Collector TS Chetan: నాణ్యమైన భోజనం అందించాలి
ఆగస్టు 8న పుట్టపర్తి మండలం పెడపల్లి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఈఓ మీనాక్షితో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ ఆకలి బాధను దూరం చేయడం, పాఠశాలలో చేరే వారి సంఖ్య పెంచడం, పిల్లల్లో సామాజిక సమ భావన పెంపొందించడం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడమే మధ్యాహ్న పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. మెనూ కచ్చితంగా అమలు చేయాలని, ప్రతి వారం ఆకస్మిక తనిఖీలకు వస్తానన్నారు.
అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన న్యూట్రిషన్ గార్డెన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. ప్రతి రోజూ భోజనం ఎలా ఉంటుంది? గుడ్డు ఇస్తున్నారా? పాఠాలు బాగా చెబుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు.
చదవండి: Guest Faculty Jobs: ప్రభుత్వ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు..
న్యూట్రిషన్ గార్డెన్‌ను చక్కగా చూసుకోవాలని, పర్యావరణ పరిరక్షణ కోసం ఎకో క్లబ్‌లు ఏర్పాటు చేసి మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పాఠశాలల ఆవరణలు అన్నీ చూడ ముచ్చటగా మొక్కలతో కళకళ లాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రసాద్, హెచ్‌ఎం రమామణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.