Skip to main content

National Education Policy: సరిహద్దులు దాటి ముందుకు సాగుతున్న విద్య

నూతన విద్యా విధానాన్ని అమలు చేసే క్రమంలో (ఎన్ఈపీ - న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ), మన ఉన్నత విద్యా కోర్సుల్లో విదేశీ విద్యార్థులు కూడా ఎక్కువ సంఖ్యలో చదివే విధంగా కసరత్తులు ప్రారంభమయ్యాయి.

భారతీయ ఉన్నత విద్యను అంతర్జాతీయకరణ చేసే దిశగా చర్యలు మొదలయ్యాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజీసీ) మహాసంకల్పంతో ముందుకు వెళ్తోంది. విదేశీ విద్యార్థులను మన వైపు ఆకర్షించడం ఒక ఆశయం, మన విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండా అంతే ప్రమాణాలు, నాణ్యత కలిగిన ఉత్తమమైన ఉన్నత విద్యను ఇక్కడే అందించాలన్నది మరో మహా సంకల్పం.

చదవండి: Teaching methods: లో కాస్ట్‌, నో కాస్ట్‌ బోధన

ఇప్పటికే 165 దేశాలకు చెందిన సుమారు 50వేలమంది విదేశీ విద్యార్థులు భారతీయ విద్యాలయాల నుంచి వివిధ కోర్శులలో శిక్షణ పొందుతున్నారు. మన దేశానికి చెందిన సుమారు 9 లక్షలమంది విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటున్నారు.

భారతదేశమే ప్రధాన కేంద్రంగా

ఈ దృశ్యాన్ని సమూలంగా మార్చివేసి, స్వదేశీయులతో పాటు విదేశీయులకు కూడా అన్ని చదువులకు భారతదేశమే ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం చాలా గొప్పది.సత్వరమే సాధించాలని ఆకాంక్షిద్దాం. విదేశీ విద్యార్థులను ఆకర్షించే దిశగా భారత్ అనేక ప్రణాళికలను రచిస్తోంది.

మన విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యాలయాల క్యాంపస్ లను పెద్ద స్థాయిలో ఏర్పాటుచేసే దిశగా చర్యలు ముమ్మరమవుతున్నాయి. మన విద్యార్థులు విదేశాల్లో చదువుకోడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీజులు, హాస్టల్స్,పుస్తకాలు ఇలా అనేక రూపాల్లో పెట్టాల్సిన ఖర్చు కూడా లక్షల రూపాయల్లో ఉంటుంది. విద్య ఖరీదైన వస్తువుగా మారి చాలాకాలమైంది.ఇక విదేశాల్లో విద్యంటే? అది అత్యంత ఖరీదైంది.ఈ విద్యను అందుకోవడం సామాన్య ప్రజలకు సాధ్యమవ్వదు.

Dual Degree

విదేశాల్లో ఉన్నత విద్య ఎందరికో అందని ద్రాక్ష.దీని ద్వారా జరుగుతున్న ఫారెన్ ఎక్స్చేంజి కూడా కోట్లాది రూపాయల్లో ఉంది. భారతీయ ఉన్నత విద్యా కోర్సులకు విదేశీ విద్యా కోర్సులను జత చేయడం వలన మన విద్యార్ధులకు అందే జ్ఞానం, పొందే వికాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రాణించే సామర్ధ్యం మన విద్యార్థులకు ఎన్నో రెట్లు పెరగడానికి ఈ విధానాలు ఎంతో ఉపయోగకారి కానున్నాయి.

పీహెచ్ డీ ప్రోగ్రామ్స్ ను విదేశీ విద్యార్థులకు పెద్దఎత్తున అందించే కృషి కూడా జరుగుతోంది.దానికి తగినట్లుగా మన ప్రభుత్వం విధివిధానాలను మారుస్తోంది. మన రిజర్వేషన్ విధానాలకు ఎటువంటి అవరోధం, ఇబ్బందులు రాకుండా విధాన రచన జరుగుతోంది. ఒక పర్యవేక్షక ఆచార్యుడి (ఫ్యాకల్టీ) దగ్గర ఇద్దరు విదేశీ విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు.

