Skip to main content

వర్క్‌ ఫ్రం విలేజ్‌

ఒక్క బటన్ నొక్కగానే యావత్‌ ప్రపంచం కళ్లెదుట కనిపించేలా చేసే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఇంటర్నెట్‌. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు, ఐటీ కంపెనీల ఉద్యోగులకు దీని అవసరం అంతా ఇంతా కాదు. వేగవంతమైన ఇంటర్‌నెట్‌తో ఎక్కడి నుంచి అయినా పని చేసే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటి దాకా నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఈ వ్యవస్థ త్వరలో గ్రామాల నడిబొడ్డుకు రాబోతోంది. ఏకంగా 12,979 గ్రామాల్లో వైఎస్సార్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీల రూపంలో అద్భుతం సృష్టించబోతోంది. సరికొత్త ప్రపంచానికి బాటలు వేయనుంది.
వర్క్‌ ఫ్రం విలేజ్‌
వర్క్‌ ఫ్రం విలేజ్‌

వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్లో భాగంగా గ్రామాల నుంచే పని చేసే పరిస్థితి రావాలని, ఇందులో భాగంగా ప్రతి విలేజ్ డిజిటల్ లైబ్రరీకి అంతరాయం లేని బ్యాండ్ విడ్త్తో ఇంటర్నెట్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాజాగా వస్తున్న టెక్నాలజీని వినియోగించుకోవాలని, అన్ని విషయాల్లో ఈ డిజిటల్ లైబ్రరీలు యువతకు దిక్సూచిగా మారాలని సూచించారు. వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు వైఎస్పార్ డిజిటల్ లైబ్రరీలు అన్ని విధాలా ఉపయోగపడాలని, అందుకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

జనవరికి 4,530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం

డిజిటల్ లైబ్రరీల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారు. ప్రతి డిజిటల్ లైబ్రరీలో డెస్క్టాప్ కంప్యూటర్లు, సిస్టం ఛైర్లు, ప్లాస్టిక్ ఛైర్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ఐరన్ రాక్స్, పుస్తకాలు, మేగజైన్ లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో మూడు దశల్లో 12,979 పంచాయతీల్లో వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. జనవరి నాటికి తొలి దశలో 4,530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పూర్తవుతుందని, ఉగాది నాటికి కంప్యూటర్ పరికరాలతో సహా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 2022 డిసెంబర్ నాటికి ఫేజ్–2, 2023 జూన్ నాటికి మూడో దశ డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పూర్తయ్యేలా లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో నిరంతరాయ బ్యాండ్ విడ్త్తో కూడిన ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ సమీక్షలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఎం మధుసూధన్ రెడ్డి, ఏపీటీఎస్ ఎండీ ఎం నందకిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Published date : 30 Oct 2021 12:20PM

Photo Stories