IIT Hyderabad Student Die by Suicide: ఐఐటీ విద్యార్థి విషాదాంతం
సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కార్తీక్ పరీక్షలో తప్పడంతో మనస్తాపానికి గురై బంగాళాఖాతంలో మునిగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్‌ట్యాంకు తండాకు చెందిన ధనావత్ ఉమ్లా నాయక్, సైదమ్మ దంపతులకు కుమారుడు ధనావత్ కార్తీక్ (20), కుమార్తె సాతి్వక ఉన్నారు. ఉమ్లా నాయక్ వ్యవసాయ పనులు చేస్తుండగా, సైదమ్మ చింతలపాలెంలోని కస్తూర్భా గాంధీ విద్యాలయంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. కాగా కార్తీక్ ఇటీవల విడుదలైన సెమిస్టర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో జూలై 17న రాత్రి క్యాంపస్ నుంచి బయటకు వెళ్లిన కార్తీక్ అప్పట్నుంచీ కన్పించకుండా పోయాడు. జూలై 18న తల్లిదండ్రులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో వారు కళాశాలకు వెళ్లి ఆరా తీశారు. కార్తీక్ బయటకు వెళ్లి తిరిగి రాలేదని సిబ్బంది చెప్పడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జన్మభూమి ఎక్కి విశాఖలో దిగి..
దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించగా..18వ తేదీ ఉదయం కార్తీక్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కినట్లు కన్పించింది. అతను అదేరోజు రాత్రి విశాఖలో దిగడం, రాత్రి 9.30 సమయంలో ఆర్‌కే బీచ్‌లోని ఓ బేకరీలో ఏవో కొనడం కూడా సీసీ టీవీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. కార్తీక్ విశాఖపట్నంలో కన్పించినట్టు పోలీసులు ఇచ్చి న సమాచారంతో అతని తల్లిదండ్రులు అక్కడి తమ బంధువులకు విషయం చెప్పారు.
19వ తేదీ నుంచి కుటుంబసభ్యులు, బంధువులు గాలించినా ఆచూకీ దొరకలేదు. కాగా జూలై 21న విశాఖ జోడుగుళ్లపాలెం బీచ్‌కు ఓ యువకుడి మృతదేహం కొట్టుకొచ్చింది. ఆరిలోవ పోలీసులు గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి కేజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. జూలై 25న ఉదయం మృతదేహాన్ని పరిశీలించిన కార్తీక్ తల్లిదండ్రులు అది తమ కుమారుడేనని గుర్తించారు.
కార్తీక్ వారం రోజుల క్రితమే బంగాళాఖాతంలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. అతడి మృతదేహం కుళ్లిపోయింది. సెల్‌ఫోన్ ఐఎంఈఐ నంబరు ద్వారా ఆ మృతదేహం కార్తీక్‌దే అని పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని జలచరాలు తినడంతో పోస్టుమార్టం చేసేందుకు కూడా వీలు కాలేదు. దీంతో శవాన్ని వెంటనే అంబులెన్సులో మిర్యాలగూడ వాటర్ ట్యాంకు తండాకు తరలించి సాయంత్రం వారి వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేశారు.
అమ్మకు బంగారం కొనిస్తానంటివయ్యా..
‘ఉద్యోగం వచ్చి న తర్వాత అమ్మకు బంగారం కొనిస్తానంటివి.. అందరినీ మంచిగా చూసుకుంటా అంటివి.. ఇప్పుడు కనిపించకుండా పోయావా కొడుకా’అంటూ ఉమ్లానాయక్ కుమారుడి మాటలను గుర్తు చేసుకుంటూ రోదించిన తీరు అందరినీ కదిలించింది.