిట్ అందజేస్తారు. విజేతలకు ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. విజేతలు ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి ఆటోగ్రాఫ్‌ను, ఫొటోతో కూడిన డిజిటల్ సావనీర్‌ను పొందే అవకాశముంది.
సద్వినియోగం చేసుకోవాలి
‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. 9–12 తరగతులకు చెందిన విద్యార్థులకు ఇది చక్కని అవకాశం. అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు, జిల్లా సైన్స్ అధికారి కృషి చేయాలి. జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకురావాలి.
– ఎం.కమలకుమారి, డీఈవో, అమలాపురం.