డబుల్ డిగ్రీ ప్రోగామ్స్

జాయింట్ డిగ్రీ,డబుల్ డిగ్రీ ప్రోగామ్స్ ను కూడా తీసుకువస్తున్నారు.దీని వల్ల విదేశీ,స్వదేశీకి సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి సమయం,ధనం ఎంతో ఆదా కానున్నాయి. అదే విధంగా అనేక విభాగాల్లో జ్ఞానం,సర్టిఫికెట్,దీక్షాదక్షతలు పెరుగుతాయి.విద్యను ఇలా ఇవ్వడం - పంచుకోవడం ద్వారా 'ఆదాన్ - ప్రదాన్' విధానం విద్యా రంగంలోనూ అమలుకావడం ఉభయతారకం.

జాయింట్ డిగ్రీ, డబుల్ డిగ్రీ విధానంలో విదేశీ విద్యాలయాల క్రెడిట్స్ కూడా మన విద్యార్థులకు అందుతాయి. ప్రపంచ దేశాల విద్యాలయాలను మన విశ్వవిద్యాలయాలకు అనుసంధానం చేసే దిశగా, ఎంఓయూలు కుదుర్చుకోడానికి కృషి ప్రారంభకావడం గొప్ప పరిణామం. ఇందులో భాగంగా విదేశీ రాయబారులతో, విదేశీ మిషన్స్ తో మనవారు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.

Degree

విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్ లు భారత విద్యాలయాల్లో వేగిరం స్థాపించే దిశగా కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఫైనాన్స్,ఎకనామిక్స్, మ్యూజిక్,హిస్టరీ... ఇలా అనేక సబ్జెక్ట్స్ ను ఏకకాలంలో చదువుకోవడమే కాక, సర్టిఫికెట్స్ కూడా పొందగలగడం ప్రతి విద్యార్థికీ,ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు పెద్ద వరం. ఉన్నత విద్య అంతర్జాతీయకరణం జరగడం వల్ల మన విద్యార్థుల ప్రతిభ,వ్యుత్పత్తులు (పాండిత్యం - స్కాలర్ షిప్) గణనీయంగా పెరుగుతాయి.

చదవండి: Primary Education: ‘ప్రాథమిక’ విద్యపై ప్రత్యేక శ్రద్ధ

గుజరాత్ లో నిర్మాణమవుతున్న 'గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ' ( గిఫ్ట్ ) - యుజీసీ ద్వయంగా భవిష్యత్తులో అద్భుతాలు జరుగుతాయనే విశ్వాసాన్ని మేధావులు వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం రచిస్తున్న 'నూతన విద్యా విధానం' ప్రపంచంలోని 'విద్యాశాస్త్రం'లో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని విశ్వసిద్దాం. ప్రపంచ స్థాయి ప్రామాణికత,ఔన్నత్యం, నూత్న ఆవిష్కరణలు, విలువైన,సమర్ధవంతమైన పరిశోధనలు,ఉద్యోగ, ఉపాధులను పెంచే ఆచరణీయమైన కోర్సులు, వివిధ రంగాల్లో దేశ ఉత్పాదకతను పెంచే విద్యార్థుల శక్తి జత కలిసి భారతీయ ఘనత ద్విగుణీకృతమయ్యే రోజులు రావాలని బలంగా ఆకాంక్షిద్దాం.

ఈ యజ్ఞంలో భాగస్వామ్యమైన యూజీసీ సేవలను అభినందిద్దాం, ప్రోత్సహిద్దాం. విద్యారంగంలో మనదైన ముద్రను వేసుకుందాం.పూర్వ వైభవం, అపూర్వ ప్రగతి సాధనల దిశగా ప్రభుత్వాలు,ప్రతిఒక్కరూ కలిసి సాగుతారని ఆశిద్దాం.

Masharma, Senior Journalist
                                                         మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ 

 

Published date : 01 Sep 2023 03:53PM

Photo Stories