యువత కోసమే జాతీయ విద్యావిధానం
తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌లో ‘విజన్ ఆఫ్ ఎన్‌ఈపీ–2020 ఆన్ రీసెర్చ్ అండ్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ పారామీటర్స్ ఫర్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్’ అంశంపై శుక్రవారం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన విజయవాడ రాజ్‌భవన్ నుంచి వెబినార్ విధానంలో ప్రసంగించారు. నాణ్యమైన ఉన్నతవిద్య వ్యక్తిగత సాఫల్యంతో పాటు, సమాజానికి ఉత్పాదక సహకారాన్ని అందించాలని చెప్పారు. విద్యార్థులను అర్థవంతమైన, సంతృప్తికరమైన జీవనశైలి కోసం సిద్ధం చేయవలసిన బాధ్యత విద్యాసంస్థలపై ఉందన్నారు. దేశంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నతవిద్య వరకు వ్యవస్థను పునరుద్ధరించడం, పిల్లలు చదువుకు దూరం కాకుండా చూడటమే నూతన విద్యావిధానం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. 2030 నాటికి పాఠశాల విద్యలో 100 శాతం స్థూల నమోదు లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు నూతన విద్యావిధానం దోహదపడుతుందన్నారు. సంపూర్ణ విద్య సమ్మిళిత, సంస్కారవంతమైన, ఉత్పాదక, ప్రగతిశీల, సంపన్న దేశాన్ని నిర్మించేలా చేస్తుందన్నారు. పరిశోధనలు బలంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థల్లో అత్యుత్తమ బోధన, అభ్యాస ప్రక్రియలు మెరుగ్గా ఉంటాయని ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు నిరూపిస్తున్నాయని చెప్పారు. దేశంలో పరిశోధన, ఆవిష్కరణల పెట్టుబడి జీడీపీలో 0.69% మాత్రమే ఉండగా, యూఎస్‌ఏలో 2.8%, ఇజ్రాయెల్‌లో 4.3 శాతం ఉందని తెలిపారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో పరిశోధన సంస్కృతి విస్తరించేలా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ నాణ్యమైన అకడమిక్ పరిశోధనను ప్రేరేపిస్తోందని చెప్పారు.
విద్యారంగానిది కీలకపాత్ర
హైదరాబాద్ రాజ్‌భవన్ నుంచి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ నూతన విద్యావిధానం భవిష్యత్ తరానికి సంపూర్ణ, బహుళ క్రమశిక్షణ విద్యను అందిస్తుందని చెప్పారు. స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని నిర్మించడం, పౌరులందరికీ సమగ్ర అభివృద్ధిని అందించడం, ఆర్థిక వ్యవస్థను పెంపొందించే కార్యకలాపాల్లో విద్యారంగానిది కీలకపాత్ర అని పేర్కొన్నారు. ఏపీ నిట్ డైరెక్టర్ సి.ఎస్.పి.రావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఏపీ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, నిట్ ఇన్ చార్జి రిజిస్ట్రార్ దినేష్‌శంకరరెడ్డి, రీసెర్చ్ కన్సల్టెన్సీ జి.రవికిరణ్‌శాస్త్రి, అసోసియేట్ డీన్ అరుణ్‌కుమార్, డీన్ స్టూడెంట్ అఫైర్స్ వీరేష్‌కుమార్, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.
చదవండి: