Central University: సెంట్రల్ వర్సిటీకి ‘నూతన’ శోభ
ఆగస్టు 8న క్యాంపస్‌లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి వీసీ ఎస్‌ఏ కోరి చేతుల మీదుగా అకడమిక్ బ్లాక్‌ను ప్రారంభించారు. ఆగస్టు 12 నుంచి శాశ్వత క్యాంపస్‌లోనే తరగతులు నిర్వహించనున్నారు. శాశ్వత క్యాంపస్ అందుబాటులోకి రావడం గర్వకారణ మని వీసీ అన్నారు. కార్యక్రమంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, వర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
మూడు వర్సిటీలతో ‘అనంత’ చరిత్ర
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం ద్వారా సెంట్రల్ యూనివర్సిటీని జిల్లాకు కేటాయించారు. 2018లో వర్సిటీ ఏర్పాటైంది. జేఎన్‌టీయూ (ఏ)లో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేశారు. అక్కడే పాలక భవనంతో పాటు తరగతులు నిర్వహించారు.
చదవండి: JNTU Mega Job Fair 2024: నిరుద్యోగులకు బంపర్‌ఆఫర్.. జేఎన్‌టీయూలో మెగా జాబ్‌ఫెయిర్
రెండు సంవత్సరాల క్రితం తరగతుల నిర్వహణను సీఆర్‌ఐటీ కళాశాలకు మార్చగా, పాలనా కార్యకలాపాలు మాత్రం జేఎన్‌టీయూ నుంచే కొనసాగాయి. ఈ క్రమంలోనే జంతలూరు వద్ద శాశ్వత క్యాంపస్ అందుబాటులోకి వచ్చింది. ఎక్కడా లేని విధంగా రెండు రాష్ట్ర వర్సిటీలు, ఒక సెంట్రల్ యూనివర్సిటీతో అనంతపురం జిల్లా చరిత్రలో చోటు దక్కించుకుంది.
ప్రధాని మోదీకి ఆహ్వానం..
జంతలూరు వద్ద 491.30 ఎకరాల్లో సెంట్రల్ యూనివర్సిటీ భవనాలు నిర్మిస్తున్నారు. తొలి దశలో రూ.350 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.250 కోట్లు ఖర్చు చేశారు. పాలక భవనం, బాలికల హాస్టల్, బాలుర హాస్టళ్లు రెండు, అకడమిక్ బ్లాక్‌లు రెండు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి.
అక్టోబర్‌లోపు పూర్తి కానున్నాయి. ఆ భవనాల ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. ప్రధాని వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక.. వర్సిటీకి రెండో దశలో రూ.450 కోట్లు మంజూరు కానుంది. ఈ నిధులతో స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆడిటోరియం, సెంట్రల్ లైబ్రరీ, స్టాఫ్ క్వార్టర్స్, బాలికల హాస్టల్ సెకెండ్ బ్లాక్, రెండు అకడమిక్ బ్లాక్స్ నిర్మించనున్నారు.
20 రాష్ట్రాల నుంచి విద్యార్థులు..
ప్రస్తుతం సెంట్రల్ వర్సిటీలో 20 రాష్ట్రాలకు చెందిన 600 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. యూజీ, పీజీలో 24 కోర్సులు నిర్వహిస్తున్నారు. పీహెచ్‌డీ ప్రోగ్రాం ఆరు సబ్జెక్టుల్లో ప్రవేశపెట్టారు.